మారువేషాల కథ
హ్యూమర్ ప్లస్
జీవితమంటే ఒక మారువేషం. మనకు సంబంధం లేని ఏదో వేషంలో జీవిస్తూ ఉంటాం. మనం మారువేషగాళ్లమని మనకు తెలియకపోవచ్చు కూడా. మన వేషాన్ని గుర్తించడం ఎదుటివాడి బాధ్యత. వాడి వేషాన్ని ఎలాగూ మనం గుర్తిస్తాం. ఒకోసారి గుర్తించి కూడా ఇరువైపులా మౌనం పాటిస్తారు. దీన్ని మారుమోసం అంటారు.
మారువేషాల్లో ఎన్టీఆర్‌దే పెద్ద పీట. ఆయన పొడుగాటి గౌను వేసుకుని పిల్లి గడ్డం పెట్టుకుని వస్తే అంత పెద్ద విలన్ నాగభూషణం కూడా గుడ్లు తేలేస్తాడు. అరబ్ షేక్ అనుకుని షేక్ అయిపోయి కోట్లలో బిజినెస్ మాట్లాడేస్తాడు. దేశోద్ధారకులు సినిమాలో బుగ్గకి పులిపిరికాయ అతికించుకుని, గడ్డానికి కత్తిగాటు పెట్టుకుని, ఒక శంకు మార్కు లుంగీ కట్టుకుని ఎన్టీఆర్ వీరంగం చేస్తే విలన్లంతా కుయ్యోమని సోడా సౌండ్ చేస్తారే తప్ప ఒక్కడు కూడా కనుక్కోలేడు. డెన్‌లో సారా పీపాలు, చెక్కపెట్టెలు, నానా తుక్కు సామగ్రి పెట్టుకున్న విలన్లు ఈ పులిపిరి మేకప్‌ని ఎందుకు గుర్తు పట్టలేకపోయారో అర్థమయ్యేది కాదు. కానీ గుర్తుపట్టకపోవడం ప్రజాస్వామ్యంలో ఒక భాగం. సభల్లో సింహాలు కూచుని మేకల హక్కుల గురించి వాదిస్తుంటే మనమెప్పుడైనా గుర్తుపట్టామా? వేటగాళ్ల కన్నీళ్లకు విలువెక్కువ.
స్వామీజీలు ఎలాగూ పొడుగాటి గడ్డాలు మీసాలతో ఉంటారు కాబట్టి వారికి మారువేషాల అవసరం లేదు. చిన్నప్పుడు మా ఊరికి ఒక స్వాముల వారు వచ్చారు. తేనెపట్టులాంటి గడ్డంతో శిష్య సమేతంగా దిగారు. మా ప్రెసిడెంట్ గారి భార్య నగలతో సహా వెళ్లి తన కష్టాలు తీర్చమని వేడుకుంది. స్వాముల వారు కనికరించారు. కష్టాలతో పాటు ఆమె కూడా మాయమైంది. కమండలం, పావుకోళ్లు శిష్యులకు వదిలి స్వామివారు కూడా వేషం చాలించారు. పనిలో పనిగా తన కష్టాలు కూడా తీరాయని ప్రెసిడెంట్ సంతోషించాడు.
కృష్ణ సినిమాల్లో పెద్దగా మారువేషాలు ఉండవు. రివాల్వర్ని లోడ్ కూడా చేయకుండా కాల్చేస్తాడే తప్ప, డైలాగులతో ఫిల్మ్ వేస్ట్ చేయడు. ఇప్పటి సినిమాల్లో మారువేషాలుండవు. సినిమాలో తమ వేషమేంటో హీరోలకే తెలియకపోవడం వల్ల మారువేషం అవసరం లేకపోయింది. ఏది వేషమో, ఏది మారువేషమో అర్థం కానంత గందరగోళంలో ప్రేక్షకులున్నారు. ఇంతకు మునుపు థియేటర్ల బయట తొక్కిసలాట జరిగితే, ఇప్పుడు థియేటర్ల లోపల జరుగుతోంది, ఎగ్జిట్ ఎక్కడుందో తెలియక.
మా స్కూల్లో నందయ్య అని ఒక అయ్యవారు ఉండేవాడు. స్కూల్లోకి రాగానే రాజనాల మాస్క్ తగిలించుకుని వెదురుబెత్తంతో వచ్చేవాడు. ఆ బెత్తం కదిలినప్పుడు గాలే క్రూరంగా మారి జుయ్ మని భయపెట్టేది. అమరకోశంలో శ్లోకం చెప్పమనేవాడు. జీర్ణకోశం తెలుసు కానీ, అమరకోశం మాకేం తెలుసు? గోడకి నిలబెట్టి పిర్రలపై కొట్టేవాడు. అరిస్తే ఇంకా ఎక్కువ పడేవి. ప్రాబ్లమ్ ఉన్నప్పుడు సొల్యూషన్ కూడా ఉంటుంది. గాలి ఆడకపోయినా నాలుగైదు నిక్కర్లు వేసుకొచ్చేవాళ్లం. ఆయన ఇది కనిపెట్టి నిక్కర్లపై దుమ్ము రేగ్గొట్టేవాడు. కవచాలన్నీ దాటుకుని వచ్చి ఆ బెత్తం పిర్రలపై కుడుములు లేపేది. ఆ రోజు ఆయన కొట్టిన ఒక్కో దెబ్బ ఒక్కో అక్షరమై నన్ను కరుణించింది. మరక మంచిదేలాగా మారువేషాలు కూడా ఒక్కోసారి మంచివే. కర్రకి బుర్రకి సంబంధముంది. ఈ సూత్రం ఇప్పుడు స్కూళ్లని దాటేసి సాఫ్ట్వేర్ కంపెనీల్లోకి వచ్చేసింది.
ఎవడికి వాడు హీరో అనుకుంటాడు కానీ, చాలామంది హీరో వేషాల్లో ఉండే విలన్లే. కుంభవృష్టి కురిసి మేకప్ చెరిగిపోతే తప్ప మన మొహాలు మనకి సరిగా అర్థం కావు. జీవితం యుద్ధ రంగంగా మారినప్పుడు మారువేషాలు, పరకాయ ప్రవేశాలు ఎలాగూ తప్పవు. కోతిలా కిచకిచలాడినా, కుక్కలా అరిచినా, కొంగ జపం చేసినా, పాములా పాకినా, మొసలి కన్నీళ్లు కార్చినా... ఉదర పోషణార్థం బహకృత వేషం.
- జి.ఆర్.మహర్షి