ఈ పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ సురక్షితమేనా? | In these situations, bypass surgery safe? | Sakshi
Sakshi News home page

ఈ పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ సురక్షితమేనా?

Published Fri, Sep 9 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

ఈ పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ సురక్షితమేనా?

ఈ పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ సురక్షితమేనా?

కార్డియాలజీ కౌన్సెలింగ్
మా నాన్నగారి వయసు 55 ఏళ్లు. ఏడాది కిందట ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో అప్పుడు యాంజియోప్లాస్టీ చేసి ఒక స్టెంట్ వేశారు. కొన్ని నెలల పాటు బాగానే ఉన్నారు. సాయంత్రాల పూట అలా వాకింగ్‌కు కూడా వెళ్లి వచ్చేవారు. కానీ కొన్ని రోజుల నుంచి ఆయన తీవ్రమైన ఆయాసానికి గురవుతున్నారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే గుండెకు సంబంధించిన మూడు వాల్వ్స్ లో పూడికలు ఏర్పడ్డాయని, వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మా నాన్నగారికి బీపీతో పాటు, షుగర్ కూడా ఉంది. ఈ వయసులో ఆయన సర్జరీని తట్టుకోగలరా? రిస్కేమైనా ఉంటుందా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వగలరు.
- సురేశ్, హైదరాబాద్
 
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు (బ్లాక్స్) వస్తే బైపాస్ ఆపరేషన్  చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒకటి లేదా రెండు బ్లాక్స్ ఏర్పడితే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్లు వేయవచ్చు. మీరు చెప్పిన విషయాలను బట్టి చూస్తే మొదట్లో మీ నాన్నగారికి అలానే వేశారు. అయితే ఈసారి మీ నాన్నగారి గుండె రక్తనాళాల్లో ఎక్కువగా బ్లాక్స్ ఏర్పడినట్లు పరీక్షల ద్వారా తేలి ఉండవచ్చు. అందుకే డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని సూచించి ఉంటారు. ఇక మీ సందేహాల విషయానికి వస్తే మీరు మీ నాన్నగారి విషయంలో ఎలాంటి భయాందోళనలూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా బైపాస్ సర్జరీ 50 ఏళ్లు దాటిన వాళ్లకి, అది కూడా గుండె స్థితిని బట్టి డాక్టర్లు నిర్వహిస్తుంటారు.

ఒకప్పటిలాగా ఇప్పుడు గుండెకు సంబంధించిన ఆపరేషన్ అంటే కలవరడాల్సిన అవసరం లేదు. వైద్యరంగంలో అత్యాధునిక చికిత్సా ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే నిపుణులైన డాక్టర్లు కూడా ఉన్నారు. అందులో భాగంగానే ‘మినిమల్లీ ఇన్వేజివ్’ అనే  అత్యాధునిక పద్ధతి ద్వారా ఛాతీ ఎముకలను కట్ చేయకుండానే కేవలం చిన్నకోత ద్వారా గుండె బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించవచ్చు. ఈ పద్ధతిలో వైద్యులు కొన్ని ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగించి శస్త్రచికిత్సలను సులువుగా, విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సర్జరీ సమయంలో గుండెను బయటకు తీసి దానికి బదులుగా ఒక మెషిన్‌ను కొన్ని గంటల పాటు రక్తం పంపింగ్ కోసం సపోర్టుగా వాడుకుంటారు.

వాల్వ్‌లలో ఏర్పడిన పూడికలను తీసివేసిన అనంతరం మళ్లీ గుండెను యధాస్థానంలో విజయవంతంగా అమర్చి ఆపరేషన్‌ను పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా కోత చిన్నగా, రక్తస్రావం తక్కువగా ఉండటం వల్ల నొప్పి కూడా పెద్దగా ఉండదు. ఇన్ఫెక్షన్ కూడా సోకదు. 3 - 4 రోజుల్లో పేషెంట్‌ని డిశ్చార్జ్ చేస్తారు. ఇక మీ నాన్నగారి బీపీ, షుగర్ లెవల్స్ విషయానికి వస్తే... సర్జరీకి ముందే డాక్టర్లు అన్ని పరీక్షలను నిర్వహిస్తారు. నిపుణుల అభిప్రాయాలను తీసుకునే ఆపరేషన్‌కు ఉపక్రమించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకుండా మీ నాన్నగారికి మంచి ఆసుపత్రిలో, నిపుణులైన వైద్యుల ద్వారా చికిత్సను అందించండి.
- డాక్టర్ ఆరుముగమ్
సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్,యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

నెఫ్రోటిక్‌ సిండ్రోమ్కు మందులు చెప్పండి...
ఆయుర్వేద కౌన్సెలింగ్
నా వయసు 52 ఏళ్లు. గత 20 ఏళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. మందులు వాడతున్నాను. అదుపులో ఉంది. ప్రస్తుతం వారం రోజుల క్రితం జ్వరం వచ్చి మూడు రోజులుగా బాధపడ్డాను. అది తగ్గి ఒళ్లంతా వాపులు, ముఖం ఉబ్బిపోవడం జరిగింది. అన్ని పరీక్షలూ చేసి డాక్టర్లు ‘నెఫ్రోటిక్ సిండ్రోమ్’ అన్నారు. దీన్ని సంపూర్ణంగా పోగొట్టడానికి ఆయుర్వేద చికిత్స తెలపండి.
 - యు.వి. కృష్ణమూర్తి, బెంగళూరు
 
ఆయుర్వేద పరిభోషలో వాపుని ‘శోథ’ అంటారు. మీకు సర్వాంగశోథ వచ్చింది. మూత్రాపిండాలు ‘నెఫ్రానులు’ అనే అతిన్న పరికరాల సముదాయంతో తయారవుతాయి. ఇవి రక్తాన్ని వడగట్టడం ద్వారా మూత్రాన్ని తయారు చేసి, శరీరానికి అవసరం లేని వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు విసర్జిస్తాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని కారణాల వల్ల నెఫ్రానుల్లో గొట్టాలు బలహీనపడి, అతి ముఖ్యమైన, శరీరానికి బలాన్ని సమకూర్చే ప్రోటీన్లను మూత్రం ద్వారా బయటకు పంపించేస్తాయి. దీనివల్ల ఒళ్లంతా వాపు, రక్తహీనత, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ రుగ్మతకు కొన్ని తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, విషాలు, హెవీమెటల్స్, అలర్జీ కలిగించే పదార్థాలు, కొన్ని మందుల దుష్ర్పభావాలు కారణమవుతాయి. ఈ కింద వివరించిన విధంగా ఆహార విహారాలు పాటించి, మందులను క్రమం తప్పకుండా వాడితే ఈ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ముందు, రెండు వారాల పాటు పాటించాల్సినవి...
ఆహారం :
ఉప్పుని 95 శాతం తగ్గించి, నామమాత్రంగా వేసి, జావలు (బార్లీ జావ, బొంబే రవ్వ జావ మొదలైనవి) తయారు చేసుకొని మూడుపూటలా తాగాలి. కేవలం మెత్తగా చేసిన పెరుగన్నం తినండి. నిమ్మరసం పిండిన మజ్జిగను పుష్కలంగా తాగండి. ఇడ్లీని తేనెతో రోజూ తినండి. పెసరకట్టు, కందికట్టు పలచగా చేసుకొని, పుల్కాలను వాటిలో నానబెట్టి తినండి. ఖర్జూరం తినండి, (డయాబెటిస్, రక్తపోటులను మాత్రం నియంత్రించుకోవాలి).

విహారం : పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఇంట్లోనే అటు ఇటు తిరుగుతుండండి. భారీ పనులు చేయవద్దు. తగినంత నిద్ర, మానసిక స్థైర్యం ఉండాలి.
 
మందులు :
కోక్షురాది గుగ్గులు (మాత్రలు) ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ( వారం రోజులు); వారం తర్వాత ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1
చంద్రప్రభావటి (మాత్రలు) ఉదయం 1, మధ్యాహ్నం 2, రాత్రి 1 (వారం రోజులు); వారం తర్వాత ఉదయం 1, రాత్రి 1
యష్టిమధు (మాత్రలు) ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 (మొదటి వారం); వారం తర్వాత ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1
పునర్నవాది మండూర (మాత్రలు) ఉదయం 1, రాత్రి 1 (రెండు వారాలు)
వరుణాది క్వాధ (ద్రావకం) : 4 చెంచాలు రెండుపూటలా సమానంగా నీళ్లు కలిపి.
 
రెండు వారాల తర్వాత :
యష్టిమధుచూర్ణ 2 గ్రాములు + గోక్షురాది చూర్ణం 3 గ్రాములు - కలిపి ఒక మోతాదుగా తేనెతో తీసుకోవాలి. రోజూ రెండు మోతాదులు మూడు నెలల పాటు వాడండి.
రోజూ ఒక ఉసిరికాయ తినండి లేదా ఆమలకీ స్వరసం రెండు చెంచాలు సేవించండి.
 
గమనిక : వ్యాధి కారణాలను గుర్తుంచుకొని జాగ్రత్త వహించండి. బలకరమైన, మూత్రం సాఫీగా వెళ్లడానికి ఉపకరించే ఆహారాన్ని తీసుకోండి. సహజసిద్ధమైన పానీయాలను (మజ్జిగ, నీరు, బార్లీజావ, అప్పుడప్పుడు చెరకురసం, కొబ్బరినీళ్లు సముచితమైన పరిమాణంలో సేవించండి. నెఫ్రానులకు సంబంధించిన గొట్టాలు తిరిగి ప్రాకృతావస్థకు వస్తాయి.
- డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement