చికిత్స చేసేదెవరూ... బతుకు చిగురింపజేసేదెవరు? | every day heart treatment at hospital | Sakshi
Sakshi News home page

చికిత్స చేసేదెవరూ... బతుకు చిగురింపజేసేదెవరు?

Published Sun, May 3 2015 1:01 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

చికిత్స చేసేదెవరూ... బతుకు చిగురింపజేసేదెవరు? - Sakshi

చికిత్స చేసేదెవరూ... బతుకు చిగురింపజేసేదెవరు?

మెడికల్ మెమరీస్
ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ‘ఆత్మీయతతో గుండె వైద్యం’ అనే నా నినాదాన్ని నిజం చేసే ప్రయత్నం మొదలుపెట్టాను. మందులకన్నా మమతలు మిన్న అని గట్టిగా నమ్ముతాను నేను. ఆ రోజు సన్యాసిరావుగారనే ఒకాయన గుండె పరీక్షల కోసం వచ్చారు. ఆయనను క్లినిక్ లోపలే ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్‌లకు పంపించాను. మరో ఇద్దరు, ముగ్గురు పేషెంట్లను చూసిన తర్వాత సుచిత్ర అనే పేషెంట్ వచ్చారు. ఆమె చాలా రోజుల నుంచి నా దగ్గరికి ఫాలోఅప్‌కు వస్తున్నారు. పేషెంట్లకు అభిమాన డాక్టర్లు ఉన్నట్లే డాక్టర్లకూ అభిమాన పేషెంట్లుంటారు.

బలహీనంగా కనిపిస్తూ, మృదువుగా మాట్లాడే సుచిత్ర గుండె కూడా బలహీనమైనదే. అయితే ఆరోజు తన గుండెలో ఏదో బాధగా ఉందని సుచిత్ర వచ్చింది. సరిగ్గా ఆమె విషయం చెబుతుండగానే క్లినిక్ లోపలి నుంచి ఒక పెద్ద అరుపు వినిపించింది. ‘‘డాక్టర్....! మన పేషెంట్ సన్యాసిరావు కొలాప్స్ అయ్యారు’’ అంటూ మా టెక్నిషియన్ అరిచాడు. ట్రెడ్మిల్ చివరిదశలో ఉండగా విపరీతమైన ఛాతీనొప్పి వచ్చి ట్రెడ్మిల్ మీదే కుప్పకూలారు. క్లినిక్‌లో నిర్వహించిన అనేక వేల పరీక్షలలో మొదటిసారిగా ఈ కాంప్లికేషన్! నా ముందున్న సుచిత్రగారిని అలాగే వదిలేసి లోపలకు పరిగెత్తాను.

తీవ్రమైన గుండెపోటుతో దాదాపు అపస్మారక స్థితిలో ఉన్న సన్యాసిరావుగారిని చూస్తూనే అనేక పనులకు మా అసిస్టెంట్లను పురమాయించాను. ఒకరు కారు రెడీగా ఉంచారు. మరొకరు నరానికి సూదిని అమర్చి, మందు ఎక్కించారు. ఇంకొకరు హాస్పిటల్‌కు ఫోన్ చేసి క్యాథ్‌లాబ్ రెడీ చేయమని చెప్పారు. హాస్పిటల్‌కు చేరాక మూడుగంటల పాటు మృత్యువుతో ఎడతెగని పోరాటం! వెంటిలేటర్, పేస్‌మేకర్, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్, లెక్కలేనన్ని ఇంజెక్షన్స్!! ఎంతో ఒత్తిడి. ఎంతో పరిశ్రమ. ఎన్నో నిద్రలేని రాత్రులు. ప్రశాంతత కరవైన రోజులు.

ఇంట్లోని వారందరికీ శిక్ష. వారి సహనానికి పరీక్ష!  మృత్యువు ఒడిలోంచి ఒక పేషెంట్‌ను బయటకు తీసుకువచ్చి, అతడి జీవితకాలాన్ని పొడిగించే ప్రయత్నంలో... ఒక డాక్టర్ తన జీవితకాలాన్ని చాలా తగ్గించుకోవాల్సి వస్తుందేమో! అయినా అది సంతోషమే. ఒత్తిడితో మేము త్యాగం చేసే క్షణాలన్నీ... ఏళ్లుగా మారి రోగి ఆయుష్షును పొడిగిస్తుంటే అంతకంటే ఓ డాక్టర్‌కి కావాల్సిందేముంది. మరో మూడురోజులు సన్యాసిరావు కొన ఊపిరితోనే ఉన్నారు. చివరికి ఆరో రోజున సన్‌షైన్ మాదాపూర్ విభాగం నుంచి డిశ్చార్జ్ చేశాను. ఆయన ఇంటికి వెళ్లే ముందు నా చేతులు పట్టుకుని ‘స్టెంట్ అంటూ వేయించుకుంటే మీ చేతే వేయించుకుందామనుకున్నాను డాక్టర్. మీరే నా ప్రాణదాత’ అన్నారు. అప్పుడే పుట్టిన నా బిడ్డను తొలిసారి చూసిన అనుభూతి కలిగింది నాకు. అది చాలు ఈ జన్మకి.
 
ఆ తర్వాత మళ్లీ మామూలే. మళ్లీ క్లినిక్, హాస్పిటల్. ఆ రోజు ఎమర్జెన్సీ వల్ల చూడకుండా పంపించేసిన చాలామంది పేషెంట్లు ‘‘సర్... సన్యాసిరావుగారికి ఎలా ఉంది’’ అని అడిగారు. ‘‘బాగున్నారు’’ అని జవాబిచ్చా. ‘‘నేనే బతికించాను సుమా’’ అన్న కాస్త ధీషణతో కూడిన గర్వం బహుశా అంతర్లీనంగా ఆ జవాబులో ఉందేమో!  మా రిసెప్షనిస్ట్ మణిబాబు ఘంటసాల వారి భగవద్గీతను రింగ్‌టోన్‌గా వాడతాడు. ‘‘కర్మణ్యేవాధి కారస్థే మా ఫలేషు కదాచనా’’ అని వినపడుతుంటే కొంచెం చిరాకుపడ్డాను మనసులో. ‘‘మీ హస్తవాసి మంచిది’’ అని సన్యాసిరావు అన్న మాట బహుశా నిజమేనేమో! భగవంతుడు రాసిన విధిరాతను కూడా కాస్త మార్చగలిగే రాత మన చేతిలో ఉందేమోనన్న అని విద్వదహంకారంతో కూడిన కించిత్ అనుమానహంకారం... నా మనసులోనే ఏ మూలనో.
 
పదిహేను రోజుల తర్వాత నా ఫేవరెట్ పేషెంట్ సుచిత్రగారి అమ్మాయి వాళ్ల అత్తగారిని తీసుకొని నా క్లినిక్‌కి వచ్చింది. చూపించుకుని వెళ్లేముందు అడిగింది ‘‘ఆరోజు కొలాప్స్ అయిన సన్యాసిరావు ఎలా ఉన్నారు’’ అని. ‘‘చాలా బాగున్నారమ్మా. సేవ్ అయినట్లే’’ అన్నాను. ఇంతలో అకస్మాత్తుగా గుర్తొచ్చింది. ‘‘అవునూ... సుచిత్రగారేరీ?’’ అంటూ ఆ అమ్మాయిని అడిగా. తలదించుకొని మెల్లగా జవాబు చెప్పిందావిడ. ‘‘ఆరోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఛాతీలో భారంగా ఉందన్నారు మా అమ్మ. మీరు చూస్తూ చూస్తూ మధ్యలో వెళ్లిపోయారు.

ఆమె ఇంకే డాక్టర్‌కూ చూపించుకోదు. మొండితనం. మీరంటే అభిమానం. ఆ రోజు రాత్రే... ’’ అంటూ వాక్యం ముంగిచకుండానే బతుకు ముగించిన తీరును నాకు వివరించింది. ఆమె కళ్లనుంచి జారిపడ్డ నీటిబొట్టును చూస్తే నా చెంప చెళ్లుమన్నట్లయ్యింది. సుచిత్రగారు అదే రోజు మరణించారట. నిస్త్రాణతతో అలాగే కూర్చుండిపోయాను నేను. ‘‘కర్మణ్యేవాధి కారస్థే...’’ మా మణిబాబు ఫోన్ మోగుతూనే ఉంది.
నిర్వహణ: యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement