ఎవరు తవ్వించిన గుంతలో వారే..
తెలుగుదేశంలో ఓ గురువుగారు ప్రజలకు పంచతంత్రంలో లేని వింతకథ చెప్పసాగారు.
అనగనగా ఒక నక్క. అప్పట్లో అది ఓ పులి నుంచి దాని తోలును తస్కరించి, తాను కప్పుకుంది. తానే పులినంటూ నమ్మించి తొమ్మిదేళ్లు పరిపాలించింది. కానీ.. దాని తోలు దాని సొంతం కాదనీ, మామ వరసగా పిలిచే ఒక పులి నుంచి దొంగిలించిందని మిగతా జంతువులు గ్రహించాయి. అది పులితోలు కప్పుకున్న డూప్లికేటు అని తెలుసుకున్న జంతువులు దాని అసలు తోలును వలిచే ప్రోగ్రామ్ పెట్టుకున్నాయి. నక్క మిగతా జంతువుల లీడర్లను కూడగట్టుకుని ఒక మహాకూటమి అనేదాన్ని ఏర్పరచుకుని తన తోలును రక్షించుకునే ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకుంది. ఈ ప్రయత్నంలో ఓ తాటి చెట్టుకింద నిలబడి కాస్త విశ్రాంతి తీసుకుందామని అనుకుంటుండగా... ఓటమి అనే తాటిపండు ఆ మూలిగే నక్క మీద పడింది. ఆ దెబ్బకు దాని పులితోలు కాస్త చెదిరి పోవడంతో... దాని నిజస్వరూపమెరిగిన ఆ మహాకూటమిలోని జంతునేతలు మళ్లీ దానికి శత్రువులైపోయాయి.
నక్క ఎప్పుడూ గోతి కాడ నక్కుతుందనే విషయం తెలిసిందే కదా. ఢిల్లీ నేతలనే క్రూరమృగాలు కొన్ని ఒకచోట రెండు గుంటలు తవ్వడానికి సిద్ధపడ్డాయి. నక్క ఇలా ఆలోచించింది. ‘నక్క అంటేనే గుంట దగ్గర నక్కాలి. అందుకే దాన్ని గుంటనక్క అంటారు. అలాంటప్పుడు ఎన్ని ఎక్కువ గుంటలుంటే నక్కలకు అంత లాభం కదా’ అని అనుకుంది. అందుకే గుంటను తవ్వడానికి యథావిధిగా ఢిల్లీ తవ్వకాల బ్యాచీకి సహకరించింది. మిగతా జంతువులన్నీ ఏదో ఒక గోతి దగ్గర తచ్చాడుతుంటే... అది ఏకకాలంలో రెండు గోతుల దగ్గర తచ్చాడుతుండేది. ఈలోపు రెండు గుంటల తవ్వకం దాదాపు పూర్తయ్యింది.
తాను స్వతహాగా నక్క కావడంతో తనకు వేటాడటం రాదని దానికి బాగా తెలుసు. కానీ తాను నక్కనన్న విషయం అది ఒప్పుకోదు కదా. అందుకే సింహం వేషంలో ఉన్న మరో మృగం (ఇది గుజరాత్‌కు చెందినది కాబట్టి ‘గిర్’ సింహాన్నంటూ చెప్పుకునేది.) దగ్గరకు వెళ్లి ‘‘అప్పట్లో నేను తెగవేటాడేదాన్ని. మీరు గోధ్రా లాంటి చోట సాగించిన వేట గురించి అడవంతా చెప్పుకుంటుంటే విన్నాను. బషీర్‌బాగ్‌లాంటి చోట్ల నేనూ శక్తికొద్దీ వేట సాగించా’’ అంటూ నక్క వినయాలు పోయింది. ‘‘ఇప్పుడూ వేటడగలనుగానీ... ఎలాగూ తమరు ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి మీరూ, నేనూ ఒక జట్టుగా వేటాడితే... అడవి దద్దరిల్లాల్సిందే. మీరెలాగూ సింహం కాబట్టి సింహభాగమే మీరు తీసుకోండి. నేనెలాగూ పులిని కాబట్టి పులివాటా తీసుకుంటా’’ అంది. సింహం జట్టులోని కొన్ని జీవాలు.. అది నక్క మాత్రమేననీ, దానితో జట్టుకట్టవద్దనీ చెప్పాయి. అయినా తాను కప్పుకున్న తోలు ప్రదర్శించీ, తాను తస్కరించిన గోళ్లు చూపించీ... ఎవరెవరితోనో ఒత్తిడి తెప్పించి మరీ తాను పులినే అని అందరితోనూ నమ్మబలికించింది. పులీ, సింహాలు సాగించే వేట తరహాలోనే తమ వేట సాగుతుందని సింహం గుంపులోని మరికొందరు ఎదురుచూసేవారు. కానీ పులితోలు కప్పుకున్న ఈ నక్క మాత్రం ఎప్పుడు ఎక్కడ గుంట కనిపిస్తే అక్కడ నక్కుతుండటం చూసి గగ్గోలు పెడుతూ ఉండేవి. అయినా మృగాల పెద్దలు మిగతా వాటికి సర్దిచెబుతూ ఉండేవి.
ఈలోపు వేషాలేసే ఒక కాకి తన బలాన్ని అధికంగా అంచనా వేసుకుని, జనాకర్షణ అనే ఒక మాంసం ముక్కను నోట కరచుకుని రెండు గుంటల మధ్యనున్న చెట్టు మీద సేవ అనే మంత్రం పఠిస్తూ కూర్చుని ఉంది. ఎలాగైనా ఆ మాంసపు ముక్కను చేజిక్కించుకుందామని చూసిన నక్క... కాసేపు తన ఒంటి మీద ఉన్న పులి చర్మాన్ని సర్దుకుంటూ తన నక్కజిత్తులు ప్రదర్శిస్తూ చెట్టు కిందికి వెళ్లి.. ‘‘ కాకి బావా... కాకిబావా... నీ గొంతు ఎంత మధురమో కదా... సింహాలనే నువ్వు పొగుడుతున్నావు. నీ తియ్యని గొంతుతో ఒకసారి నన్ను కూడా పొగడవా’’ అని అడిగింది. పులులు ఇలా దేబిరించవు కదా.. అని అన్ని జంతువులూ సందేహపడ్డాయి.ఇప్పటివరకూ చెప్పిన కథ ఆపి గురువుగారు ప్రజలను ‘‘నాయనలారా... ఇప్పుడేం జరుగుతుందని మీ ఊహ. దీన్ని సరిగా విశ్లేషించగలిగితే సమకాలీన రాజకీయాలపై అవగాహన వచ్చినట్టే ’’ అన్నారు.
అప్పుడు ప్రజలిలా అన్నారు.. ‘‘గతంలో దాని మీద ఓటమి అనే తాటిపండు పడ్డా మూలిగి మళ్లీ లేచింది. అయితే ఈసారి నక్క సరిగ్గా రెండు గుంటల మధ్యన ఉంది. కాబట్టి పైనున్న కాకి పాడగానే అది మాంసపు ముక్కను అందుకుందామని అటో ఇటో దూకడం ఖాయం. ఏదో ఒక గుంటలో పడటం ఖాయం. ఎవరు తవ్విన గుంటలో వారే పడటం అన్నది పాత మాట. కానీ ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న కొత్త సూక్తిని అనుసరించి ఎవరు తవ్వించిన గుంటలో వారే పడాలి అనే సిద్ధాంతాన్ని అనుసరించి గుంటలో పడుతుంది. మరోమారు మూలిగే దానిపైనా ‘ఓటమి’ తాటికాయా పడుతుంది. ఇదీ జరగబోయే చరిత్ర’’ అన్నారు ప్రజలు. గురువుగారు సంతృప్తిగా తలూపి.. తధాస్తు అని ఆశీర్వదించారు.
- షేక్ యాసీన్