కిడ్నీకీ... క్రియాటినిన్‌కు సంబంధం ఏమిటి? | Kidniki ... Kriyatininku What is the relationship? | Sakshi
Sakshi News home page

కిడ్నీకీ... క్రియాటినిన్‌కు సంబంధం ఏమిటి?

Published Thu, Dec 12 2013 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

కిడ్నీకీ... క్రియాటినిన్‌కు సంబంధం ఏమిటి?

కిడ్నీకీ... క్రియాటినిన్‌కు సంబంధం ఏమిటి?

నా వయసు 38. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని కావడంతో రోజుకు కనీసం 10 -12 గంటలకు పైగా ఇంటర్నెట్ మీద కూర్చుంటాను. ఇటీవలే మా కంపెనీలో యాన్యువల్ హెల్త్ చెకప్ జరిగినప్పుడు, క్రియాటినిన్ 1.7 ఉన్నట్లుగా రిపోర్టు వచ్చింది. కిడ్నీ స్పెషలిస్ట్‌కు తప్పక చూపించాల్సిందిగా మా కంపెనీ డాక్టర్ సలహా ఇచ్చారు. క్రియాటినిన్‌కూ, కిడ్నీకీ సంబంధం ఏమిటి? క్రియాటినిన్ తగ్గడానికి ఏవైనా మార్గాలుంటే చెప్పండి.
 - కె.ఎన్.వి., హైదరాబాద్

 
 మూత్రపిండాల (కిడ్నీ) పనితీరును తెలుసుకోవడానికి చేసే పరీక్షల్లో క్రియాటినిన్, బ్లడ్ యూరియా చాలా ముఖ్యమైనవి. సాధారణంగా శరీరంలో క్రియాటినిన్ పరిమాణం  0.5 ఎంజీ/డీఎల్ నుంచి 1.2 ఎంజీ/డీఎల్ వరకు ఉండాలి. అదే బ్లడ్ యూరియా అయితే 20 ఎంజీ/డీఎల్ నుంచి 40 ఎంజీ/డీఎల్ ఉండవచ్చు. ఒకవేళ క్రియాటినిన్ పరిమాణం 1.5 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ పనితీరు సామర్థ్యం తగ్గినదానికి  ఒక సూచనగా పరిగణించాలి. అదే క్రియాటినిన్ పరిమాణం 4 ఎంజీ/డీఎల్  కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ పనితీరు 80శాతం నుంచి 90శాతం వరకు తగ్గినట్లుగా భావించాలి.
 
 శరీరంలో క్రియాటినిన్ పెరగడానికి ప్రధానమైన కొన్ని కారణాలు... హైబీపీ, డయాబెటిస్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ గ్రంథి వాపు, నొప్పి నివారణ మందులు దీర్ఘకాలంపాటు వాడటం, ఉప్పు,మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవడం వంటివి.
 
 ఒకవేళ క్రియాటినిన్ పరిమాణం1.5 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా వస్తే కేవలం కిడ్నీకి సంబంధించిన పరీక్షలే కాకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటివి కూడా చెక్ చేయించుకుని కిడ్నీ స్పెషలిస్ట్‌ను కలవాలి. వయసు పెరిగేకొద్దీ శరీరంలో క్రియాటినిన్ పరిమాణం పెరగకుండా ఉండాలంటే రోజూ 3-4 లీటర్ల నీటిని తాగుతూ, అరగంటకు తగ్గకుండా ఒళ్లు అలిసేలా వ్యాయామం చేస్తూ, మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి.
 
 మీరు చెప్పిన విధంగా ఇంటర్నెట్‌పై 10 గంటలు కూర్చుండటం వల్ల క్రియాటినిన్ పెరుగుతుందనే అంశంపై ఇంకా శాస్త్రీయమైన నిరూపణలేమీ లేవు. అయినా మీరు వైర్‌లెస్ ఇంటర్నెట్ ఉపయోగాన్ని వీలైనంతగా తగ్గించడం, బాగా వేడిని వెలువరించే ల్యాప్‌టాప్‌లను శరీరానికి వీలైనంత దూరంగా ఉంచి ఉపయోగిస్తే మంచిది. మధ్య మధ్య వీలైనంత విశ్రాంతి తీసుకోవడం అవసరం.
 
 నా వయసు 28. చాలా సన్నగా ఉంటాను. ఎంత తిన్నా నా బరువు 48 కిలోలు దాటడం లేదు. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత చాలా నీరసంగా ఫీలవుతున్నాను. మాంసాహారం అలవాటు లేదు. రోజుకు 10 సిగరెట్స్ తాగే అలవాటు ఉంది. రెండు నెలల నుంచి అంగస్తంభన సరిగా జరగడం లేదు. ఏ ఆహారపదార్థాలు తీసుకుంటే సెక్స్ పొటెన్సీ పెరుగుతుంది? తగిన సలహా ఇవ్వగలరు.
 - సి.ఆర్.ఎమ్., ఒంగోలు

 
 ఎత్తుకు తగిన బరువు ఉండటం మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. చాలామంది సన్నగా ఉన్నవారు లావెక్కాలని, లావుగా ఉన్నవారు సన్నబడాలని ప్రయత్నిస్తుంటారు. ఎత్తు-బరువు ఛార్ట్ చూసుకుని, దానికి తగ్గట్లుగా ఉంటే మీ బరువును గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక సెక్స్ అనేది మీ మానసిక-శారీరక నిలకడను సూచిస్తుంది. శాకాహారమైనా, మాంసాహారమైనా సరైన మోతాదులో శరీరానికి అవసరమైన పాళ్లలో తీసుకుంటే శారీరక దృఢత్వంలో తేడా ఉండదు. మీరు శాకాహారం తిన్నా, మాంసాహారం తిన్నా అది సమతుల ఆహారమై ఉండి, అన్ని పోషకాలూ సమపాళ్లలో అందేలా తీసుకుంటే శరీరంలో, సెక్స్‌లో పటుత్వం ఎప్పటికీ తగ్గదు. మూడుపూటలా ఆకలవుతూ ఉండి, బాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటూ ఉండటం కేవలం ఒక్క సెక్స్ విషయంలోనే గాక... శారీరక ఆరోగ్యానికీ మంచిది. మీరు సిగరెట్స్ పూర్తిగా మానేసి, సమతులాహారం తీసుకునేలా జాగ్రత్త తీసుకోండి. ఇక మీరు ఎంత ఎక్కువగా తింటున్నా లావెక్కడం లేదని బాధపడుతున్నారు కాబట్టి ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటే మంచిది.
 
 నా వయసు 19. నాకు ఎలాంటి చెడు అలవాట్లూ లేవు. స్నానం చేసే సమయంలో  పురుషాంగంపై ఉన్న చర్మాన్ని వెనక్కి లాగి ప్రతిరోజూ శుభ్రపరచుకుంటాను. అయితే ఈవుధ్య అంగం మీది చర్మం బాగా పొడిగా అయిపోయి  వుునుపటిలా వెనక్కు రావడం లేదు. బలవంతంగా వెనక్కు నెడితే క్రాక్స్ ఏర్పడి రక్తం వస్తోంది. ఈ సవుస్యతో చాలా ఆందోళనగా ఉంది. డాక్టర్‌కు చూపించాలంటే సిగ్గుగా ఉంది. దయచేసి నాకు మంచి సలహా ఇవ్వండి.
 - ఎస్.ఎస్.ఆర్., అమలాపురం

 
 పురుషాంగం మీది చర్మం ఫ్రీగా వెనక్కు వెళ్లకుండా ఉండే కండిషన్‌ను ఫైమోసిస్ అంటారు. దీనివల్ల చర్మం చివరి భాగంలో క్రాక్స్ వచ్చి ఇన్ఫెక్షన్‌కు దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు సెక్స్ చేస్తే నొప్పి రావచ్చు. ఒక్కోసారి చర్మం వెనక్కి వెళ్లి మళ్లీ ముందుకు రాకపోతే వాపు కూడా రావచ్చు. యుక్తవయుసులో ఇలా చర్మం ఫ్రీగా ముందుకు, వెనక్కు రాకపోతే సున్తీ చేయించుకోవడం మంచిది. దీనివల్ల వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం కూడా సులువు. సెక్స్ చేయడానికీ అనువుగా ఉంటుంది. మన ప్రైవేట్ పార్ట్స్ వద్ద వచ్చే సమస్యలు కూడా ఇతర సమస్యల్లాంటివే. ఇతర సమస్యలను ప్రస్తావించడానికి మనం ఎలా సిగ్గుపడమో, డాక్టర్ వద్ద ఈ సమస్యలను చెప్పడానికీ అలాగే సిగ్గుపడాల్సిన, బిడియ పడాల్సిన అవసరం లేదు. డాక్టర్లు ఉన్నదే ఇలాంటి సమస్యలను చక్కదిద్దడానికి. అందుకే చెడు అలవాట్లు ఉన్నా లేకపోయినా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్‌కు చూపించి సమస్య నుంచి విముక్తి పొందడమే మనం చేయాల్సింది. ఏ డాక్టర్ కూడా దీనికి మిమ్మల్ని నిందించడు. తక్కువగా చూడడు. చెడుగా అనుకోడు. కాబట్టి మీ దగ్గర్లోని డాక్టర్‌కు చూపించి వెంటనే తగిన చికిత్స చేయించుకుని, మీ బాధల నుంచి విముక్తి పొందండి.
 నిర్వహణ: యాసీన్
 
 డాక్టర్ వి.చంద్రమోహన్
 యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
 ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్,
 కెపిహెచ్‌బి, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement