కొండంత వ్యాధికి మెండైన చికిత్స! | Mendaina prior to the treatment of the disease! | Sakshi
Sakshi News home page

కొండంత వ్యాధికి మెండైన చికిత్స!

Published Sun, Mar 8 2015 1:01 AM | Last Updated on Thu, Mar 28 2019 5:12 PM

కొండంత వ్యాధికి మెండైన చికిత్స! - Sakshi

కొండంత వ్యాధికి మెండైన చికిత్స!

మెడికల్ మెమరీస్
 కొండాలు ఊరు గుంటూరు జిల్లాలోని పెదకాకాని. పేరుకు తగ్గట్టుగానే ఆయన కొండల్లాంటి బరువులను అలవోకగా మోస్తుంటాడు. తానో ముఠామేస్త్రి. పొగతాగడం వంటి దురలవాట్లేమీ లేవు. రక్తపోటూ, మధుమేహం లాంటి దీర్ఘకాలిక జబ్బులూ లేవు. ఇంట్లోని రెండు పాడిగేదెల నుంచి రోజూ పాలు పితికేస్తాడు. జీవితంలోని ఆనందాలను పిండేస్తూ బతికేస్తాడు. కుటుంబసభ్యుల వెతలను తీర్చేస్తాడు. ఇదీ కొండాలు జీవనశైలి.
 
ఒక రోజున 50 కిలోల బియ్యం మూట మోస్తుంటే అకస్మాత్తుగా ఛాతీలో కలుక్కుమంది. చిన్ననొప్పేకదా అని  పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత తెలిసింది... కొండాలుకు వచ్చింది కొండంత కష్టమని!

మూడునాలుగు రోజుల్లోనే గుండె నొప్పి హెచ్చింది. ఆయాసం పెరిగింది. గుంటూరు పెద్దాసుపత్రిలో చూపించాడు. డాక్టర్లు పరీక్ష చేసి ‘అయోర్టిక్ డిసెక్షన్’ అని నిర్ధారించారు. అంటే... గుండె నుంచి అన్ని అవయవాలకూ రక్తాన్ని సరఫరా చేసే బృహద్ధమని గోడలు చిట్లిపోయాయి. ఆ చిట్లిన చోట్ల రక్తం చేరి గడ్డకడుతుంది. దాంతో ఇతర అవయవాలకు జరగాల్సిన రక్తసరఫరాకు అడ్డుకట్ట పడుతుంది. ఫలితంగా ఆయా అవయవాలు చచ్చుబడిపోయే ప్రమాదముంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ‘ప్రాణాంతకమైన వ్యాధి’.

కొండాలు వ్యాధి తీవ్రత పెరుగుతూ పోతోంది. బాధ తగ్గడం కోసం ఎక్కని మెట్టూ లేదు. మొక్కని చెట్టూ లేదు. ఎవరూ భరోసా ఇవ్వడం లేదు. ఎక్కడా థిలాసా కలగడం లేదు. విజయవాడ వెళ్లి సంప్రదిస్తే ‘ఈ చికిత్సకు ఆపరేషన్ ఒక్కటే మార్గం. కానీ భారతదేశంలోనే ఈ తరహా ఆపరేషన్లు చాలా అరుదు. అది కూడా చాలా ఖరీదు’ అన్నారు డాక్టర్లు. మరో పదిరోజులు గడిచాక అయోర్టిక్ డిసెక్షన్ తీవ్రత మరింత పెరిగింది. ఎడమ మూత్రపిండానికి రక్తప్రసరణ ఆగిపోయింది. ఎడమకాలికీ రక్తప్రవాహం నిలిచిపోయింది. పరిస్థితి కిడ్నీ ఫెయిల్యూర్ వరకూ రావడంతో కొండాలు ఆయుష్షు ఇక రోజులేనని తేల్చేశారు అక్కడి డాక్టర్లు. ఈలోగా కొండాలు తమకు దగ్గరి బంధువైన డాక్టర్ సుజాతను కలిశాడు. సుజాత గన్నవరం దగ్గరి పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్. ఆమె తండ్రికి గతంలో నేను యాంజియోప్లాస్టీ చేశాను. నామీది గురితో ఒకసారి నన్ను సంప్రదించమని చెప్పిందామె.

ఐదేళ్ల క్రితం అంటే... 2010లో కొండాలు నన్ను కలిసేనాటికి ఆ వ్యాధి ఎంతగా ముదరిందంటే శస్త్రచికిత్సతో దాన్ని తగ్గించడం ఇక అసాధ్యం అని తేలిపోయింది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలేమిటని వెతకడం మొదలుపెట్టాను. 2010కి ముందు కొందరిలో ఈ వ్యాధిని స్టెంట్ వేసి తగ్గించిన దాఖలాల గురించి నేను పరిశోధన పేపర్లలో చూసి ఉండటంతో ఆ దిశగా ఓ ప్రయత్నం చేద్దామని అనుకున్నా. కానీ అయోర్టిక్ డిసెక్షన్ కేసుల్లో బృహద్ధమనికి స్టెంట్ వేసి నయం చేయవచ్చని పుస్తకాల్లో చదివానే తప్ప ఆ తరహా చికిత్స ఎప్పుడూ చేయలేదు. పైగా ఎడమ మూత్రపిండానికీ, కాలికీ రక్తప్రసరణ ఆగడంతో కేసు మరీ సంక్లిష్టమైంది. అయినా ఒక ప్రయత్నం చేసి చూద్దామనే నా సంకల్పం. కొన్ని సందేహాలు వస్తే బెంగళూరులోని సీనియర్ వైద్యుల సలహాలు తీసుకున్నాం.

మర్నాడు స్టెంట్ అమరిక ఆపరేషన్‌కు సర్వవిధాలా సన్నద్ధమయ్యాం. ఈ ప్రయత్నంలో నా సహచరవైద్యుడూ చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ వెంగళరెడ్డి సహకారం మరువలేనిది. ముందుగా కుడికాలి రక్తనాళం ద్వారా బృహద్ధమని వరకూ చేరదామని ప్రణాళిక వేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ అక్కడివరకూ చేరలేకపోయాం. వెంటనే చేతి ధమని (రేడియల్ ఆర్టరీ) ద్వారా మళ్లీ ప్రయత్నించాం. ఈసారి సరైన చోటికే చేరాం. బృహద్ధమనిలో అవసరమైన ప్రదేశంలో స్టెంట్ వేశాం. ఆపరేషన్ విజయవంతమైంది. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడంతో కేవలం 60 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తయ్యింది. కొండాలు గుండెలోని అడ్డుతో పాటూ... మా గుండెల్లోని బరువూ తొలగిపోయింది. మూడు నెలల తర్వాత సీటీ స్కాన్ తీసి చూస్తే కిడ్నీకీ, కాలికీ రక్తప్రసరణ పూర్తిగా పునరుద్ధితమైంది.

ఆపరేషన్ అయ్యాక ఐదు రోజుల తర్వాత సురక్షితంగా ఇంటికి వెళ్లిన కొండాలు ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ఒకసారి సాధారణ చెకప్ కోసం నా దగ్గరికి వచ్చాడు. కొండాలు మాట ఎలా ఉన్నా అత్యంత అరుదైన వ్యాధికి, అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియను అత్యంత సులువు చేసి, ఆయన్ని బతికించినందుకు నాకు కొండంత ఆనందం!
నిర్వహణ: యాసీన్
 
కొండాలు వ్యాధి తీవ్రత పెరుగుతూ పోతోంది. బాధ తగ్గడం కోసం ఎక్కని మెట్టూ లేదు. మొక్కని చెట్టూ లేదు. ఎవరూ భరోసా ఇవ్వడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement