నవ్వింత: మా రాంబాబుగాడి కోడిప్రియత్వం | Rambabu loves hen so much | Sakshi
Sakshi News home page

నవ్వింత: మా రాంబాబుగాడి కోడిప్రియత్వం

Published Sun, Apr 27 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 6:33 AM

నవ్వింత: మా రాంబాబుగాడి కోడిప్రియత్వం

నవ్వింత: మా రాంబాబుగాడి కోడిప్రియత్వం

మొదట్నుంచీ మా రాంబాబు కోడి ప్రియుడు. వాడిదంతా ఓ విచిత్ర ధోరణి. ఈ జాతికి కోడిమాతల్లి చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావురా అంటుంటాడు. కోడీశ్వరార్చన చేయందే ఎవడూ చికెన్ తినకూడదన్నది వాడి సిద్ధాంతం. ఓ రోజు వాడు కోడిని తన మీదకు ఆవాహన చేసుకుని, కోడిని కీర్తిస్తూ ఓ పాట పాడుకుంటూ వస్తున్నాడు. ‘‘ఈ వృకోదరుల బకాసురుల కడుపాకలి లోకంలో/ రక్తంతో రాస్తున్నా కోడిమహాభారతం/ పుడుతూనే చికెను కేడ్చి, పుట్టీ తందూరికేడ్చి/ పెరిగిపెద్ద కాగానే లంచూ డిన్నర్లకేడ్చి/ ఇలా ఇలా మీరంతా ఏడుస్తూ పోతే / మీ కండలు పెంచింది ఈ కండలతో కాదా...’’ వాణ్ని ఆపి ‘‘ఏంట్రా ఇదీ’’ అన్నా.
 
 ‘‘వేటూరికి దీటుగా రాసేశా పాట. కాబట్టి వేటూరికి దీటూరిని నేనేరా’’ అన్నాడు రాంబాబు.  ‘‘నేను మాట్లాడేది పాట గురించి కాదు... నీ కోడి పిచ్చి గురించి’’.  ‘‘కోడి అంటే ఏమనుకున్నావ్ గురూ... ‘రక్తం చిందిస్తాం. రక్తం చిందిస్తాం. మా తుది రక్తపు బొట్టు వరకు మీ సంక్షేమం కోసం పోరాడుతాం’ అని ప్రజాసేవకుల్లా పోజు కొట్టే ఎందరో అంటుంటారు గానీ... నిజానికి అవన్నీ చేసేది కోడేరా. తన స్వార్థం చూసుకోకుండా రక్తమాంసాల్ని జాతిజనులకు తినబెట్టి వాళ్ల రక్తమాంసాల్ని వృద్ధి చేసే నిజమైన కమ్యూనిస్టు కోడేరా’’
 ‘‘కోడి కమ్యూనిస్టా?’’  ‘‘మామూలుగానా? ఎర్రజెండైండైండెన్నీయలో అంటూ నిత్యం తురాయి రూపంలో తన నెత్తిమీద నిత్యం ఎర్రజెండాను మోసే నిజమైన కమ్యూనిస్టు రా బాబు.  కమ్యూనిస్టుల్లా జాతిని మామూలుగానే కాదు... గడియారం కనిపెట్టకముందే తొలితరం అలారంలా జాతిని జాగృతం చేసిన పుంజన్న అలియాస్ కోడీశ్వరన్ మనకు నిజమైన అన్నరా.
 
 అసలు మనం సంక్రాతిని జరుపుకుంటున్నది కొత్త పంట వచ్చినందుకు కాదురా... కొత్త కోడిని కోసుకునేందుకు. అందుకేరా ఈ కోడిపందేల సంస్కృతి సంక్రాంతినాడు వెలసిందనుకుంటా. కోడి అంటే మరెవరో కాదు... టైసన్లు మహ్మదలీలూ పుట్టకముందు... అల్నాటి పల్నాటినాటి నుంచీ కోడిపుంజేరా మన టైసన్లకూ, బైసన్లకూ ఆద్యురాలు’’ అంటూ కొద్దిగా ఆవేశపడ్డాడు మా రాంబాబు.
 
 ‘‘ఇదేదో కొత్త సంగతి చెబుతున్నావేంట్రా?’’  ‘‘నిజమే. ఎలాగ కొత్త పంటతో పొంగలి చేసుకుంటామో... అలాగ కొత్తకోడితో కూర చేసుకోవడం కోసమేనేమోరా ఈ పందేలూ... ఇలా ఏరకంగా చూసినా కోడి కోడే. దాని ఈక ఈకే’’  ‘‘కోడికే కాక దాని ఈకకూ అంత వ్యాల్యూనా?’’ అన్నా.  ‘‘దాని ఈక ఎంత గొప్పదంటే... ఆ ఈక ఒక చివరను కుంచె చేసి వాడిన తొలి ఈఎన్‌టీ నిపుణులు మన తెలుగువాళ్లేరా. ఇలా చూసినా వైద్యరంగానికి కోడి చేసిన సేవలు మరవలేం. ఒక్క వైద్యరంగానికేనా... సినీరంగానికీ కోడి చేసిన సేవలు అమోఘం’’
 
 ‘‘సినీరంగానికి కోడి సేవలా?’’  ‘‘తెలుగు సినీసాహిత్యపు పాటల కిరీటంలో కోడి తురాయే... ఓ కలికితురాయి. ఎన్నో అనర్ఘరత్నాల్లాంటి పాటలకు కోడిమాతల్లే ఇన్‌స్పిరేషన్‌రా. ‘బంగారు కోడి పెట్ట వచ్చెనండీ...’ కోడివల్లే సూపర్‌హిట్ అయ్యిందంటే అతిశయోక్తి కాదు. ఇదేదో కొత్తసినిమా సాహిత్యం అని కొట్టిపారేయకు. అపాతమధురమైన అనేక పాతపాటలకూ కోడి ఒక సబ్జెక్టు. ‘కోడి ఒకా కోనలో... పుంజు ఒక కోనలో... పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కానలో...’ లాంటి కడు కరుణరసభరితమైన పాటల్లోనూ కోడి ఒక కరుణరసాభరితమూర్తికి ప్రతీక. కవి ఈ పోలికను ఎంచుకున్నాడంటే తద్వారా నీకు అర్థమవుతున్నదేమిటి...? కవిరుద్ర ఆరుద్ర ఒక కోడికి ఇచ్చిన ప్రాధాన్యమూ తక్కువేమీ కాదు’’
 
 ‘‘అయితే ఇప్పుడేమంటావ్?’’  ‘‘అందుకే నేనొకటి చేయాలనుకుంటున్నా. మన కోడిమాతల్లి రుణం తీర్చుకోవడం కోసం ‘కోడిపూర్తి’ ఫంక్షన్‌ను రూపొందిస్తున్నా. కోడినామాన్ని కోటిసార్లు రాయడాన్ని ‘కోడికోటి’ అనాలి. ఇలా కోటిసార్లు రాసినవాళ్లు కోడిపూర్తి చేయాలన్నమాట. ఈ సందర్భంగా జరిగే వేడుకలో ఓ కోడి ఫొటో పెట్టి, దాని ముందు పుష్పగుచ్ఛాలు ఉంచాలి. ఈ సందర్భంగా పౌల్ట్రీరంగానికి ఇతోధిక సేవలు చేసిన వాళ్లకు సన్మానం చేయించాలి. కోటి కోళ్లకు దాణా దానం చేయాలని కూడా నా సంకల్పం. మనకోసం అమరులైన కోళ్లకు  నివాళులర్పించే కార్యక్రమం కూడా ఉండాలి. కోడినామ సంకీర్తనలతో అక్కడంతా దద్దరిల్లాలి. ఇలా ఓ సరికొత్త సంప్రదాయోదయానికి, ఒక తొలిపొద్దుకు తొలికూత కూయాలన్నదే నా  సంకల్పంరా’’ అన్నాడు వాడు. ‘‘ఏంతైనా నీది కోడి బ్రెయినురా’’ అంటూ మావాణ్ణి అభినందించకుండా ఉండలేకపోయా.
 - యాసీన్

ప్రియుడు: మాట తప్పి, నన్ను మోసం చేశావు
 ప్రియురాలు: నేనేం చేశాను.

 ప్రియుడు: జీవితాంతం ప్రేమించమన్నావు కదా, మరిపుడు పెళ్లి చేసుకోమంటున్నావు.
 
 పంచ్ పండింది
 లెక్చరర్: వినయ్, లేటెస్ట్ కొటేషన్ చెప్పు
 స్టూడెంట్: మైండ్ జిమ్‌కు పోదామంటే, బాడీ బజ్జుందామంటుంది.
 
 ఇంటర్నెట్ జోకు
 అబ్బాయిలు ఈమెల్స్ చూడరు, రిప్లై ఇవ్వరు!
 అమ్మాయిలు మెయిల్ ఓపెన్ చేస్తారు, చూడకుండా డిలీట్ చేస్తారు.
 
 తండ్రికి తగ్గ కొడుకు
 తండ్రి: తిరుగుబోతులా తయారయ్యావు, ఉద్యోగం వచ్చే వరకు నా ఇంటి గుమ్మం తొక్కకు
 కొడుకు: అప్పుడెలాగూ రావాల్సిన అవసరం లేదులే!
 
 ఆహా.. ఏం పతిభక్తి!
 రమ్య: పొద్దున మీ ఆయనతో గొడవ పడుతున్నావెందుకు?
 సుమ: సినిమా చూస్తుంటే ఛానెల్ మార్చాడు
 రమ్య: ఏ సినిమా?
 సుమ: పతియే ప్రత్యక్ష దైవం.
 
 మాన్పించాడు
 సత్య: నేను వంద మందితో మందు మాన్పించాలని నిర్ణయించుకుని దానికోసం తీవ్రంగా కృషిచేస్తున్నా.
 నిత్య: గ్రేట్, ఇప్పటికి ఎంతమందయ్యారు?
 సత్య: 99 మంది.
 నిత్య: ఇంకొక్కటేగా మిగిలింది, అది త్వరగా చెయ్
 సత్య: అదే ఆలోచిస్తున్నా, నేను మానేస్తే వంద అవుతుంది కదా అని!!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement