సంతానలేమి వేధిస్తోందా?
పాశ్చాత్య దేశాల్లోలాగే ఇప్పుడు మన దగ్గర కూడా పని సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. తమ రంగంలో రాణించడం కోసం రాత్రి-పగలు తేడా లేకుండా కృషి చేయడం అన్నది ఇప్పుడొక సాధారణ అంశంగా మారింది. దాంతో సరైన వయసులో పెళ్లి కాక, పెళ్లైనవాళ్లలో కూడా పై కారణాల వల్ల మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగి సంతానం కలగడానికి అవసరమైన హార్మోన్ల స్రావాలు సరిగా జరగక, సమస్యలు తలెత్తి, అవి సంతానలేమికి దారితీస్తున్నాయి. అయితే ఆధునిక విజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో సంతానలేమికి చక్కటి పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి కనుక ఆందోళన చెందనవసరం లేదు.
చాలామంది మహిళల్లో నెలసరి సమస్యలున్నా, స్త్రీలలో భర్త కన్నా భార్య వయసు ఎక్కువగా ఉన్నా లేదా భార్యాభర్తలిద్దరూ ఎలాంటి సంతాన నిరోధక పద్ధతులు పాటించకుండా సంవత్సర కాలం పాటు సంతానం కోసం ప్రయత్నించినా గర్భధారణ జరగకపోవచ్చు. మరి కొంతమందిలో కేవలం ఏడాది మాత్రమే గాక... ఏళ్లు గడుస్తున్నా గర్భం రాకపోవచ్చు.
స్త్రీలకే కాదు... పురుషులకు కూడా...
సంతానం కలగలేదంటే అందుకు మహిళను కారణంగా చూపడం మన సమాజంలో పరిపాటి. ఇది కేవలం అపోహ మాత్రమే. సంతానలేమికి కారణాలన్నవి అటు మహిళలలోనూ, ఇటు పురుషులలోనూ లేదా ఒక్కోసారి ఇద్దరిలోనూ ఉండవచ్చు. అంటే... దంపతులిద్దరిలో లోపం ఎవరిలోనైనా ఉండవచ్చునన్నమాట. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం కూడా సంతానలేమికి కారణం కావచ్చు. అలాగే స్త్రీలలోనైతే హార్మోన్ల లోపం, థైరాయిడ్ సమస్య, పీసీఓడీ వంటి అనేక అంశాలు సంతానలేమికి కారణం కావచ్చు.
దంపతులిద్దరూ ఎలాంటి గర్భనిరోధక సాధనాలు వాడకుండా, సంతాన నిరోధక ప్రక్రియలను అనుసరించకుండా... తమ దాంపత్యజీవితాన్ని గడిపితే సాధారణంగా ఏడాదిలోపు 75 శాతం మందిలో గర్భం వస్తుంది. ఇక యాభై శాతం మందిలో ఐదు మాసాల లోపే 50 శాతం మందిలో గర్భం వస్తుంది. రెండేళ్లలో 90 శాతం మందిలో గర్భం వస్తుంది. కానీ ఎవరిలోనైనా అంతకాలం తర్వాత కూడా గర్భం రాలేదంటే, ఏదైనా సమస్య ఉందేమోనని భావించాలి. సమస్యను తెలుసుకోవడానికి స్త్రీలు ముందుకు వచ్చి వైద్యపరీక్షలు చేయించుకున్నట్లుగా, పురుషులు అంత తేలిగ్గా ముందుకు రారు.
సంతానలేమికి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక పరిష్కారాలు...
సంతానలేమి ఉన్నవారికి ఇప్పుడు మూడు రకాల పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. అవి... 1) ఐ.యు.ఐ. 2) ఇక్సీ 3) ఐ.వి.ఎఫ్.
ఐ.యు.ఐ. : భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ల్యాబ్‌లో పరీక్షించి, దానిలోనుంచి ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్న కణాలను మాత్రం వేరు చేసి సిద్ధం చేస్తారు. వాటిని ఒక సన్నని గొట్టం ద్వారా స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియను అనుసరించడం వల్ల గర్భధారణకు 15 శాతం వరకు అవకాశం ఉంటుంది. ఇలా ఆరు రుతుచక్రాల పాటు ఈ చికిత్స చేసినా ఫలితం లేకుంటే అప్పుడు ఐ.వి.ఎఫ్. అనే ప్రక్రియను అనుసరించవచ్చు.
ఇక్సీ: స్త్రీ నుంచి సేకరించిన అండాల్లోకి, పురుషుని శుక్రకణాన్ని ఒక ప్రత్యేకమైన మైక్రో మానిప్యులేటర్ సహాయంతో ప్రవేశపెట్టి ఫలదీకరణం చెందిస్తారు. వాటిని తిరిగి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ పద్ధతి ద్వారా గర్భధారణ విజయవంతం కావడానికి 40 శాతం వరకు అవకాశాలు ఉంటాయి. శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్నవారిలో ఈ ప్రక్రియ మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
ఐ.వి.ఎఫ్.: దీన్నే ‘టెస్ట్‌ట్యూబ్’ విధానం అంటారు. ముందుగా పక్వమైన అండాలను స్త్రీ నుంచి బయటకు తీసి, పురుషుడి శుక్రకణాలతో బయటే ఫలదీకరణం చెందిస్తారు. ఇలా ఏర్పడిన తొలి దశ పిండాల్లో రెండు లేదా మూడింటిని తిరిగి స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ ద్వారా సంతానం కలగడానికి 30 నుంచి 35 శాతం విజయావకాశాలు ఉంటాయి. ఇటీవలికాలంలో సంతాన సాఫల్య చికిత్సలో మరెన్నో కొత్త విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలదీకరించిన పిండాలలో గర్భాశయంలోకి ప్రవేశపెట్టగా మిగిలిన పిండాలను అతి శీతల పరిస్థితుల్లో ఉంచి తరువాత వాటిని వాడతారు. అవసరాన్ని బట్టి అండాలను గాని శుక్రకణాలను గాని దాతల నుంచి స్వీకరించి వాడతారు. వీటితోపాటు పిండాన్ని మరో స్త్రీ గర్భాశయంలో పెంచే వినూత్నమైన సరోగసీ విధానం కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అందుకే సంతానం కలగడం లేదని ఏళ్ల తరబడి బాధపడేకన్నా, ఆధునిక పద్ధతులు అనుసరించడం శ్రేయస్కరం.
సంతానలేమికి ముఖ్య కారణాలు...
మన జీవనశైలితో పాటు కాలుష్యం, వాతావరణం, పొగతాగడం, మద్యం సేవించడం, బిగుతైన దుస్తులు ధరించడం, అధికబరువు, మానసిక ఒత్తిడి, కొన్నిరకాల మందులు, ఆరోగ్యకరమైన వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం, ఉన్నా... వాటిలో తగినంత చురుకుదనం లేకపోవడం లేదా వాటి ఆకృతి బాగా లేకపోవడం వంటి లోపాలు ఉన్నప్పుడు వారి భాగస్వామికి గర్భధారణ జరగడం కష్టమే. మరికొందరి వీర్యంలో అసలు శుక్రకణాలే ఉండకపోవచ్చు. ఇక మహిళ విషయానికి వస్తే... నెలసరి సమస్యలు, అండాల విడుదల సరిగా లేకపోవడం లేదా విడుదలైన అండాలలో నాణ్యత లోపించడం వంటివి ప్రధాన కారణాలు. వయసు పెరిగేకొద్దీ అబార్షన్లు అయ్యే అవకాశాలూ ఎక్కువే. మహిళ వయసు 30 ఏళ్లు దాటాక సంతాన అవకాశాలు తక్కువగా ఉంటాయి.
నిర్వహణ: యాసీన్
డాక్టర్ సి. జ్యోతి,
క్లినికల్ డెరైక్టర్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్,
స్టార్ ఫెర్టిలిటీ,
మారేడ్‌పల్లి, సికింద్రాబాద్.