వాల్వ్స్ సమస్య ఎందుకు వస్తుంది?
మా అమ్మ వయసు 57 ఏళ్లు. ఈమధ్య పొడిదగ్గు, పడుకుంటే ఆయాసంతో నిద్రలేవడం, గుండె దడ వంటివి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాం. హార్ట్వాల్వ్లలో ఏదో సమస్య ఉందని డాక్టర్ గారు అన్నారు. అసలు ఈ వాల్వ్స్ సమస్య ఎందుకు వస్తుందో వివరించి, లక్షణాలు, చికిత్సల వంటి వివరాలను దయచేసి తెలియజేయండి. – యశస్విని, విశాఖపట్నం
మీరు చెప్పిన లక్షణాల బట్టి మీ అమ్మగారికి గుండె కవాటాలలో సమస్య (హార్ట్ వాల్వ్ డిసీజ్) ఉందని తెలుస్తోంది. గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయి. అవి... 1) ట్రైకస్పిడ్ వాల్వ్ 2) పల్మనరీ వాల్వ్ 3) మైట్రల్ వాల్వ్ 4)అయోర్టిక్ వాల్వ్. ఈ నాలుగు కవాటాలలలో రెండు రకాలు సమస్యలు రావచ్చు. అవి... వాల్వ్స్ సన్నబడటం (స్టెనోసిస్)తో పాటు వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్).
వాల్వ్ సమస్యలకు కారణాలు: కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల, కొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజెస్ వల్ల, మరికొందరికి ఇవి పుట్టుకతోనే (కంజెనిటల్గా) రావచ్చు. కొందరిలో వయసు పెరగడం వల్ల (డీజనరేటివ్గా) కూడా ఇవి వచ్చే అవకాశం ఉంది.
వాల్వ్ సమస్యతో కనిపించే లక్షణాలు:హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఆయాసం, పొడి దగ్గు, పడుకుంటే ఆయాసం వల్ల నిద్ర నుంచి లేవాల్సి రావడం, గుండె దడ (పాల్పిటేషన్)గా ఈ లక్షణాలు కనిపిస్తాయి. నిస్సత్తువతోనూ ఒక్కోసారి గుండెనొప్పి రావచ్చు. ఈ సాధారణ లక్షణాలతో పాటు కొందరిలో సమస్య వచ్చిన కవాటాన్ని బట్టి నిర్దిష్టంగా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు ∙ట్రైకస్పిడ్ వాల్వ్ లీక్ (రీ–గర్జిటేషన్) సమస్యతో కాళ్ల వాపు ∙మైట్రల్ వాల్వ్ సన్నబడితే (స్టెనోసిస్తో) రక్తపు వాంతులు ∙అయోర్టిక్ వాల్వ్ సన్నబడితే (స్టెనోసిస్తో) స్పృహ తప్పవచ్చు. ఇప్పుడు ‘ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో కార్డియోగ్రామ్’ అనే పరీక్ష వల్ల గుండెను మరింత స్పష్టంగా చూడటానికి అవకాశం ఉంది. కాబట్టి నిర్దిష్టంగా సమస్య ఒక్క చోటే ఉంటే మొత్తం వాల్వ్‌ను మార్చవచ్చు.
వాల్వ్ సమస్యలకు చికిత్స: వీటికి కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితిని బట్టి సర్జరీ అవసరమవుతుంది. మైట్రల్ వాల్వ్ సన్నగా మారడం (స్టెనోసిస్) జరిగితే... రోగులకు బెలూన్ వాల్విలోప్లాస్టీ అనే చికిత్స ద్వారా సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు. అయితే మిగతా గుండె కవాటాలు సన్నగా మారినా లేదా లీక్ అవుతున్న సందర్భాల్లో ఈ వాల్విలోప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్మెంట్ అన్నదే పరిష్కారం.వాల్వ్స్‌ను రీప్లేస్ చేసే క్రమంలో రెండు రకాల వాల్వ్స్‌ను ఉపయోగించవచ్చు. అవి... 1) మెకానికల్ వాల్వ్స్ 2) టిష్యూ వాల్వ్స్.మెకానికల్ వాల్వ్స్ విషయంలో ఒక ప్రతికూలత ఉంది. ఈ రోగులకు జీవితాంతం రక్తాన్ని పలుచబార్చే మందు ఎసిట్రోమ్ వాడాల్సి ఉంటుంది. ’ టిష్యూ వాల్వ్స్ అన్నవి ఇతర జంతువుల కండరాలతో చేసినవి. ఈ టిష్యూ వాల్వ్స్ వాడిన వాళ్లలో రక్తాన్ని పలుచబార్చే మందు ఎసిట్రోమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది 15 ఏళ్ల వరకు పనిచేస్తుంది.ప్రస్తుతం వాల్వ్స్ మార్చడం కన్నా ఉన్న వాల్స్ ఎప్పుడూ మెరుగైనవి కావడంతో గుండె కవాటాలకు వచ్చే సమస్యలకు సర్జరీ కంటే వాల్వ్స్ రిపేర్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా వాల్వ్స్‌ను రిపేర్ చేసిన సందర్భాల్లో జీవితాంతం వాడాల్సిన ఎసిట్రోమ్ (రక్తాన్ని పలుచబార్చే మందు) ఇవ్వాల్సిన అవసరం లేదు.
బైపాస్అయింది..జాగ్రత్తలు?
ఇటీవలే మా అమ్మకు బైపాస్ సర్జరీ అయ్యింది. ఆమె విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – ఎమ్. శ్రీనాథ్, ఖమ్మం
అన్ని కండరాలకు అవసరమైనట్లే గుండెకండరానికి కూడా రక్తం ద్వారా పోషకాలు, ఆక్సిజన్ అందాలి. కానీ గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడిన వాళ్ల గుండె కండరానికి తగినంత రక్తం అందదు. దాంతో క్రమంగా గుండె కండరం చచ్చుబడిపోతుంది. గుండెలో అడ్డంకులు పెరిగి గుండెకు తగినంత రక్తం అందే పరిస్థితి లేనప్పుడు, గుండెకండరం చచ్చుపడే ప్రమాదాన్ని నివారిస్తారు. గుండెకు తగినంత రక్తం అందేలా చేయడం కోసం చేసే ఈ శస్త్రచికిత్సలో కాలినుంచి రక్తనాళాన్ని ముందుగా తీసుకుంటారు. దీన్ని ద్వారా గుండెకండరానికి రక్తం అందేలా బైపాస్ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. ఈ సర్జరీ వాళ్లు మొదటి ఆరు వారాల్లో పాటించాల్సిన జాగ్రత్తలివి.
డాక్టర్లు సూచించిన ఆరోగ్యకరమైన వ్యాయామాలను రోజుకు రెండుసార్లు... పదినిమిషాల పాటు చేయాలి ∙ఏమాత్రం భారం పడకుండా పది పదిహేను నిమిషాల పాటు రోజుకు రెండుసార్లు నడక (వాకింగ్)కు ఉపక్రమించాలి అకస్మాత్తుగా ముందుకు, వెనక్కు, పక్కలకు ఒంగడం వంటివి చేయకూడదు ∙మూడు కిలోలకు మించిన బరువు కనీసం నెలరోజుల పాటు ఎత్తవద్దు ∙నేల మీద కూర్చోవడం, కాలుమీద కాలేసుకోవడం వంటివి చేయకండి ∙శస్త్రచికిత్స కోసం శరీరంపై గాటు పెట్టిన చోట ఎలాంటి ఒత్తిడీ పడకుండా చూసుకోండి. ∙భారమైన పనులు చేయకండి ∙డాక్టర్లు సూచించిన మందులు క్రమం తప్పకుండా చేయండి.
శస్త్రచికిత్స అయిన ఆరు వారాల తర్వాత: దీర్ఘకాలంలో గుండెపై కలిగే దుష్ప్రభాలను నివారించడానికి కూడా ఈ జాగ్రత్తలు తోడ్పడతాయి. అవి... ∙కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచుకోండి. అందుకు తగినట్లుగా డాక్టర్ల సూచన మేరకు ఆహార, వ్యాయామ నియమాలను పాటించండి. ∙రక్తపోటును అదుపులో ఉంచుకోండి. ఇందుకోసం డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే... రిలాక్సేషన్ ప్రక్రియలైన ధ్యానం, యోగా వంటివి చేయండి. ∙రక్తంలో చక్కెర పాళ్లను తెలుసుకునే పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకుంటూ, మీ డాక్టర్‌కు తెలియజేస్తూ ఉండండి. అందులో వచ్చిన మార్పులను బట్టి వైద్యులు మీ మందులను మార్చడం వంటివి చేస్తారు ∙సిగరెట్ పొగకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్స్పోజ్ కావద్దు. అది రక్తనాళాల మృదుత్వాన్ని దెబ్బతీయడంతో పాటు అవి రక్తనాళాలు సన్నబారేలా చేయవచ్చు. పైగా ఆ పొగ గుండె వేగాన్ని పెంచుతుంది. కాబట్టి పొగాకు ఏరూపంలోనైనా తగదు ∙మద్యంకూడా గుండెకు హానిచేసేదే ∙ఒత్తిడికి గురికావడం రక్తపోటును పెంచి, గుండెపోటుకు దారితీసేలా చేసే అంశం. కాబట్టి ఒత్తిడి లేకుండా చూసుకోండి ∙ఒకేచోట కూర్చొని ఉండకండి. చురుగ్గా ఉండే జీవనశైలి మార్పుతోనూ గుండెజబ్బును నివారించుకోండి.
తరచూగుండెదడ...ప్రమాదమా?
నా వయసు 45 ఏళ్లు. ఈమధ్య నాకు గుండె దడగా ఉంటోంది. అడపా దడపా ఇలా జరుగుతోంది. దీనివల్ల గుండెకు ఏమైనా ప్రమాదమా? దయచేసి తగిన సలహా ఇవ్వండి.– ఎమ్. అప్పారావు, విజయనగరం
సాధారణ పరిస్థితుల్లో అయితే గుండె తాలూకు స్పందనలను మనం గుర్తించం. కానీ ఒకవేళ వాటిని స్పష్టంగా గుర్తించడమూ, గ్రహించే స్థితి ఏర్పడితే దాన్ని గుండె దడ అంటారు. గుండె దడ అనేది ఒక వ్యాధి కాదు. ఒక లక్షణం. భయాందోళనలకు గురైనప్పుడు, ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు గుండె అదనపు వేగంతోనూ, శక్తితోనూ పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నంలో ఎవరి గుండె స్పందన వాళ్లకు తెలుస్తుంది. ఇలాంటి తాత్కాలికంగా కనిపించి దానంతట అదే సద్దుమణుగుతుంది.అయితే ఇదే పరిస్థితి నిరంతర లక్షణంగా మారితే దానికి ప్రాధాన్యం ఇవ్వాలి లేకపోతే చాలా మందిలో గుండెకు సంబంఇంచిన ప్రతి అంశం ఆందోళన పుట్టిస్తుంది. సాధారణమైన జలుబులు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, టీ, కాఫీ, మద్యం తాగడం వంటి అంశాలు కూడా గుండెదడను కలిగించగలవనే విషయం తెలియక చాలామంది విపరీతమైన ఆందోళనకు, అలజడికి గురవుతారు.సాధారణంగా ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు గుండెదడ వస్తుంది లేదా గుండెకు సంబంధించిన వ్యాధులలో కూడా ఈ స్థితి కినిస్తుంది. గుండెదడను వైద్యశాస్త్రపరంగా విశ్లేషించేటపుపడు సాధారణ రక్తపరీక్ష మొదలు ఈసీజీ వరకు అనేక రకాల పరీక్షలు అవసరమవుతాయి.
కొన్ని సాధారణ కారణాలు: గుండె కవాటాలు వ్యాధిగ్రస్తం కావడం, గుండె కండరాలు క్రియాహీనంకావడం జరిగితే గుండెదడ ఉంటుంది. ఛాతీలో వచ్చే నొప్పి, ఆయాసాన్ని నిర్లక్షం చేయకూడదు. శ్వాస అందని సమయాల్లోనూ, కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించినప్పుడు, కళ్లుబైర్లుగమ్మినట్లు అనిపించినప్పుడు ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు.
సూచనలు: ’ గుండెగడగా ఉన్నప్పుడు మరీ వేడిగా ఉండే పదార్థాలను తినకూడదు. కషాయం, చేదు, కారం రుచులను తగ్గించుకోవాలి. ఎక్కువగా తినడం, తిన్నది జీర్ణం కాకముందే తినడం మంచిది కాదు.
∙మలమూత్ర విసర్జనలను ఆపుకోకూడదు ∙కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ లాంటి ఉత్ప్రేరక పదార్థాలు వాడటం తగ్గించాలి. టీ కంటే కాఫీ మరింత ప్రమాదకరం ∙పొగతాగే అలవాటు మానేయండి. పక్కనుండే స్నేహితులు పొగతాగుతున్నా వారించండి ∙మానసికంగా నిలకడగా, నిశ్చింతగా ఉండాలి ∙బిగ్గరగా మాట్లాడకూడదు, మాట్లాడితే గుండెదడ పెరుగుతుంది ∙నూనెలు, కొవ్వు పదార్థాలు వాడకాన్ని తగ్గించాలి ∙మరీ దడ ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్‌ను నల్లగ్గొట్టి ఒక బ్యాగ్‌లో వేసి, ఛాతీపై పెట్టుకుంటే గుండెదడ సద్దుమణుగుతుంది. డాక్టర్ హేమంత్ కౌకుంట్లకార్డియోథొరాసిక్ సర్జన్ అండ్డైరెక్టర్ ఆఫ్ కార్డియాక్ సర్జరీ, సెంచరీ హాస్పిటల్,రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్