గడ్డు కాలం
* ఇతర రాష్ట్రాల్లో తగ్గిన గుడ్డు వినియోగం
* స్థానిక ఎగుమతులపై ప్రభావం
* రైతు వద్ద రూ.2.78లకు తగ్గిన ధర
* వేసవితో 8 శాతం క్షీణించిన ఉత్పత్తి
* రోజుకు సుమారు రూ.87.2 లక్షల నష్టం
* మునుముందు మరింత గడ్డుకాలం
మండపేట : మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన తయారైంది జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి. సీజన్‌లో గుడ్డు ధర తీవ్ర నిరాశపరిస్తే తాజాగా పరిశ్రమకు వేసవి బెడద పట్టుకుంది.
గుడ్డు ధర పతనమవుతోంది. వేసవి గుబులుతో గుడ్ల ఉత్పత్తి ఎనిమిది శాతం మేర పడిపోయింది. మునుముందు 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కానుండటంతో మరింత కష్టకాలం తప్పదని పౌల్ట్రీవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తగ్గిన ఉత్పత్తి, పతనమవుతున్న ధరల రూపంలో కోళ్ల పరిశ్రమకు రోజుకు సుమారు రూ.87.2 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా.
జిల్లాలో సుమారు 1.30 కోట్ల కోళ్లు ఉండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. వీటిలో 60 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా తదితర ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.
శీతల ప్రభావంతో ఎగుమతులకు డిమాండ్ పెరిగి గుడ్డు రైతు ధర జనవరిలో రూ.4.07 పైసలకు చేరి సరికొత్త రికార్డును సృష్టించింది. అయితే కోళ్ల రైతుల ఆశలను ఆవిరి చేస్తూ ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఎండల తీవ్రత మొదలవడంతో వినియోగం తగ్గి స్థానిక ఎగుమతులకు డిమాండ్ తగ్గిపోయింది. బరవాలా, పంజాబ్, తమిళనాడులోని నమ్మక్కల్ ప్రాంతాల నుంచి ఎదురవుతున్న పోటీ స్థానిక ఎగుమతులపై ప్రభావం చూపుతోంది.
జనవరిలో కోస్టల్ ఏరియాలోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా నుంచి రోజుకు సుమారు 160 లారీల గుడ్లు ఎగుమతి కాగా అనేక కారణాలతో క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 130 లారీల గుడ్లు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. దీంతో పౌల్ట్రీల్లో గుడ్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. ఫిబ్రవరి నుంచి గుడ్డు రైతు ధర పతనమవుతూనే వస్తోంది. జనవరి నెలాఖరు నాటికి రూ.4.05 పైసలు ఉన్నరైతు ధర పలు ఒడిదుడుకులకు గురై ప్రస్తుతం రూ.2.78 పైసలకు తగ్గిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ధర మరింత తగ్గుతుందని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి.
ప్రతి గుడ్డుపై 62 పైసల నష్టం
ఎండలు మండుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా జిల్లాలో గుడ్ల ఉత్పత్తి సుమారు ఎనిమిది శాతం మేర తగ్గినట్టు పౌల్ట్రీవర్గాలు అంచనా వేస్తున్నాయి. గత వారం రోజులుగా జిల్లాలో సుమారు 1.01 కోట్లు గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుత గుడ్డు ధర మేరకు తగ్గిన ఉత్పత్తి రూపంలో రోజుకు సుమారు రూ.24.46 లక్షల మేర నష్టం వాటిల్లుతోంది. మరోపక్క తెగుళ్ల నివారణ కోసం మందుల వాడకం, మేత, కూలీల ఖర్చులు పెరిగిపోవడం, వేసవి ఉపశమన చర్యలు తదితర కారణాలతో పౌల్ట్రీల నిర్వహణ భారంతో గుడ్డు రైతు ధర రూ.3.40 పైసలు ఉంటేనే గిట్టుబాటు కాదని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి.
ప్రస్తుత రైతు ధర రూ.2.78 ధర మేరకు రోజుకు ఒక్కో గుడ్డు రూపంలో 62 పైసల వరకు కోళ్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. గిట్టుబాటు కాని ధర రూపంలో పరిశ్రమకు రోజుకు సుమారు రూ.62.74 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు పరిశ్రమ వర్గాలంటున్నాయి. మునుముందు ఎండలు, వేడిగాలుల తీవ్రతతో గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గిపోవడంతో పాటు కోళ్ల మరణాలు పెరిగి గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని కోళ్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎండలతో మరింత సంక్షోభం
ఎండల తీవ్రతతో ఇప్పటికే పరిశ్రమకు వేసవి కష్టాలు మొదలయ్యాయి. ఎగుమతులకు డిమాండ్ లేక ధర తగ్గిపోతోంది. ఎండలు మరింత ముదిరితే వడదెబ్బతో కోళ్ల మరణాలు పెరుగుతాయి. గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గి ఆ మేరకు కోళ్ల రైతులు నష్ట పోవాల్సి వస్తుంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న పరిశ్రమను ఈ ఎండలు మరింత సంక్షోభంలోకి నెట్టేలా ఉన్నాయి.
- పడాల సుబ్బారెడ్డి, జిల్లా నెక్ చైర్మన్, పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు