పక్షవాతం వంశపారంపర్యమా? | High Blood Pressure And Diabetes Are The Main Causes Of Paralysis | Sakshi
Sakshi News home page

పక్షవాతం వంశపారంపర్యమా?

Published Mon, Dec 16 2019 12:07 AM | Last Updated on Mon, Dec 16 2019 12:07 AM

High Blood Pressure And Diabetes Are The Main Causes Of Paralysis - Sakshi

నా వయసు 36 ఏళ్లు. మేము ముగ్గురు అన్నదమ్ములం. మా నాన్నగారు నా చిన్నతనంలో పక్షవాతానికి గురయ్యారు. అప్పట్లో సరైన వైద్యసౌకర్యాలు లేకపోవడంతో మంచానపడి పదేళ్లపాటు నరకం అనుభవించి చనిపోయారు. నా పెద్దతమ్ముడికి 29 ఏళ్లు. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. నెల్లాళ్ల కిందట ‘బ్రెయిన్‌స్ట్రోక్‌’కు గురయ్యాడు. వెంటనే మంచి వైద్యం ఇప్పించడం వల్ల వెంటనే కోలుకున్నాడు.

కుడి చేయి, కుడి కాలు ఇంకా స్వాధీనంలోకి రాలేదుగానీ ప్రాణాపాయం లేదనీ, ఫిజియోథెరపీ, మందులు వాడటం వల్ల తొందరలోనే కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. ఇప్పుడు నాకూ, మా చిన్న తమ్ముడికి ఒక భయం పట్టుకుంది. నాన్నగారిలా, తమ్ముడిలా మాకూ పక్షవాతం వస్తుందా? ‘బ్రెయిన్‌స్ట్రోక్‌’ వంశపారంపర్యంగా వచ్చే జబ్బా? పక్షవాతం గురించి వివరాలను విపులంగా తెలియజేయండి.

పక్షవాతం (బ్రెయిన్‌స్ట్రోక్‌) వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. ఈ విషయంలో మీరు ఎలాంటి భయాలూ, ఆందోళనలూ పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి. మీ ఫ్యామిలీ హిస్టరీలో పక్షవాతం ఉంది కాబట్టి బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారితీసే ఇతర రిస్క్‌ ఫ్యాక్టర్స్‌... అంటే అధిక రక్తపోటు, డయాబెటిస్, హైకొలెస్ట్రాల్‌ వంటి వంశపారంపర్య వ్యాధుల పట్ల మీ కుటుంబ సభ్యులు జాగ్రత్త వహించాలి. మీరు క్రమం తప్పకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకుని, ఒకవేళ ఏమైనా తేడాలుంటే క్రమం తప్పకుండా మందులు వాడుతూ, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బ్రెయిన్‌స్ట్రోక్‌ ముప్పు నుంచి కాపాడుకోవచ్చు. పరిశోధనల ప్రకారం మహిళల కంటే పురుషుల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. పక్షవాతంలో రెండు రకాలున్నాయి.

ఇస్కిమిక్‌ స్ట్రోక్‌ : మెదడు మొత్తానికి నాలుగు రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇందులో రెండు రక్తనాళాలు మెదడు ఎడమవైపునకూ, రెండు కుడివైపునకూ వెళ్తాయి. ఈ రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకడితే రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దాంతో మెదడుకు రక్తసరఫరా సరిగా జరగక, కణాలు చచ్చుబడిపోయి పక్షవాతం వస్తుంది. దాదాపు 80 శాతం కేసుల్లో ఇదే కారణం.

హేమరేజిక్‌ స్ట్రోక్‌ : రక్తనాళాల్లో ఏదైనా చిట్లిపోయి, రక్తం బయటకు రావడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి. ఈ తరహా పక్షవాతం 20 శాతం కేసుల్లో కనిపిస్తుంటుంది.  
ఈ రెండు కారణాల వల్ల ఎడమవైపు మెదడు భాగాలు దెబ్బతింటే శరీరంలోని కుడివైపున ఉండే అవయవాలు, కుడివైపు మెదడు భాగాలు దెబ్బతింటే ఎడమ వైపున ఉండే అవయవాలు దెబ్బతింటాయి.

కారణాలు : పక్షవాతం రావడానికి ప్రధాన కారణాలు అధిక రక్తపోటు. డయాబెటిస్‌. డ్రగ్స్, అధిక ఒత్తిడి కూడా ఇందుకు కారణాలే. ఇంతకుమునుపు ఇవి అరవై ఏళ్ల వయసులో కనిపించేవి. కానీ ఇప్పుడు మూడు పదుల్లోనే కనిపిస్తున్నాయి. అందుకే పక్షవాతం ఇప్పుడు చాలా చిన్న వయసువారిలోనూ కనిపిస్తోంది.  

ఎలా గుర్తించాలి :
►మాటలో తేడా రావడం, నత్తినత్తిగా రావడం
►విన్నది అర్థం చేసుకోలేకపోవడం
►మూతి పక్కకి వెళ్లిపోవడం
►ఒకవైపు కాలు, చెయ్యి బలహీనం కావడం
►నడిస్తే అడుగులు తడబడటం... ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సీటీ స్కాన్‌ చేసి, తక్షణం చికిత్స మొదలుపెట్టాలి.
 పక్షవాతం వచ్చిన మూడు నుంచి నాలుగున్నర గంటలలోపు చికిత్స అందించగలిగితే శరీరం చచ్చుబడకుండా కాపాడవచ్చు. ఇక ప్రధాన చికిత్స తర్వాత  పక్షవాతం నుంచి పూర్తిగా కోలుకోడానికి ఫిజియోథెరపీ చికిత్స కూడా అవసరమవుతుంది.
డా. జయదీప్‌ రాయ్‌ చౌధురి, సీనియర్‌ ఫిజీషియన్,
యశోద హస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement