పాదాల వాపుకి గుండె జబ్బులకు సంబంధం ఏమిటీ..? | Are Swollen Feet A Sign Of Heart Failure | Sakshi
Sakshi News home page

పాదాల వాపుకి గుండె జబ్బులకు సంబంధం ఏమిటీ..?

Published Sun, Sep 22 2024 8:50 AM | Last Updated on Sun, Sep 22 2024 10:03 AM

Are Swollen Feet A Sign Of Heart Failure

పాదాల వాపు ఒక్కోసారి గుండెజబ్బును సూచించవచ్చు. అయితే పాదాలు వాచినప్పుడు రెండు పాదాలూ వాచాయా, కేవలం వాపేనా లేదా నొప్పి కూడా ఉందా అని పరిశీలించాలి. మొదట కాలి ముందు భాగం, మడమ దగ్గర వాపు ఉండి, తర్వాత పాదం పైకి పాకుతూ నొప్పి లేనిదైతే అది గుండె
జబ్బును సూచించవచ్చు. 

మామూలుగా గుండెదడ, ఆయాసం వంటి లక్షణాలుంటే గుండెజబ్బుగా అనుమానిస్తారు. కానీ పైన పేర్కొన్న వాపు లక్షణాలు చూశాక వాటితో పాటు ఆయాసం, గుండెదడ, ఛాతీనొప్పి వంటి లక్షణాలు ఉన్నా లేకపోయినా ఒకసారి గుండెజబ్బుల నిపుణులను కలవడం మేలు.  

గుండెజబ్బులకూ, పాదాలవాపునకూ సంబంధమేమిటి? 
గుండె పంపింగ్‌ సామర్థ్యం తగ్గినప్పుడూ, అలాగే గుండె సంకోచించే శక్తి లేదా వ్యాకోచించే సామర్థ్యం లోపించినప్పుడు కాళ్ల వాపు కనిపించవచ్చు. రక్తపోటు పెరిగినప్పుడూ పాదాల్లో వాపు రావచ్చు. గుండెజబ్బు కారణంగా ఇలా కాళ్ల వాపు వచ్చిందా అనే విషయం తెలుసుకోడానికి ప్రో బీ–టైప్‌ నేట్రీయూరేటిక్‌ పెప్టైడ్‌ (ప్రో – బీఎన్‌పీ) అనే రక్తపరీక్ష చేయించాల్సి ఉంటుంది. 

ఈ పరీక్షలో ప్రో బీఎన్‌పీ విలువ 75 ఏళ్ల లోపు ఉన్న వారికి 125 కంటే తక్కువ లేదా 75 ఏళ్లకు పైబడినవారిలో 450 కంటే ఎక్కువ ఉంటే అది గుండె వైఫల్యం (హార్ట్‌ ఫెయిల్యూర్‌) కావచ్చేమోనని డాక్టర్లు అనుమానిస్తారు. అప్పుడు గుండెకు సంబంధించిన ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ వంటి పరీక్షలు చేయించి గుండెజబ్బును నిర్ధారణ చేస్తారు.   

సిరల సామర్థ్యం తగ్గినా పాదాల వాపు... 
కొన్ని సందర్భాల్లో కాళ్లలోని సిరల సామర్థ్యం తగ్గడం వల్ల రక్తంలోని నీరు అక్కడే ఉండపోతుంది. అది పాదాలవాపులా కనిపిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎక్కువసేపు నిల్చుని పనిచేసేవారిలో లేదా ఊబకాయం ఉన్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువ. ఇలా కాలివాపు కనిపించినప్పుడు ఈ సమస్యనూ అనుమానించాల్సి ఉంటుంది. 

తొలి దశలో ఎక్కువసేపు ప్రయాణం చేసినప్పుడు సాయంత్రానికి కాళ్ల వాపు కనిపిస్తుంది. అయితే చాలామందిలో ఇది సాధారణంగా కనిపించేది కాబట్టి సహజంగా ఈసమస్యను పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. ఈ సమస్య ఉన్నవారిలో పిక్కల్లో నొప్పి, కాళ్లు బరువుగా ఉన్నట్లు అనిపించడం కూడా ఉంటాయి. 

క్రమేణా కాళ్లపైనా, మడమ లోపలి వైపున నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కాలి సిరలు ఉబ్బి మెలికలు తిరిగినట్లుగా పచ్చగా లేక నల్లగా చర్మంలోంచి ఉబ్బినట్లు బయటకు కనిపిస్తుంటాయి. తొలి దశలో సాయంత్రం మాత్రమే కనిపించే ఈ సమస్య తర్వాత్తర్వాత రోజంతా ఉంటుంది. 

సిరల సామర్థ్య లోపంవల్ల కాళ్లవాపు సమస్య వస్తే...
ఎక్కువసేపు నిలబడకుండా చూసుకోవడం. 
ఎలాస్టిక్‌ స్టాకింగ్స్‌ వేసుకుని ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. స్టాకింగ్స్‌ వల్ల కాలిపై ఒత్తిడి పడి, అవి సిరలకు మంచి పటుత్వాన్ని ఇస్తాయి. ఈ దశలో నిర్లక్ష్యం చేయడం వల్ల అది ముదిరి వేరికోస్‌ వెయిన్స్‌ అనే వ్యాధిగా పరిణమించే అవకాశముంది. ఈ వ్యాధిని తొలిదశలోనే తెలుసుకోవడం కోసం కాలి సిరలకు వీనస్‌ డాప్లర్‌ టెస్ట్‌ అనే పరీక్ష చేయించాలి. వ్యాధి బాగా ముదిరితే కాళ్లకు పుండ్లు కూడా పడవచ్చు. అందుకే ముందే కనుగొని చికిత్స తీసుకోవడం మేలు. 

ఊపిరితిత్తుల్లో రక్తపోటు-పాదాల వాపు
ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడం వల్ల కూడా పాదాలకు నీరు పట్టి వాపు కనిపించవచ్చు. ఇటీవల ఊబకాయం వల్ల స్లీప్‌ ఆప్నియా అనే కండిషన్‌ చాలా మందిలో కనిపిస్తోంది. దీనితో ఊపిరితిత్తుల్లో రక్త΄ోటు కూడా పెరగవచ్చు.  

స్లీప్‌ ఆప్నియాలో లక్షణాలివి :

  • గురకపెట్టడం 

  • నిద్రలోంచి అకస్మాత్తుగా మెలకువ రావడం 

  • దగ్గుతో పలమారి నిద్రనుంచి మేల్కొనడం 

  • నిద్రలో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం 

  • రోజంతా అలసట. 

వైద్యపరీక్షలు : లంగ్స్‌లో రక్తపోటు పెరుగుదలను నిర్ధారణ చేయడానికి ఎకో పరీక్ష చేయించాలి. కాళ్ల వాపులు వచ్చేవారిలో 45 ఏళ్లు దాటితే... వారికి ఎకో పరీక్ష తప్పనిసరి. 

చికిత్స : లంగ్స్‌లో రక్తపోటు కారణంగా వచ్చే స్లీప్‌ ఆప్నియా (గురక) ఒక్కోసారి ప్రాణాంతకమూ కావచ్చు కాబట్టి వారు తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి. చికిత్సతో కాళ్లు వాపులూ తగ్గుతాయి. 

కొన్ని మందుల వల్ల..
కొన్ని మందులు వాడుతున్నప్పుడు కూడా కాళ్ల వాపు రావచ్చు. రక్తపోటు, నొప్పి నివారణ కోసం వాడే ఇబు్ప్రొఫెన్, డయాబెటిస్‌ అదుపు కోసం వాడే పయోగ్లిటజోన్, ఇతరత్రా సమస్యలకు వాడే కార్టికోస్టెరాయిడ్స్, మానసిక సమస్యలకు వాడే మందులతోనూ కాళ్లవాపులు వస్తాయి. అందుకే కాళ్లవాపుల బాధితులు మందులేమైనా వాడుతున్నారా అని డాక్టర్లు అడిగి తెలుసుకుని, మందుల వల్లనే అని తేలితే ఆపివేస్తారు లేదా మారుస్తారు. 

కారణాలు తెలియని కాళ్ల వాపులు...
మహిళల్లో ముఖ్యంగా 30– 40 ఏళ్లు దాటిన వారిలో కాళ్ల వాపుతో పాటు కొందరిలో ముఖం, చేతుల్లోనూ ఉబ్బు కనిపించవచ్చు. వాళ్లకు అన్ని పరీక్షలూ చేసి ఎలాంటి కారణం లేదని నిర్ధారణ చేసుకుని, అప్పుడు వాపు తగ్గడానికి  డైయూరెటిక్స్‌ వాడతారు. ఏ కారణంతో పాదాలవాపు కనిపిస్తున్నా వాళ్లు ఆహారంలో ఉప్పు తక్కువగా వాడటం మేలు. 

ఇతర వ్యాధులు... కాళ్ల వాపు.. 
కిడ్నీ జబ్బులు,కొన్ని క్రానిక్‌ లివర్‌ డీసీస్‌ లాంటి కాలేయవ్యాధులు, కటి సంబంధిత (పెల్విస్‌ రిలేటెడ్‌) క్యాన్సర్‌లలో కూడా కాళ్ల వాపులు కనిపిస్తాయి. కాలు బాగా నునుపుగా ఎర్రగా కనిపించే సెల్యులైటిస్, బోదకాలు (ఫైలేరియాసిస్‌) వంటి ఇన్ఫెక్షన్లలో, రియాక్టివ్‌ ఆర్థరైటిస్‌ వంటి ఇన్‌ఫ్లమేటరీ కండీషన్లలోనూ కాళ్లవాపులు రావచ్చు. 

ఇవి కనిపించినప్పుడు తొలుత అవి గుండె సంబంధిత కారణాలతోనా అని మొదట అనుమానించాలి. ఆ అంశాన్ని రూల్‌ అవుట్‌ చేసుకున్న తర్వాత ఇతర కారణాలను అన్వేషించాలి. అవన్నీ కాకుండా అవి కేవలం  నిరపాయకరమైన (బినైన్‌) వాపు మాత్రమే అని గుర్తిస్తే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరముండదు.  
డా. టీ.ఎన్‌.జే. రాజేశ్‌, సీనియర్‌ ఫిజీషియన్‌ 

(చదవండి: శ్లోకా మెహతా స్టైలిష్‌ లెహంగాలు రూపొందించిందే ఆ మహిళే..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement