క్యాన్సర్ ‘పులి’ని మ్యావ్‌మనిపించిన.. | ancer Disease operation success in rainbow hospital | Sakshi
Sakshi News home page

క్యాన్సర్ ‘పులి’ని మ్యావ్‌మనిపించిన..

Published Sun, Apr 19 2015 1:01 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

క్యాన్సర్ ‘పులి’ని మ్యావ్‌మనిపించిన.. - Sakshi

క్యాన్సర్ ‘పులి’ని మ్యావ్‌మనిపించిన..

 మా బంగారు ‘కొండ’!!
మెడికల్ మెమరీస్
తల్లి ఎత్తుకొని ఉన్న ఈ చిన్నారిని చూడండి. నాలుగేళ్ల ఈ బాబు పేరు పులికొండ రంగస్వామి. ఇంటిపేరు పులికొండ కదా... బహుశా ఆ స్ఫూర్తితోనేమో ‘పులి’ని చూసినట్టు భయపడే క్యాన్సర్ అనే ఓ జబ్బును తనకున్న కొండంత ధైర్యంతో ఎదుర్కొన్నాడు మన ఈ చిన్నారి. అంతేకాదు... పులి అని అందరూ అనుకునే ఆ జబ్బుతో యుద్ధం చేసి దాంతో మ్యావ్ మ్యావ్ అనిపించాడు. ఆ వైనం వినండి.

 
మన చిన్నారి పులిపాటి రంగస్వామి నిజంగానే పులికి సాటి. జబ్బు అనే  పులిస్వారీలో మేటి. క్యాన్సర్‌పై యుద్ధంలో అతడికి అతడే పోటీ. అందుకే ఈ విజయగాథ అందరూ చదవాలి. టీవీల్లో, సినిమాల్లో క్యాన్సర్ వస్తే ప్రాణాపాయం తప్పదనేది తప్పుడు మాట అని తెలుసుకోవాలి. ఆ స్ఫూర్తిని అందరికీ చాటాలి.తన తల్లిదండ్రులకు పుట్టిన నాలుగో కొడుకు రంగస్వామి. కానీ ఆ ఒక్కడే బతికి బట్టకట్టిన బిడ్డ. తొలిచూలు కొడుకు చిన్నతనంలోనే తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో చనిపోయాడు. రెండో కొడుకు కూడా ఇన్ఫెక్షన్‌తోనే మరణించాడు.

ఇక ముద్దులు మూటగట్టే మూడోబిడ్డ సరిగ్గా మూడేళ్లు బతికాడు. మెదడులో గడ్డ కావడంతో మూడో ఏట మృతిచెందాడు. ఇక మిగిలింది పులిపాటి రంగస్వామి. ఇతడికీ మూడో ఏట విపరీతమైన జ్వరమూ, దగ్గు రావడం మొదలైంది. నెలరోజులు మందులు వాడినా తగ్గలేదు. టౌనుకు తీసుకెళ్లినా లాభం లేదు. పైగా ముఖం చాలా తీవ్రంగా ఉబ్బిపోయింది.
 
కర్నూలు జిల్లాలోని పత్తికొండ అనే ఊరికి దగ్గర్లోని ఒక మారుమూల చిన్న పల్లెలో నివసించే ఆ తల్లిదండ్రులు... కనీసం ఈ చిన్నారినైనా బతికించుకుందామని హైదరాబాద్‌కు బయల్దేరారు. నేను చికిత్స చేసే ఆసుపత్రి (రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్)కి తీసుకొచ్చారు. ఆసుపత్రికి చేరుకునే సమయానికి అతడికి ఊపిరి అందడం లేదు. ఎక్స్‌రే తీసిచూస్తే ఊపిరితిత్తులకు గాలి తీసుకుపోయే పైపులను నొక్కుతూ ఏదో పెద్ద గడ్డ! ప్రథమ చికిత్సగా ఆక్సిజన్ ఇచ్చి, యాంటీబయాటిక్స్ మొదలుపెట్టాం. ఆ తర్వాత గడ్డ నుంచి ముక్క తీసి పరీక్షకు పంపాం. అనుకున్నట్లే అదో క్యాన్సర్ గడ్డ అని తేలింది. వైద్యపరిభాషలో చెప్పాలంటే ‘లింఫోబ్లాస్టిక్ లింఫోమా’ అంటూ పిలిచే ఒక చెడ్డ గడ్డ.
 
ఇక్కడ లింఫోమా అంటే ఏమిటో మామూలు వారికీ అర్థమయ్యేలా కాస్త చెప్పుకుందాం. మనకు రక్తనాళాలు ఉన్నట్లే... లింఫాటిక్ నాళాలూ ఉంటాయి. రక్తనాళాల్లో రక్తం ప్రవహించినట్టే... ఈ లింఫాటిక్ నాళాల్లో లింఫ్ అనే ద్రవం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ లింఫ్ నాళాలు కలిసేచోట ‘లింఫ్ నోడ్స్’ అనే కూడళ్లు ఉంటాయి. ఈ లింఫాటిక్ నాళాల్లో ప్రవహించే లింఫ్ ద్రవం... లింఫ్ గ్రంథుల్లో పుడుతుంది. ఈ ద్రవమే మనకు వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంటుంది. ఈ లింఫాటిక్ సిస్టమ్‌కు వచ్చే క్యాన్సర్‌నే లింఫోమా అంటారు. ఇందులోనూ రెండు ప్రధాన రకాలుంటాయి.

ఒకటి హాడ్జ్‌కిన్స్ లింఫోమా. రెండోది నాన్‌హాడ్జ్‌కిన్స్ లింఫోమా (ఎన్‌హెచ్‌ఎల్). ఈ నాన్‌హాడ్జ్‌కిన్స్ లింఫోమా(ఎన్‌హెచ్‌ఎల్)లోనూ మళ్లీ రెండు ప్రధాన రకాలుంటాయి. మొదటిది బీ-సెల్ ఎన్‌హెచ్‌ఎల్. ఇందులో కడుపు, పేగుల్లోని లింఫ్‌నోడ్స్ ప్రధానంగా ప్రభావితమవుతాయి. దీనితో పాటు తల, మెడలోని లింఫ్‌నోడ్స్‌కూడా ప్రభావితం కావచ్చు. ఇక రెండో రకం టీ-సెల్ ఎన్‌హెచ్‌ఎల్. ఇందులో ఛాతీలోని లింఫ్‌నోడ్స్ ప్రభావితమవుతాయి. రంగస్వామికి వచ్చింది లింఫోమాలోని టీ-సెల్ రకం. కాబట్టి ఛాతీలో వ్యాధి (గడ్డ) కనిపించింది.
 
ఇలాంటి క్యాన్సర్ గడ్డ వచ్చిన పిల్లలకు కీమోథెరపీ ఇస్తే 80 శాతం మందికి జబ్బు పూర్తిగా తగ్గుతుంది. ఆ పిల్లలు వ్యాధిని జయిస్తారు. ఇదే విషయాన్ని ఆ పిల్లాడి తల్లిదండ్రులకు చెప్పి చికిత్స మొదలుపెట్టాం. చికిత్సకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తుంటే వాటిని అరికట్టడానికి చేసే చికిత్సలూ చేశాం. ఈ అసలు చికిత్స, ఆ కొసరు చికిత్సలూ... వెరసి అన్ని రకాల వైద్యాలతో మా వంతు కృషి చేశాం. ఆ పిల్లాడు డాక్టర్లకు సహకరించాడు.

వ్యాధిని జయించే ప్రక్రియలో మాతో పాలుపంచుకున్నాడు. పులి తలపై చికిత్సాంకుశంతో వ్యాధిని అంకురం నుంచి తొలగించాడు.రండి... మీకు తెలిసినవాళ్లకూ ఈ కథ చెప్పండి. చిన్నపిల్లలకు వచ్చే క్యాన్సర్లను మొదటిదశలోనే గుర్తిస్తే అవి దాదాపుగా అన్నీ తగ్గుతాయనే సందేశాన్ని విస్తృతం చేయండి. విశ్వవ్యాప్తం చేయండి. అదే ఒక చిన్నపిల్లల క్యాన్సర్ డాక్టర్‌గా నేను చెప్పే తేనెలూరే ఊట లాంటి మాట. తియ్యనైన ఓ మంచిమాట.
నిర్వహణ: యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement