‘కొన్ని కొన్ని జంతువులు – కొంతమంది డాక్టర్లను కలిసి ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాన్నా’ అన్నాడు మా బుజ్జిగాడు. నేనూ మా బుజ్జిగాడూ కలిసి డిస్కవరీ ఛానెళ్లూ, యానిమల్ ప్లానెట్లూ చూడటం నా పాలిట పెద్ద శాపమైంది. పాపం... కొన్ని జంతువులను కొంతమంది డాక్టర్లను చూపించక తప్పదంటూ వాడు తనదైన శైలిలో నా దృష్టికి తెచ్చాక... గొంతుపెగుల్చుకొని ఒక మాట మాత్రం అనగలిగాను. అదేమిటంటే... ‘ఏయే జంతువులు... ఏయే స్పెషలిస్టులను కలవాలి? అసలెందుకు కలవాలి’ అడిగా. ‘చెబుతా వినండి’అంటూ చెప్పిన విషయాలూ... కారణాలివి...
ఏనుగులూ, హిప్పోలూ, రైనోలు అనునిత్యం శాకాహారం మాత్రమే తింటున్నా వాటికి విపరీతంగా ఒళ్లొచ్చింది. ఆ ఒబేసిటీ తగ్గడం ఎలాగో తెలుసుకొని, అవసరమైతే లైపోనో లేదా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోడానికి అవి బేరియాట్రిక్ సర్జన్‌ను కలవాలి.
‘పాముచెవులు’ అంటూ సామెత ఉన్నప్పటికీ వాటికి చెవులు అస్సలు వినపడవట. ‘జాకబ్‌సన్ ఆర్గాన్’లాంటి ఇప్పుడున్న జ్ఞానేంద్రియాలకు తోడు చెవులు కూడా వినపడితే పాములు మరింత చురుగ్గా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అందుకే పాములన్నీ ఒకసారి ‘ఈఎన్‌టీ’ డాక్టర్లతో మెడికల్‌క్యాంపు పెట్టించుకోవడం చాలా అవసరం.
తలనిండా తగినంత జుట్టు లేకపోవడంతో రాబందు బట్టతల స్పష్టంగా కనిపిస్తుంటుంది. బట్టతల కారణంగా దానికి ఓ క్రూరమైన లుక్ వచ్చింది. కాబట్టి అది తక్షణం ట్రైకాలజిస్టును కలిసి తల మీద ‘ఈకల ట్రాన్స్‌ప్లాంటేషన్’ చేయించుకుంటే మంచిది.
కష్టాలూ, బాధలూ ఏవీ లేకపోయినా మొసలి కళ్లలోంచి అదేపనిగా నీళ్లు కారుతుంటాయి. ఆ కన్నీళ్ల కారణంగా ‘మొసలి కన్నీళ్లు’ అంటూ ఓ బ్యాడ్‌నేమ్ కూడా వచ్చింది. అందుకే మొసలి తక్షణం కంటి డాక్టరును కలవాలి.
చెక్కర చుట్టూ చీమలూ, బెల్లం చుట్టూ ఈగలు తెగ ముసురుతుంటాయి. ఇలా స్వీట్ చాలా ఎక్కువగా తినడం వల్ల తమకు ముందుముందు మధుమేహం వస్తుందేమోనని తెలుసుకొన్ని తగిన జాగ్రత్తలు తీసుకోడానికి అవి ఒకసారి డయాబెటాలజిస్టును కలిసి ముందస్తు పరీక్షలు చేయించుకుంటే మరీమేలు.
జీర్ణశక్తి సరిగా లేకపోవడంతో ఆహారం ఒంటికి సరిగా అందక కుందేళ్లు విసర్జించిన వాటినే రెండోసారి తింటాయట. అందుకే ఈనో లాంటి యాంటసిడ్స్ తీసుకోవడంతో పాటు, మంచి జీర్ణశక్తిని పెంపొందించుకోడానికి ఏం చేయాలో తెలుసుకోవాలి. అందుకోసం కుందేళ్లు ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవడం చాలా
అవసరం.
హైనాలూ పొంచి తింటాయి. పైగా బోలెడంత రౌడీయిజం చేసి మరీ వేటజంతువుల నుంచి మాంసం లాక్కుంటాయి. తోడేళ్లూ అంతే. అయినప్పటికీ జిత్తులమారీ అని నక్కకే చెడ్డపేరుంది. తన బిహేవియర్‌ను ఎలా సరిదిద్దుకుంటే జిత్తులమారి అనే ఈ బ్యాడ్‌నేమ్ తొలగిపోతుందో తెలుసుకొని
అనుసరించడానికి నక్క సైకియాట్రిస్టును కలవాలి.
మందకొడిగా ఉండటం వల్ల తమకు కలుగుతున్న నష్టాన్ని గుర్తించి, మిగతా పాముల్లా తాము కూడా చురుగ్గా కదలడానికి ఏం చేయాలో సూచనలు తీసుకోవడం కోసం కొండచిలువలూ, అనకొండలూ లైఫ్‌స్టైల్ స్పెషలిస్టును కలవచ్చు.
ఈ లోకంలో... అందునా మన దేశంలో తెల్లటి మేనిరంగుకే గౌరవం ఎక్కువ. అందుకే పక్షిలోకంలో గౌరవాన్ని పెంపొందించుకోవడం కోసం కాకి డర్మటాలజిస్టును కలిస్తే బెటర్. ‘ఫెయిర్ అండ్ లౌలీ’తో లాభం ఏమైనా ఉంటుందేమో తెలుసుకోవడంలోనూ తప్పులేదు.
ఇక ఆ తొండలకైతే పొద్దస్తమానం అక్కడా ఇక్కడా బస్కీలు తీస్తూ గడపడం తప్ప మరే పనీ లేదు. ఆ ఊసరవెల్లిని చూడండి. క్షణక్షణానికి ఒంటిరంగు మార్చుకుంటూ పురుగులు పట్టుకొని తిని హాయిగా ఉంటున్నాయి. తాము బాగా ముదిరాక ఊసరవెల్లిగా మారడం కంటే ముందునుంచే రంగుమారే టెక్నిక్‌ను తెలుసుకోవడం కోసం తొండలూ ఒకసారి డర్మటాలజిస్టును కలవడం మంచిదేమో.
కోయిల విషయానికి వస్తే... కేవలం వసంతకాలపు వేసవిలో మామిడి చిగుర్లు వచ్చే కాలంలోనే పాడగలుగుతోంది. మిగతా అన్ని కాలాల్లోనూ అలాగే పాడగలిగేందుకు ఏం చేయాలో తెలుసుకోవాలి. ఇందుకోసం కోయిల కూడా ఈఎన్‌టీ సర్జన్‌కు కలిస్తే వాటి ప్రతిభ అన్ని సీజన్లకూ విస్తరిస్తుంది.
చాలా ఎత్తుగా ఉండటం వల్ల చెరువు నుంచి నీళ్లు తాగాలంటే జిరాఫీకి చాలా కష్టమవుతోంది. కాళ్లు విశాలంగా చాపుకుంటూ చాలా కష్టంగా మెడ వంచి నీళ్లు తాగాల్సి వస్తోంది. అందుకే కాస్త ఎత్తు తగ్గేలా ఆపరేషన్ ఏదైనా చేయించుకోవచ్చేమో తెలుసుకోడానికి జిరాఫీలు ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిస్తే మంచిదేమో.
అదేపనిగా ఎంతసేపు నీళ్లలో ఉన్నా జలుబు చేయకుండా ఉండటానికి టిప్స్ తెలుసుకోవడం కోసం కొంగలు ఈఎన్‌టీ సర్జన్‌ను కలవాలి.
‘ఒరేయ్... మరి ఇన్ని తెలిసిన నువ్వు త్వరగా డాక్టర్ అయి జంతుప్రపంచానికంతా ఇతోధికంగా సేవ చేయవచ్చు కదా’ సలహా ఇచ్చాను నేను.
‘‘వద్దు నాన్నా... డాక్టర్ అయితే ఏదో ఒక స్పెషాలిటీకి మాత్రమే పరిమితం కావాలి. ఏ డాక్టరీ కూడా చదవకుండానే పెట్టుబడి పెట్టి ఒక హాస్పిటల్ పెట్టాననుకో... అందరు స్పెషలిస్టులు మన దగ్గరే... అన్ని జీవులూ మన వద్దకే’ అన్నాడు మా బుజ్జిగాడు.
– యాసీన్
Comments
Please login to add a commentAdd a comment