11:59:59 | New Year Special! | Sakshi
Sakshi News home page

11:59:59

Published Sun, Dec 27 2015 1:24 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

11:59:59

11:59:59

సందర్భం
చెట్టు క్యాలెండర్ చూసుకొని చిగురేస్తుందా? పిట్ట అలారం పెట్టుకొని లేస్తుందా? జంతువులు జనవరి ఫస్ట్ విషెస్ చెప్పుకుంటాయా? పాపం... వాటి మానాన అవి పని చేస్తుంటాయి. తిథులూ, వారాలూ, వర్జ్యాలూ చూసుకోవు. రాహుకాలం, యమ గండం తెలియదు. అందుకే వాటికి దినదిన గండం. అయితే తనకు నూరేళ్లాయుష్షు అని నమ్మే మనిషి పరిస్థితి వేరు. కాలం కీళ్లు విరిచేసి... తేదీలనీ, నెలలనీ, సంవత్సరాలనీ విడ గొట్టాడు.

మంచిరోజులూ, అమృత ఘడియలూ  నిర్ణయించాడు. వాడెంత తెలివైనవాడంటే... కాలాన్ని ఫిస్టులో పట్టుకోగలనన్నాడు. సెకన్లు, నిమిషాలు, గంటలను మణికట్టుకు తిరిగాడు. కళ్లకు ముళ్లు గుచ్చుకుంటా యేమోనని గడియారంలో నలు చదరమైన డిజిటల్ అంకెలను పేర్చాడు. అలాగే క్యాలెండర్‌లో మంచిరోజులూ చెడ్డరోజులూ కూర్చాడు. తేదీలు, నెలలు, సంవత్సరాల్ని కాగితం మీద పేర్చాడు. క్యాలెండర్ అనే పేరిచ్చి, వాటితో గోడ కుర్చీ వేయించాడు.

అయిపోయిన నెలలను మొదట శీర్షాసనం వేయించి, ఆ తర్వాత వెనక్కు మడిచేసి, చక్రాసన, ధనురాసన ఇత్యాది యోగాసన ప్రక్రియలు చేయి స్తుంటాడు. టేబుల్ క్యాలెండర్ పేరిట కొన్నింటితో బస్కీలు తీయిస్తుంటాడు. ఎర్ర రంగులో ఉన్న తేదీ వచ్చినప్పుడల్లా బడికి సెలవొస్తుందని చిన్నప్పట్నుంచే నేర్పడం మొదలు పెడతాడు. అది నిజమవుతుంది. క్యాలెండరేతర అంశాలపైనా దృష్టి సారిస్తుంటాడు.

ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకోడానికి కొందరు బయల్దేరతారు. మోసపోయే విద్యను పనిగట్టుకు నేర్చుకుంటారు. పాపం...  చెట్టూ, పుట్టా, పిట్టా, సమస్త జంతుజాలాలకు ఈ విషయాలు తెలియవు కాబట్టి అవి క్యాలెండర్ చూసుకోవు. చెట్లు పైపైకి పెరుగుతాయి. పిట్టలు ముందుకెళ్లడానికి రెక్కల కష్టం చేస్తాయి. జంతుజాల సమస్తమూ ముందుకే నడుస్తాయి. కానీ మనిషి ఎంత తెలివైనవాడంటే... కాలం వెనక్కు నడవదని తెలిసినా, క్రీస్తు పుట్టక ముందు కాలాన్ని వెనక్కు నడిపిస్తాడు.

చరిత్ర తెలి యనివాడు క్రీస్తుపూర్వానికి ముందు డేట్స్ చదువుతుంటే అది ప్రింటింగ్ మిస్టేకా అని పించేలా చేస్తాడు. ముందు కెళ్తున్న రైల్లోని సగం సీట్లు  వెనక్కు తిప్పి పెట్టడం అవసరమనీ, ఆ సౌలభ్యం వల్లనే సగం మందిని కూర్చోబెట్టగలుగుతున్నా మని నమ్మబలుకుతాడు. అలా కొందరిని వెనక్కి నడి పించడానికి పూను కుంటాడు. తమకు చాలా తెలుసు అనే కొందరు మనషులకు నిజంగా ఏమీ తెలి యదు.

ముఖ్య దినాలనీ, ముహార్తాలనీ కొన్ని రోజులకు సుగంధ పరిమళాలు అద్దితే... ఆ సువాసనలు పీలుస్తున్నట్లు ఊహిస్తారు. మరికొన్ని దినాలను దుర్దినాలుగా ముద్రవేస్తే అవి క్షుద్రమైనవని విశ్వసిస్తుంటారు. వాళ్లు తమకన్నీ తెలుసనే భ్రాంతిలో ఉంటారు. ఇలాంటి వాళ్లను నమ్మించడం చాలా సులువు. కొందరు మహానుభావులు ఏం చెప్పినా వీళ్లు విశ్వసిస్తుంటారు.

వీళ్ల కోతలెలా ఉంటాయంటే... మొద్దు నిద్దర పోతుండే కోడికి అలారం పెట్టి పొద్దున్నే లేపడం నేర్పింది తామేనని కూస్తారు. తాము ట్రబుల్ షూటర్లమంటారు. గాలి మోటర్లలో తిరుగుతారు. అల స్వర్గపురాన్ని ఇలాతలంలో నిర్మిస్తున్నామని అరచేయి చూపుతారు. మొక్కా, గిక్కా, పంటా, పసరూ పీకేస్తారు. చెట్లూ గట్రా కొట్టేస్తారు.  

చదునుగా చేసేస్తారు. ‘‘చూశావా... అడ్డంగా నరికి చూస్తే మొద్దులాంటి చెట్టు లోనూ రింగులు రింగులు కనిపిస్తున్నాయి. ఏడాదికేడాదీ పెరిగే  వీటినే యాన్యువల్ రింగ్స్ అంటారు. ఎంత పెద్ద వయసు చెట్టుకు అన్ని రింగులు. కాబట్టి చెట్టూ ఉంగరాలు తొడుగుతుంది’’ అని  చెబుతారు. ప్రజల బంగారాన్ని కొల్లగొట్టి చేతి వేళ్లకు తొడుక్కుంటారు. వేళ్లు పదే ఉండబట్టి గానీ... మరిన్ని ఉంటే వీళ్లకు రింగులు సరిపోవు. ఊడ్చేస్తారు, ఊళ్లేలతారు.

‘ఉంగరాలు మేం తొడిగాం, నడుం మీరు కట్టండంటూ మొండేనికి మొలదారం మాత్రమే మిగులుస్తారు.  ఇదేంట్రా బాబూ అంటే ‘చెట్టు మొద్దుకూ, నీ మొలకూ ఇదే అందం’ అంటూ మారేడుకు మసిపూస్తారు. నేరేడులోనిది నీలి సిరా అన్ని నమ్మిస్తారు. ఆ సిరాతో విధి రాతలోని హంస పాదులను సరిచేస్తామంటారు.
 
అన్నీ చెప్పాక... సామాన్యులకు అన్నీ దూరం చేసి, గోచీ మాత్రం మిగుల్చుతారు. అదేమిటని అడిగితే తేలికగా ఉండటంలో హాయిని అనుభవించమని సలహా ఇస్తారు. ఏతా వాతా క్యాలెండర్ మారినప్పుడల్లా ఏదో అద్భుతం జరుగుతుందని ఎందరో అనుకుంటారు. ఇంకేదో ఒరుగుతుందని ఆశపడతారు. ఆకాశాన్ని అంబరమనే అంటారంటూ... అనగా అర్థం వస్త్రమేనంటూ వ్యాఖ్యానం చెప్పి, దాని ముక్కను చింపి ఇస్తామంటారు.

దానితో కొత్త బట్టలు కుట్టిస్తామంటారు. చమ్మీ ధమ్మీలతో అధికారాలు చెలాయిస్తుంటారు. కాలాన్ని వెళ్లదీస్తుంటారు.
 క్యాలెండర్ పుట మారితే సరిపోతుందా... కొత్త సంవత్సరాన్ని తిరగస్తే అది ‘త్తకొంరత్సవంస’ అవుతుందేమో గానీ... చేతి గీత ఎన్నడూ మారదు కదా! విధి రాత మారాలంటే కనీసం ఇది ఎన్నికల ఏడాది... 2019 అయినా కాదు కదా!

 - యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement