అమ్మా... నిన్ను తలచీ!
మెడికల్ మెమరీస్
మదర్స్ డే స్పెషల్
అందరిలాగే నేనూ చిన్నప్పుడు ఆవూ, పులీ కథ చదివాను. పులికి ఎదురైన ఆవు... ‘మునుమును పుట్టిన నా ముద్దుల పట్టికి రొమ్ము పట్టించి వస్తా’నన్నది. ఏ మూడ్‌లో ఉందోగానీ పులి సరే అంది. తువ్వాయి తలలో బుద్ధిమాటలు పెట్టి, కడుపునిండా పాలు పట్టి తిరిగి వచ్చింది ఆవు. మాట చెల్లించుకున్నందుకు పులి ఆనందించి, ఆవుమాతల్లికి సలాం కొట్టిందట. అప్పట్లో అందరిలాగే ఆ కథ చదివినా, డాక్టరయ్యాక నాకు ఆవులో మా అమ్మ కనిపించింది. మా అమ్మకొచ్చిన రొమ్ముక్యాన్సర్ పులిలా అనిపించింది.
మా నాన్న చలపతిరావు జనరల్ సర్జన్. అమ్మ ఉషాలక్ష్మి గైనకాలజిస్ట్. నేనెలాగైనా సర్జన్ అయిపోతానన్నది మా స్నేహితుల ఎత్తిపొడుపు. కానీ... నా ప్రతిభాపాటవాలతో నేను సర్జన్ కావాలి తప్ప... మా నాన్న ఉన్నతస్థానం వల్ల కాకూడదన్నది నా పట్టుదల. ఈ పట్టుదలే ఎం.ఎస్ (జనరల్ సర్జరీ) కస్తూర్బా మెడికల్ కాలేజీ మాంగలూర్‌లో ప్రథమస్థానంలో నిలిచేలా చేసింది. నాలో ఇలాంటి స్వాభిమాన భావాలు పెంపొందేలా చేసింది మా అమ్మే. నా భార్య డాక్టర్ వైజయంతి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నా నన్ను అనుసరించింది.
అమ్మకు వచ్చిన రొమ్ము క్యాన్సర్ కారణంగా ఇక్కడికి వచ్చి చూస్తే... భారత్‌లోని పరిస్థితులు నన్ను నివ్వెరపరిచాయి. రొమ్ము ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేక కేంద్రాలు లేవు. ఈ వ్యాధిపై అవగాహనా తక్కువే. స్క్రీనింగ్ చేయించుకోడానికి ముందుకు రావడానికి బిడియం. పరీక్షలంటే మొహమాటం. అందుకే ఈ పరిస్థితులను చక్కబరచి అందరిలోనూ అవగాహన కల్పించాలంటే ఏం చేయాలి? ఏ ఒక్కరికో, ఇద్దరికో ఉచిత చికిత్సల్లాంటివి చేసే బదులు... ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి... పెద్దఎత్తున ఒక సమూహానికీ, ఒక సమాజానికీ అవగాహన కల్పిస్తే అది వ్యాధి రాకముందే చేసే చికిత్సతో సమానం.
అందుకే ఫౌండేషన్ స్థాపించా. దానికి అమ్మ పేరు తప్ప మరి ఇంకే పేరు సరిపోతుంది? మరే పేరు సరిపోలుతుంది? అందుకే ‘ఉషాలక్ష్మీ ఫౌండేషన్’ స్థాపించా. ఇలాంటి పాపులేషన్ బేస్‌డ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా 2013లో సంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతోనూ, 2014-15లలో తెలంగాణ మహిళా సమతా సొసైటీ, అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా సమతా సొసైటీ సహకారంతో సుమారు 3,000 మంది ఆరోగ్య కార్యకర్తల సహకారంతో 4,000 గ్రామాల్లో సుమారు లక్షా యాభైవేలకు పైగా సౌకర్యాలంతగా లేని చోట్ల ఉండే మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించేందుకు శ్రీకారం చుట్టింది ఉషాలక్ష్మీ ఫౌండేషన్. ఇలా మన దేశంలోనే ప్రప్రథమంగా పర్పస్ బిల్ట్ ఫ్రీస్టాండింగ్ కాంప్రహెన్సివ్ రొమ్ము ఆరోగ్య కేంద్రం కిమ్స్‌లో నెలకొల్పాం.
నేను ఒక డాక్టర్ అయ్యాక, అమ్మ పేరిట ఫౌండేషన్ నెలకొల్పి ఈ సేవలన్నీ చేశాక... చిన్నప్పుడు చదువుకున్న ఆవు, పులీ కథ గుర్తొచ్చింది. బహుశా తన లేగదూడకు బ్రెస్ట్‌ఫీడింగ్ చేసినందుకే క్యాన్సర్‌లాంటి ఆ పులి ఆవుతల్లిని ఏమీ చేయలేకపోయిందేమో. ఆ తర్వాత ఇంకో ఆలోచనా వచ్చింది. రొమ్ముక్యాన్సర్ వచ్చిన ఆవు లాంటిదే మా అమ్మ. లేగదూడలాంటి నా దగ్గరికి వచ్చి తనను కబళించడానికి వచ్చిన పులి గురించి తెలిపింది మా అమ్మ. అంతే... మా అమ్మలాంటి ఎందరో అమ్మల్ని రక్షించడానికి నేను చదివిన చదువుకు సార్థకత కదా.
అందునా నా మాతృమూర్తిని కన్న మా మాతృదేశంలోని అమ్మలను రక్షించడానికి పనికి వస్తేనే... క్యాన్సర్ పులుల్ని ఎదుర్కోడానికి పనిచేస్తేనే... నేను చదువుకుంటున్న సమయంలో ఎప్పుడూ నా సమక్షంలో ఉండిన మా అమ్మకు గౌరవమిచ్చినట్లు కదా!!
అవును. ఇలా ఆలోచించాక... చిన్నప్పుడు నేను చదివిన ఆ కథకూ... ఇప్పుడు నాలుగు ప్రఖ్యాత రాయల్ కాలేజీలనుంచి పట్టా పొందిన రాయల్ సర్జన్‌గా చూస్తున్న దృష్టికీ ఎంత తేడా? ఇది అమ్మ జన్యువుల నుంచి వచ్చిన ఓ సుగుణం... విషయాలను మనదైన వైవిధ్యమైన దృష్టికోణం నుంచి చూడటం. దీనికి మించిన మరో సుగుణం... సేవాభావం. అందుకే ఆమె వల్లనే నాలోని సేవా‘లక్ష్మి’ ఓ ‘ఉష’స్సులా ఉదయించింది. థ్యాంక్యూ అమ్మా!
నిర్వహణ: యాసీన్
నా ప్రతిభాపాటవాలతో నేను సర్జన్ కావాలి తప్ప... మా నాన్న ఉన్నతస్థానం వల్ల కాకూడదన్నది నా పట్టుదల. నాలో ఇలాంటి స్వాభిమాన భావాలు పెంపొందేలా చేసింది మా అమ్మే. అందుకే ఈ ఏడాది నాకు వచ్చిన ‘పద్మ’ అవార్డు మా అమ్మకు... మా అమ్మలాంటి అమ్మలందరికీ అంకితం.
- డాక్టర్ రఘురామ్