మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ లకు కొత్త నార్మల్ విలువలు
కార్డియాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు
ఇప్పటివరకూ రక్తంలో కొలెస్ట్రాల్విలువలు తెలుసుకోడానికి రాత్రి భోజనం తర్వాత కనీసం 12 గంటలపాటు ఆగాక..ఉదయమే ఏదీ తినకుండా పరగడుపున ఈ పరీక్ష చేయించాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఆంక్షలేమీ ఉండవని కార్డియాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ) పేర్కొంది. ‘లిపిడ్ ప్రొఫైల్’పరీక్ష ఇకపై పరగడుపున చేయించాల్సిన అవసరం లేదని సీఎస్‌ఐ తెలిపింది. రక్తంలో ఈ విలువలు నార్మల్‌గా లేకపోవడాన్ని ‘డిస్‌లిపిడేమియా’అని పేర్కొంటారు. ఇలా లేకపోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశముంటుంది.
ఈ మేరకు సీఎస్‌ఐ తొలిసారిగా ‘డిస్‌లిపిడేమియా’కు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. నిజానికి ఇప్పటివరకూ మన దేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ నిర్దేశించిన మార్గదర్శకాలనే అనుసరిస్తున్నాయి. అయితే కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 22 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పడింది. ఇటీవలే అది డిస్‌లిపిడేమియా మార్గదర్శకాలనూ, మంచి, చెడు కొలె్రస్టాల్‌ల నార్మల్ తాలూకు కొత్త విలువలను వెల్లడించింది.
ఈ సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆనరరీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ధూర్జటి ప్రసాద్ సిన్హా మాట్లాడుతూ ఇకపై పరగడుపున మాత్రమే లిపిడ్ ప్రొఫైల్ అక్కర్లేదనే సూచన తొలగిపోవడం అందరికీ మంచి సౌలభ్యం కలిగించే అంశమన్నారు. దీంతో అనేకమంది ఎప్పుడంటే అప్పుడు ఈ పరీక్ష చేయించుకునే సౌకర్యం కలిగిందని చెప్పారు.
ఈ మార్గదర్శకాల ప్రకారం..
» లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష వీలైనంత త్వరగా (18 ఏళు దాటేనాటికే) చేయించుకోవాలి. అయితే కుటుంబంలో గుండెజబ్బులు, రక్తంలో కొలె్రస్టాల్ మోతాదులు ఎక్కువగా ఉన్న కుటుంబాల్లోని వారు (అంటే ఫెమీలియల్ హైపర్ కొలెస్టెరాలేమియా హైరిస్క్ పేషెంట్స్) అంతకంటే ముందే ఈ పరీక్ష చేయించుకోవచ్చు.
» ముప్పు ఎక్కువగా (హైరిస్‌్క) ఉన్నవారు మినహాయించి మిగతా అందరికీ చెడు కొలె్రస్టాల్ మోతాదుల (ఎల్‌డీఎల్–సీ) నార్మల్ విలువ 100 ఎంజీ/డీఎల్.
» ముప్పు ఎక్కువగా ఉన్నవారు మినహాయించి మిగతా అందరికీ హెచ్‌డీఎల్ కాకుండా మిగతా అన్ని కొలెస్ట్రాల్‌ల మోతాదుల (నాన్–హెచ్‌డీఎల్–సీ) నార్మల్ విలువ 130 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉండాలి.
» డయాబెటిస్ / హైబీపీ వల్ల ముప్పు ఎక్కువగా (హైరిస్‌్క) ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్–సీ) విలువ 70 ఎంజీ/డీఎస్ కంటే తక్కువగా ఉండాలి.
» ఈ నార్మల్ విలువల కంటే ఎక్కువగా ఉండటంతో పాటు ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు ఎక్కువగా ఉన్నట్టయితే అది గుండెపోటు (హార్ట్ స్ట్రోక్) లేదా గుండెజబ్బులు (పెరిఫెరల్ హార్ట్ డిసీజ్)లకు దారితీయవచ్చని తెలుసుకోవాలి. ఈ ట్రైగ్లిజరైడ్స్ కొవ్వుల నార్మల్ విలువ 150 ఎంజీ/డీఎల్‌కు లోపున ఉండాలని గుర్తుంచుకోవాలి.
» మరీ ఎక్కువ ముప్పు (వెరీ హై–రిస్‌్క) ఉన్న పేషెంట్స్... అంటే గుండెపోటు వచ్చి ఉన్నవారు, యాంజైనా అనే చాతీనొప్పి వచ్చినవారు, దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బు (సీకేడీ) ఉన్నవారిలో చెడు కొలె్రస్టాల్ (ఎల్‌డీఎల్) మోతాదులు 55 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగానూ మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) కాకుండా మిగతాది (నాన్–హెచ్‌డీఎల్) కొలెస్ట్రాల్ మోతాదులు 85 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.
– సాక్షి హెల్త్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment