‘విగ్’ ఆఫ్ వార్...
హ్యూమర్ ప్లస్
క్యాప్, విగ్ రెంటికీ మధ్య వైరం వచ్చింది. ఆ రెండూ ఎదురూ-బొదురూ నిలబడి సంవాదం మొదలుపెట్టాయి. ‘‘సీనియారిటీనైనా గౌరవించు. నువ్వు పుట్టకముందే నేను పుట్టాను. తల గుడ్డ అన్నది ఒక గౌరవ రూపం. తమ ఆత్మాభిమానానికి అది నిదర్శనం. అంతగా ముడిచి కట్టుకోవడం కాస్త కష్టమని టోపీ రూపంలో నన్ను తొడుక్కోవడం మొదలు పెట్టారు’’ అంది క్యాప్.
‘‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... తల మీదకి ఎక్కామా లేదా?! యువర్ ఆనర్ అంటూ గౌరవంగా పిలిపించుకునే వారంతా నన్ను తొడగడం మొదలుపెట్టారు. కావాలంటే పాత పిక్చర్స్ చూడు. పెద్ద పెద్ద న్యాయాధిపతులంతా తమ దర్జా, హోదా చూపడం కోసం నన్ను ధరించారు. నీ లోపం గురించి నువ్వు చెప్పుకున్నావు. టోపీ అంటూ నిన్ను గురించి నువ్వు అన్న మాట అక్షరాలా సత్యం. ఎవడైనా మోసం చేసి పోతే టోపీ పెట్టారని నిన్నే ఈసడించుకుంటుంటారు’’ గొప్పలు పోయింది విగ్.
‘‘అప్పుడు జుట్టు ఉన్నా లేకున్నా తొడిగారేమో గానీ ఇప్పుడందరూ వదిలేశారు. కేవలం బట్టతల వాళ్లు మాత్రమే నిన్ను ధరిస్తున్నారు’’ అంది. ‘‘అవును. కాలు పోయిన వారికి జైపూర్ పాదంలా, గుండె కవాటం దెబ్బతిన్నవారికి కృత్రిమ వాల్వ్‌లా ఉపయోగపడుతున్నాన్నేను. నేను ఎవరికైనా జుట్టు వైకల్యం కలిగిందంటే, దాంతో వచ్చే ఆ బట్టతలనే కనిపించనివ్వను. ఒత్తుగా జుత్తు కనిపించేలా చేస్తాన్నేను.’’ అంది విగ్గు.
వెంటనే క్యాప్ అందుకుంది... ‘‘నన్ను తొలగిస్తే గానీ నెత్తిమీద వెంట్రుకలు లేని విషయం కనిపించదు. పైగా చూసిన వారు నాలోపల వెంట్రుకలు ఏ రూపంలో ఉన్నాయోనంటూ ఎవరి ఊహకు తోచిన విధంగా వారు ఊహించుకోవచ్చు. ఆలోచించుకున్న వారికి ఆలోచించినంత. అంటే వాళ్ల ఊహలే హద్దు. అంటే నేను జనాల్లో అంత క్రియేటివిటీ పెంచుతానన్నమాట. అంతెందుకు.. రాత కూడా పతాక శీర్షిక రూపంలో నన్ను తొడుక్కుంటుంది. అందుకే దాన్ని ‘క్యాప్’షన్ అంటారు. ఇక ఒక రాతను నచ్చి వెంట ఉండే పాఠకులను కూడా ‘క్యాప్’టివ్ రీడర్స్ అని పిలుస్తారు. తెల్సా...కానీ నువ్వు... ఎదుటి వాళ్ల ఆలోచనలను పరిమితం చేస్తావు. వాళ్ల ఊహలకు అడ్డుపడతావు. ఒకరి ఊహలకు అడ్డుపడటానికి నీకేం హక్కుంది. పైగా నువ్వు నిజానివి కాదు... అబద్ధానివి’’ అని అరిచింది క్యాప్.
‘‘క్యాప్‌వైన నువ్వు చేసేదేమిటి? నువ్వు మాత్రం నిజానికి పాతరేయవా? నిజానికి నువ్వే నిజాన్ని కప్పెడతావు. పైగా నేను అబద్ధాన్ని అన్న ఆరోపణ తప్పు. నేనొక వాస్తవాన్ని. అసలు నేనే ఒక కొత్త వాస్తవాన్ని ఏర్పరుస్తాను. దాంతో నన్ను నెత్తిన పెట్టుకున్న వాడికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాను. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే నువ్వు గొప్పా... లేక ఆత్మవిశ్వాసాన్ని పెంచే నేను గొప్పా’’ అంది విగ్గు.
‘‘ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తానంటూ విర్రవీగే నువ్వు అందరికీ అందుబాటులో ఉండవు. నువ్వు చాలా ఖరీదు. నేనేమో చాలా చవక. పైగా అందరికీ దగ్గరగా ఉంటాను. ఏ షాపులోనైనా తేలిగ్గా దొరుకుతాను. అదీ నా పాపులారిటీ’’ అంది క్యాప్.
ఆ రెండూ కొట్టుకుంటున్న సమయంలో ఆ పొరుగునే ఉన్న కళ్లజోడు ఒక మాట అంది. ‘‘మీరూ మీరూ కొట్లాడుకుంటున్నారు గానీ ఇక ఇద్దరూ నోరు మూసుకోండి. నెత్తిమీదికి ఎక్కేలా పెట్టబట్టి నాకో విషయం తెలిసింది. అటు క్యాప్‌నూ, ఇటు విగ్‌నూ కలిపేసి క్యాప్ చివరన జుట్టు ఉండేలా ఒక మిక్స్‌డ్ రూపాన్ని తయారు చేశారు. యూ నో! అది పెట్టుకుంటే ముందు క్యాపూ, వెనక జులపాల క్రాపూ!’’
- యాసీన్