సింగిల్ జాగ్రత్త... డబుల్ మేలు!
పరిపరిశోధన
గుండెకు మంచి కోరుతూ మనం పాటించే అంశాలు... మెదడుకూ మేలు చేస్తాయి. గుండె, మెదడు విషయంలో ఇది చాలా ఎక్కువని తేలింది. అమెరికాకు చెందిన పరిశోధకులు దాదాపు వెయ్యికి మందికి పైగా వ్యక్తులపై ఆరేళ్ల పాటు నిర్వహించిన ఒక అధ్యయనంలో తెలిసింది. ఇందుకోసం సగటు వయసు 72 ఏళ్లు ఉన్న 1,033 మందిని అధ్యయనం కోసం ఎంచుకున్నారు. వారంతా గుండె జబ్బుల నివారణ కోసం పాటించాల్సిన నియమాలను పాటించేలా చూశారు.
వాళ్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా, బరువును అదుపులో ఉంచుకునేలా, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేలా, పొగాకుకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆరేళ్ల తర్వాత వారిలోని మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి వంటి అంశాలను పరీక్షించారు. అప్పుడు వాళ్లలోని చాలామందిలో మెదడు పనితీరు (ప్రాసిసెంగ్) వేగం, జ్ఞాపకశక్తి, ఏదైనా పనులను అర్థం చేసుకునే అవగాహన వంటి అంశాలు చాలా చురుగ్గా ఉన్నాయని తేలింది. ఇదే విషయాన్ని ఆ పరిశోధకులు ‘ద జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు.