కొలెస్ట్రాల్‌ను  అదుపులో పెట్టుకోవడం ఎలా? | How to control cholesterol? | Sakshi
Sakshi News home page

కొలెస్ట్రాల్‌ను  అదుపులో పెట్టుకోవడం ఎలా?

Published Wed, Jul 18 2018 1:17 AM | Last Updated on Wed, Jul 18 2018 1:17 AM

How to control cholesterol? - Sakshi

లైఫ్‌స్టైల్‌ కౌన్సెలింగ్‌

నా వయసు 47 ఏళ్లు. ఇటీవల ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే రక్తంలో పెరిగిందని రిపోర్డు వచ్చింది. కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల గుండెజబ్బులు వస్తాయని చాలామంది అంటున్నారు. అసలు కొలెస్ట్రాల్‌ అంటే ఏమిటి? కొలెస్ట్రాల్‌ను ఎలా అదుపు చేసుకోవాలో సలహా ఇవ్వండి.   – డి. సరస్వతి, కందుకూరు 
కొలెస్ట్రాల్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఇందులోని ఎల్‌డీఎల్‌ అనే రకాన్ని చెడుకొలెస్ట్రాల్‌గా చెబుతారు. ఎందుకంటే సాధారణంగా రక్తనాళాలు ఒక మంచి రబ్బర్‌ ట్యూబ్‌లా ఎటుపడితే అటు ఒంగేలా మంచి ఎలాస్టిసిటీతో ఉంటాయి. కానీ ఈ ఎల్‌డీఎల్‌ అనేది రక్తనాళంలోపల గారలాగా పట్టేస్తూ ఉంటుంది. దాంతో ఎటుపడితే అటు తేలిగ్గా ఒంగగలిగే రక్తనాళం బిరుసుగా మారడమేగాక లోపలి సన్నబారుతుంది. ఈ కండిషన్‌ను అథెరోస్కి›్లరోసిస్‌ అంటారు. దీని వల్ల గుండెకు రక్తం అందక గుండెపోటు రావచ్చు. కానీ ఇందులోనే మరో రకం కొలెస్ట్రాల్‌ ఉంది. దీన్ని హెచ్‌డీఎల్‌ అంటారు. ఇది మంచి కొలెస్ట్రాల్‌ అన్నమాట. ఇది రక్తనాళంలోపల గారలా పేరుకుపోతున్న చెడుకొలెస్ట్రాల్‌ను తొలుచుకుంటూ, ఒలుచుకుంటూ పోతుంటుంది. అంటే రక్తనాళాల్లోని పూడికను తొలగించే పనిచేస్తుందన్నమాట. అందుకే హెచ్‌డీఎల్‌ పాళ్లు పెరుగుతున్నకొద్దీ గారలా పేరుకునే చెడుకొలెస్ట్రాల్‌ చెక్కినట్లుగా తీసేస్తుంటుంది. అందుకే ఇది గుండెపోటు రాకుండా చూసే కొలెస్ట్రాల్‌ అన్నమాట. ఇక కొవ్వుల్లో మరో రకం కూడా ఉన్నాయి. వాటిని ట్రైగ్లిజరైడ్స్‌ అంటారు. మనం తిన్న ఆహారంలో ఎక్కువ శక్తిని నిల్వ చేసుకునే ప్రక్రియలో ఈ రకం కొవ్వు పుడుతుంది.

అది మళ్లీ రక్తనాళాలు సన్నబడటానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఇది ప్రమాదకరమైనది. ఇది కేవలం ఆహారపు శక్తిని నిల్వచేసే సమయంలోనే గాక... మన శరీర బరువు పెరిగినా, స్థూలకాయం వచ్చినా, తగినంత శారీరక శ్రమ చేయకపోయినా, సిగరెట్లు, మద్యం తాగినా పెరుగుతాయి. కాబట్టి ఈ కొవ్వు మంచిది కాదు. ఇక మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకునేందుకూ, మన గుండెను హార్ట్‌ఎటాక్‌ రిస్క్‌నుంచి తప్పించుకునేందుకు చేయాల్సిన పని ఏమిటంటే... మనం తీసుకునే ఆహారంలో ఎల్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్‌ పెరగకుండా చూసుకోవాలి. అలాగే హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాలి. చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించుకొని, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవాలంటే కరిగే పీచు ఎక్కువగా ఉండే సోయాప్రోటీన్ల వంటి ఆహారంతో పాటు వారానికి కనీసం 150 నిమిషాలు (రోజుకు అరగంట చొప్పున ఐదు రోజులు) వ్యాయామం చేయాలి. దీనివల్ల మంచి కొలెస్ట్రాల్‌ అయినా హెచ్‌డీఎల్‌ పెరుగుతుంది. అదే వ్యాయామం చెడుకొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అందుకే కొలెస్ట్రాల్‌లన్నీ ఒకేలాంటివి కావని గ్రహించడంతో పాటు... వ్యాయామం చేయడం అనే ఒకే చర్య అటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని గ్రహించండి.

నేను ఒక సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌ను. నాకు రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదు. ఒళ్లు అలిసేలా వ్యాయామం చేయమనీ, దాంతో బాగా నిద్రపడుతుందని కొందరు ఫ్రెండ్స్‌ చెబుతున్నారు. అయితే వ్యాయామం చేసేవాళ్లకు అంతగా నిద్రపట్టదని మరికొందరు చెబుతున్నారు. నేను కన్‌ఫ్యూజ్‌ అవుతున్నాను. ఏది నిజమో చెప్పండి.  – ఆర్‌. కౌశిక్, హైదరాబాద్‌ 
మీరు చెప్పిన రెండు అంశాలూ నిజమే. నిద్రకు ఉపక్రమించబోయే మూడు గంటల ముందుగా వ్యాయామం అంత సరికాదు. అలా చేస్తే నిద్రపట్టడం కష్టమే. అయితే రోజూ ఉదయంగానీ లేదా ఎక్సర్‌సైజ్‌కూ, నిద్రకూ చాలా వ్యవధి ఉండేలా గానీ వ్యాయామం చేస్తే మంచి నిద్ర పడుతుంది. ఒళ్లు అలిసేలా వ్యాయామంతో ఒళ్లెరగని నిద్రపడుతుంది. ఉదయం చేసే వ్యాయామంతో ఒత్తిడి నుంచి దూరమవుతారు. అయితే ఉదయం వేళ చేసే వ్యాయామం పగటి వెలుగులో అయితే మరింత ప్రభావపూర్వకంగా ఉంటుంది.  మీరు ఉదయం వేళలో వ్యాయామం చేయలేకపోతే అది సాయంత్రం వేళ అయితే మంచిది. మీ రోజువారీ పనుల వల్ల అప్పటికి మీ శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త పెరిగి ఉంటుంది. ఇక నిద్రవేళకు మన శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంటుంది. కానీ వ్యాయామంతో మళ్లీ శరీరాన్ని ఉత్తేజపరచడం జరుగుతుంది. ఇక కార్డియోవాస్క్యులార్‌ వ్యాయామాల వల్ల గుండె స్పందనల వేగం, రేటు పెరుగుతాయి. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. వీటన్నింటి ఉమ్మడి ప్రభావాల  వల్ల నిద్ర తగ్గుతుంది. అంతేకాదు... వ్యాయామం ముగిసిన 20 నిమిషాల తర్వాతగానీ గుండె కండరాల రక్తం పంపింగ్‌ ప్రక్రియ సాధారణ స్థితికి రాదు.

 అందుకే వ్యాయామానికీ, నిద్రకూ మధ్య వ్యవధి ఉండేలా చూసుకోవాలన్న మాట. ఇక స్ట్రెచింగ్‌ వ్యాయామాలు, బలాన్ని పెంచుకనే స్ట్రెంగ్త్‌ ట్రెయినింగ్‌ తరహా వ్యాయామాలూ శరీరానికి మేలు చేసినా... అవేవీ కార్డియోవాస్క్యులార్‌ వ్యాయామాలకు సాటిరావు. యోగా ప్రధానంగా తనువునూ, మనసునూ రిలాక్స్‌ చేసే ప్రక్రియ. మీ ఫ్రెండ్స్‌లో కొందరు చెప్పినట్లుగా దీర్ఘకాలిక నిద్రలేమికి వ్యాయామం విరుగుడు. అందుకే మరీ తీవ్రంగా (విగరస్‌గా) కాకుండా... మరీ చేసీచెయ్యనట్లు (మైల్డ్‌)గా కాకుండా... మాడరేట్‌ ఎక్సర్‌సైజ్‌ చేయండి. కంటినిండా నిద్రపోండి. వాకింగ్, జాగింగ్, జంపింగ్, స్విమ్మింగ్, టెన్నిస్‌ ఆడటం, డాన్స్‌ చేయడం లాంటి ఏ ప్రక్రియ అయినా వ్యాయామానికి మంచిదే. అయితే మీకు గుండెజబ్బులూ, స్థూలకాయం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే వ్యాయామాలు మొదలుపెట్టే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, మీకు తగిన వ్యాయామాలు సూచించమని అడగడం మేలు. 
డాక్టర్‌ సుధీంద్ర ఊటూరి
లైఫ్‌స్టైల్‌ స్పెషలిస్ట్,  కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement