మండుతున్న ఎండలకు పౌల్ట్రీ పరిశ్రమ బెంబేలు
వేడిగాలులకు కళ్లు తేలేస్తున్న కోళ్లు
లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 500 వరకు మృత్యువాత
15 శాతం మేర తగ్గిన గుడ్ల ఉత్పత్తి
గత మూడు రోజుల్లో పౌల్ట్రీకి రూ.కోట్లలో నష్టం
సాక్షి, భీమవరం: మండుతున్న ఎండలు పౌల్ట్రీ పరిశ్రమకు గుబులు పుట్టిస్తున్నాయి. వేడిగాలులకు తాళలేక ఫారాల వద్ద వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం కోళ్ల రైతులను కలవరపరుస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోట్లలో నష్టం వాటిల్లి పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోందని పౌల్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
కోస్తాలోని ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గుడ్లు పెట్టే లేయర్ కోళ్లు నాలుగు కోట్ల వరకు ఉండగా, ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయలసీమలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కోటి వరకూ ఉన్నాయి. గుడ్లు పెట్టే దశకు చేరువలోని బ్రోయర్, చిక్స్ మూడు కోట్ల వరకు ఉంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో సాధారణంగా రోజుకు 60 నుంచి 80 కోళ్లు వరకు చనిపోతుంటాయి.
ప్రస్తుతం ఈ మరణాల సంఖ్య 450 నుంచి 500 వరకు చేరింది. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకూ తట్టుకుంటాయి. గత మూడు రోజులుగా 40 డిగ్రీలకు పైబడి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, వేడిగాలుల ప్రభావంతో ముందెన్నడూ లేనంతగా ఈ ఏడాది కోళ్ల మరణాలు పెరిగాయి.
కోస్తా ప్రాంతంలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. ఒక కోడి చనిపోవడం వల్ల రూ.250 వరకు నష్టం వాటిల్లుతుంది.. ఈ మేరకు గత మూడు రోజుల్లో రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల కోళ్లు చనిపోగా పరిశ్రమకు రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా.
పడిపోయిన గుడ్ల ఉత్పత్తి
ఎండల తీవ్రత వల్ల గుడ్ల ఉత్పత్తి 15 శాతం మేర తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రంలో రోజుకు 4.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా వడగాలుల తీవ్రతకు ఆ ఉత్పత్తి 3.49 కోట్లకు తగ్గిపోయింది. డ్రాపింగ్ కారణంగా రోజుకు 61.5 లక్షల గుడ్లను రైతులు కోల్పోవాల్సి వస్తోంది.
ప్రస్తుతం గుడ్డు రైతు ధర రూ.4.85 ఉండగా.. రోజుకు రూ.2.98 కోట్ల చొప్పున మూడు రోజుల్లో రూ.8.95 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లకు ఉపశమన చర్యలతో ఖర్చులు పెరిగిపోయాయి.
వడదెబ్బకు గురికాకుండా కోళ్లకు ప్రత్యేక మందులివ్వడం, ఫారాల్లో వాతావరణాన్ని చల్లబర్చేందుకు చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్ల ఏర్పాటు తదితర జాగ్రత్తలకు తోడు.. పెరిగిన మేత ధరలు, కూలి రేట్లతో నిర్వహణ భారం మారిందని కోళ్ల రైతులంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్డు సరఫరా లేక స్థానిక వినియోగం తగ్గి గుడ్డుకు రైతు ధర పతనమవుతోందని చెబుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి..
ఎప్పుడూ లేనంతగా ఈసారి ఎండల తీవ్రతకు కోళ్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రభుత్వం ఆదుకోకుంటే కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతుంది. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయిస్ గోదాముల్లోని మనుషులు తినడానికి పనికిరాకుండా నిల్వ ఉన్న గోధుమలు, మొక్కజొన్న, నూకలను తక్కువ ధరపై కోళ్ల రైతులకు ప్రభుత్వం అందజేయాలి. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment