ఈ పిచ్చికి అదే మందు...! | The hysteria of the same drug ...! | Sakshi
Sakshi News home page

ఈ పిచ్చికి అదే మందు...!

Published Sat, Nov 19 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM

ఈ  పిచ్చికి   అదే మందు...!

ఈ పిచ్చికి అదే మందు...!

హ్యూమర్

‘‘మావాడిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. వాడిని చూస్తేనే చాలా ఆందోళనగా ఉంది. వాడికి కాస్త నువ్వైనా చెప్పురా’’ అందిరాంబాబు వాళ్ల అమ్మ నాతో. ‘‘ఏమైంది?’’ అని అడిగా.  ‘‘నువ్వు వాడిని ఒకసారి కదిలించు. నీకే తెలుస్తుంది’’ అంది ఆవిడ.నాలుగైదు సార్లు పిలిచా. కానీ వాడు విన్నట్లు అనిపించలేదు. దాంతో ఏమిటిది అన్నట్లుగా రాంబాబుగాడి అమ్మగారివైపు చూశా. ‘‘నువ్వు వాడితో మాట్లాడాలనుకుంటున్నాననీ, వాడి ఎదురుగానే ఉన్నానని ఒకసారి వాడికి వాట్సాప్ పెట్టు’’ అంది.ఆ పని చేశాను. కాస్తంత పాజ్ ఇచ్చాక అది టింగుమని మోగింది. అప్పుడు తలెత్తి చూశాడు. ‘‘ఏంట్రా ఈ ధోరణి?’’ అని అడిగా. ‘‘ఏంటో మాట్లాడాలన్నావు’’ అన్నాడు వాడు.‘‘అదే ఇలా సెల్‌ఫోన్‌లో ఇంతగా మునిగిపోవడం ఏమిటి?’’ అని అడిగా. ‘‘ఇదేనా... నువ్వు ఏదైనా చెప్పదలచుకుంటే వాట్సాప్ పెట్టు లేదా మెయిల్ పంపించు’’ అంటూ మళ్లీ మొబైల్‌ఫోన్‌లో తలదూర్చాడు వాడు.

‘‘ఇదీ నాయనా వరస. ఏం మాట్లాడాలన్నా వాట్సాప్ మెసేజ్ పంపాలంటాడు. ‘ఒరేయ్ అన్నం పెట్టాను. తినడానికి లేవరా’ అంటే ఎంతకీ వినలేదు. అప్పుడు వీళ్ల నాన్నగారితో మెసేజ్ పెట్టించా. అప్పుడు కూడా లేవలేదు. పైగా ‘ఏం కూర?’ అని అడుగుతూ మళ్లీ వాళ్ల నాన్నకు మెసేజ్ పంపాడు. అప్పుడాయన కూర ఏమిటో మెసేజ్ పెట్టి, ఆ వంట గిన్నెను ఫొటో తీసి పంపారు. అప్పుడు కూడా నోట్లో నీరూరుతున్నట్లు ఒక స్మైలీ బొమ్మ పెట్టాడు. అప్పుడు వాళ్ల నాన్నగారు వాడిని ముఖం మీద గుద్దుతున్నట్లు ఒక ఫొటో పెట్టి... దాదాపుగా డైనింగ్ టేబుల్ ముందు ఎత్తి కుదేసారు. అప్పుడు గానీ తినలేదురా వాడు’’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు రాంబాబు వాళ్ల అమ్మగారు. 

ఇంతలో వాడి నాన్నగారు కూడా వచ్చారు. ‘‘అదేమిటోరా. పావ్‌లోవ్ అనే సైంటిస్టు గారి కుక్కలాగా బిహేవ్ చేస్తున్నాడనిపిస్తోందిరావీడు’’ అంటూ వాపోయారాయన.‘‘పాల్‌లోవ్ కుక్క ఏమిటండీ?’’ అడిగారు వాళ్లమ్మ గారు.‘‘అప్పట్లో పావ్‌లోవ్ అనే సైంటిస్టు ఉండేవాడట. వాళ్ల కుక్కకు గంట మోగించి, అన్నం పెట్టేవారట. అన్నం పెట్టినప్పుడు దానికి నోట్లో నీరు ఊరాలి కదా. కానీ తన ధోరణికి అలవాటు పడి... అన్నం పెట్టకపోయినా... కేవలం గంట శబ్దం విన్నా దాని నోట్లోకి నీళ్లు వచ్చేవట’’ వివరించారు రాంబాబు వాళ్ల నాన్న. ‘‘అలా అయితే వాడిది కుక్క బతుకు అయిపోయిందా అండీ...’’ అంటూ గుడ్ల నీళ్లు కుక్కుకుంది. ‘‘వాడి నోట్లో నీరూరలేదని... నీ కళ్లలో నీరు ఊట ఎందుకు? చూద్దాం చూద్దాం’’ అంటూ సముదాయించాను నేను.రాంబాబు గాడి మీద విపరీతమైన కోపం వచ్చింది నాకు. వాడు ఇలా లోకం పట్టనట్టుగా ఉన్నందుకు కాదు. మొబైల్ తోడిదే లోకం అన్నట్టు బతుకుతున్నందుకూ కాదు. ఆ పెద్దావిడను కళ్లనీళ్లు పెట్టిస్తున్నందుకు. ‘‘నా బాధ మరొకటి కూడా ఉందిరా.  వాడి పెళ్లి చేద్దామనుకుంటున్నాం కదా. రేపు వాడి పెళ్లయితే ఎలా’’ అంటూ మరి కాస్త బాధపడింది.

‘‘రాంబాబు గాడికి పెళ్లా? ఎప్పుడు? ఎవరితో?’’ అన్నాను.‘‘అదేరా... మొన్న వచ్చిన ఆ తెలివిటూరు సంబంధం గురించి’’ అంది.‘‘నిశ్చయం చేశారా? అయితే ఓకే... ఇంక మీరు చెప్పడం ఎందుకు’’ అన్నాను.‘‘ఇంకా నువ్వూ... నేనూ చెప్పేదేమిటి? ‘పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంద’ నే సామెత ఉంది కదా. అదెందుకు వచ్చిందనుకున్నావు. మన రాంబాబుగాడి లాంటి పిచ్చిమాలోకాల కోసమే’’ అన్నాను నేను నిశ్చింతగా.‘‘ఏమిటి నువ్వు చెప్పేది?’’ కాస్త అయోమయంగా చూసింది. ‘‘ఎవడి నుంచి రింగో... మరెవరి దగ్గర్నుంచి ఫోనో వస్తే ఎవ్వడూ స్పందించడు. కానీ అదే పెళ్లాం నుంచి వచ్చిందనుకో...’’ అంటుండగా... ‘‘ఆ... వస్తే?’’

‘‘మొగుడనేవాడు చచ్చినట్టు  ఫోనెత్తి తీరాల్సిందే. కాల్‌కు అటెండ్ కావాల్సిందే. లేదంటే వాడి తిక్క వాడి పెళ్లామే కుదుర్చుతుంది. కాబట్టి నువ్వేమీ బెంగ పడకు. మన వాణ్ణి ఈలోకం నుంచి బయటపడేసి తన తోడిదే లోకం అనుకునేలా చేయడానికైనా సంబంధానికి ఓకే చెప్పెయ్’’ అంటూ నిశ్చింతగా బయటకు వచ్చేశాను నేను.

 - యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement