కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకుంటేనే గుండె ఆరోగ్యానికి మేలు!
డాక్టర్లు చెప్పిన మందులు చెప్పినట్లు వేసుకునేవారు మనదేశంలో తక్కువే ఉంటారు. అమెరికాలో కూడా ఇంతే. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వృద్ధుల్లో దాదాపు 40 శాతం మంది వైద్యులు సూచించిన మందులు వేసుకోరని ‘పాప్యులేషన్ మెడిసిన్’ జర్నల్ అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ‘లో డెన్సిటీ లిపో ప్రోటీన్’ క్లుప్తంగా ఎల్‌డీఎల్ అని పిలిచే ఈ రకమైన కొవ్వు గుండె ఆరోగ్యానికి చాలా కీలకం. మందులు సక్రమంగా వేసుకోకపోతే ఈ రకమైన కొవ్వులు ఎక్కువవుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో గార పేరుకుపోవడం కూడా పెరిగి పోతుంది. ఇది కాస్తా గుండెజబ్బు లేదా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే సమస్య మరింత జటిలమవుతుంది.
మందులు సక్రమంగా వేసుకోకపోయేందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం ఒకటైతే.. ‘‘ఆ..ఏమవుతుంది లే’’ అన్న నిర్లక్ష్యం రెండోది. మందులేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న ఆందోళన మూడోది. కానీ... ఎల్‌డీఎల్ మోతాదులు ఆరోగ్యకరంగా ఉండాలంటే దీర్ఘకాలిక విధానం ఒకటి అవసరమవుతుంది. మందులు నిలిపివేయడం వల్ల కొలెస్ట్రాల్ మళ్లీ పెరిగిపోతుంది. కాబట్టి లక్షణాలు ఉన్నా లేకపోయినా వైద్యులు సూచించినట్లుగా మందులు వేసుకోవడం అవసరం.
ఎల్‌డీఎల్ మోతాదులను నియంత్రించుకోవాల్సిన అవసరం గురించి హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్ క్యాథ్ ల్యాబ్ సీనియర్ కన్సలెట్టంట్, కార్డియాలజిస్ట్ డాక్టర్ పీఎల్‌ఎన్ కపర్థి మాట్లాడుతూ "LDLC, లేదా "చెడు" కొలెస్ట్రాల్ నియంత్రణ జీవితాంతం కొనసాగాల్సిన ప్రయత్నం. చాలామంది మేము సురక్షితంగానే ఉన్నామని అనుకుంటారు కానీ.. అలా భావించి మందులు అశ్రద్ధ చేయడం వల్ల గుండెపోటుకు గురైన వారూ ఉన్నారు.
కొలెస్ట్రాల్ నియంత్రణ అనేది రక్తనాళాల్లోపలి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. లక్షణాలు కనిపించవు కానీ నెమ్మదిగా తీవ్రమవుతుంది. అందుకే తరచుగా డాక్టర్ చెకప్‌లు చేయించుకోవడం అవసరం. దీనివల్ల ఏదైనా మార్పులు ఉంటే ముందుగానే గుర్తించి తగు చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే వైద్యులు చెప్పినట్లు మందులు కచ్చితంగా సమయానికి తీసుకోవాలి.”
హెల్తియన్స్ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక పోల్ ప్రకారం భారతదేశంలో 31 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉన్నారు. హైదరాబాదు జనాభాలో ఈ మోతాదు 27.4% కావడం గమనార్హం. ఇది అథెరోస్కెలరోటిక్ కార్డియో వాస్కులర్ డిసీజ్ (ASCVD) పెరుగుదలను సూచిస్తుంది.
ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు లక్షణాలేవీ కనిపించవని ముందుగానే చెప్పుకున్నాం. అందుకే దీన్ని నిశ్శబ్ధ కిల్లర్ అని పిలుస్తూంటారు. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే ధమనులకు హాని జరుగుతుంది. క్రమంగా మూసుకుపోతాయి. పరిస్థితి తీవ్రమయ్యే వరకూ ఎవరూ గుర్తించలేరు. ఒకసారి మందులు తీసుకోవడం ఆపివేసినా సూచించిన విధంగా తీసుకోకపోయినా ఎల్‌డీఎల్ స్థాయులు మళ్లీ పెరగవచ్చు.
కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడానికి జీవనశైలి మార్పులు, సూచించిన మందులు సక్రమంగా తీసుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం.
Comments
Please login to add a commentAdd a comment