ఆ చిన్నారులు మాట్లాడిన అపురూప వేళలో...
మెడికల్ మెమరీస్: ‘‘ఈ కథ ఒక తల్లి సంకల్పాన్ని తెలియ చెబుతుంది. ఒక తండ్రి పిరికితనానికి, బాధ్యత నుంచి దూరంగా పారిపోయే మనస్తత్వానికీ అద్దం పడుతుంది. ఒక భర్తగా ‘నాతిచరామి’ అంటూ తోడుగా నిలవాల్సిన వ్యక్తి... బాధ్యతలకు భయపడి పారిపోయిన నాడు ఒక మహిళ మనోబలం ఎలా పెరుగుతుందో తెలిపి, ఎందరో మహిళలకు స్ఫూర్తినిస్తుందని నా నమ్మకం’’ అంటూ వివరిస్తున్నారు అపోలో ఆసుపత్రుల ఈఎన్‌టీ విభాగాధిపతి, సాహీ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఇ.సి. వినయకుమార్. ఆయన చెప్పిన వాస్తవగాథ ఇది.
అది 2007 సంవత్సరం. అప్పుడే మేము సాహీ (సొసైటీ టు ఎయిడ్ ద హియరింగ్ ఇంపెయిర్‌డ్) సేవా సంస్థను స్థాపించి, పుట్టుక నుంచే వినికిడి సమస్యలతో బాధపడే చిన్నారులకోసం ‘గిఫ్ట్ యాన్ ఇయర్ ప్రాజెక్ట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆర్థిక స్థోమత అంతంతే ఉన్న కుటుంబాల్లోని చిన్నారులకు వినికిడి శక్తిని ప్రసాదించే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను మాకు చేతనైనంతగా చేస్తూ... చిన్నారులకు వినికిడి సామర్థ్యంతో పాటు మాట్లాడే శక్తిని ఇస్తున్నాం. ఆ సమయంలో ఒక తల్లి తన ఇద్దరు కవల పిల్లలు, మరో చిన్నారితో నన్ను కలిసింది. ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లల తల్లి సంతోషంగా ఉండాల్సిందిపోయి... అంత వేదన పడుతూ నా దగ్గరికి వచ్చిన కారణం నన్ను కదిలించింది.
ఆ తల్లిదండ్రులది తూర్పుగోదావరి జిల్లా. తొలిచూలులో కవలలు పుట్టారు. ఇద్దరూ ముద్దులొలికే ఆడపిల్లలు. అందుకు దంపతులిద్దరూ చాలా సంతోషించారు. కానీ ఎదుగుతున్న ఆ పిల్లలు తల్లిదండ్రుల మాటలకు స్పందించడం లేదు. అందరిలా మాట్లాడటం లేదు. దగ్గర్లోని వైద్యులను సంప్రదిస్తే తెలిసిన విషయం వాళ్లను శరాఘాతంలా బాధించింది. ఆ పిల్లలిద్దరికీ వినికిడి శక్తి లేదు. అందుకే మాట్లాడలేరు. ఇంతలో వాళ్లకు మరో పాప పుట్టింది. పరీక్ష చేయిస్తే ఆ పాపకూ శాశ్వత వినికిడి లోపం ఉందని తెలిసింది. ఆ చేదువార్తలను తట్టుకోలేక ఆ తండ్రి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఆ ప్రయత్నం విఫలమవడంతో చిన్నారుల బాధ్యత స్వీకరించడానికి భయపడి కుటుంబం నుంచి దూరంగా వెళ్లిపోయాడు.
అసలే జీవనాధారం లేదు. పైగా భర్త వదిలేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని ఈ స్థితిలో ఏం చేయాలో పాలుపోలేదా తల్లికి. కొంతమందిని కలిస్తే మా సంస్థ అందించే సేవల గురించి తెలిసిందట. దాంతో హైదరాబాద్‌కు వచ్చి నన్ను కలిసిందా తల్లి. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డిగారిని కలిసి, కాక్లియర్ ఇంప్లాంట్స్‌కు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ కాబట్టి, దాన్ని ‘ఆరోగ్యశ్రీ’లో చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న సమయమది. కాకతాళీయంగా అదృష్టవశాత్తు అదే సమయంలో మా ప్రయత్నాలు ఫలించాయి. ప్రభుత్వం కాక్లియర్ ఇంప్లాంట్స్ అమర్చే శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చింది. దాంతో మా ప్రయత్నం మరింత సులభం అయ్యింది. ఆ ఇద్దరు కవలలతో పాటు మూడో చిన్నారికి కూడా ఉచితంగా శస్త్రచికిత్సలు చేశాం. శస్త్రచికిత్స పూర్తయ్యాక వినికిడి శక్తి వచ్చింది. కానీ మన మాటలు అర్థం చేసుకుని వాళ్లూ మాట్లాడగలగాలి కదా! అందుకు అవసరమైన ‘ఆడిటరీ వర్బల్ థెరపీ’ కోసం దాదాపు ఆ తల్లీపిల్లలు ఇక్కడే (హైదరాబాద్‌లో) ఆసుపత్రికి దగ్గర్లోనే ఉండిపోయారు. ఈ థెరపీలో భాగంగా ఆ పిల్లలకు మాట్లాడటం నేర్పించే ప్రక్రియను మొదలుపెట్టాం.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే... తొలిచూలులో పుట్టిన కవల పిల్లలిద్దరికీ వినికిడి లోపంతో పాటు ‘మెల్లకన్ను’ కూడా ఉంది. దాంతో చూపునకు సంబంధించిన మరికొన్ని లోపాలూ ఉన్నాయి. నా చిన్న కూతురైన డాక్టర్ రచనా వినయకుమార్ చిన్నపిల్లల కంటివైద్యనిపుణురాలు కావడం వల్ల ఆ కవలల మెల్లకన్ను లోపాన్ని శస్త్రచికిత్స ద్వారా చక్కదిద్దింది. ఈ ఆపరేషన్‌ను కూడా నా కూతురు ఉచితంగా చేసింది. ఓ తల్లీకూతుళ్ల వెతలు తీర్చడమనే క్రతువులో మా తండ్రీకూతుళ్లమిద్దరం భాగస్వాములం కావడం మాకెంతో ఆనందాన్నిచ్చింది. అంతేకాదు... ఆ ముగ్గురు బిడ్డలూ ముద్దుముద్దు పలుకులు పలుకుతుంటే ఆ తల్లి ముఖాన కనిపించిన సంతోషం మా కళ్లు చెమర్చేలా చేసింది. వైద్యవృత్తిలో ఉన్నందుకు, సమాజానికి ఇలా తోడ్పడేందుకు దేవుడు మాకిచ్చిన అవకాశమిది అని మాకనిపించింది.
- నిర్వహణ: యాసీన్