హోమియో కౌన్సెలింగ్
డయాబెటిస్ వ్యాధి హోమియో విధానంలో తగ్గుతుందా?
- రవిచంద్ర, చీరాల
డయాబెటిస్ రక్తంలో చక్కెరపాళ్లు అధికం కావడం వల్ల వచ్చే వ్యాధి. ఇందులో మూత్రం ఎక్కువగా రావడం, ఆకలి, దాహం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇందులోని కొన్ని ముఖ్యమైన రకాలుంటాయి. శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడాన్ని టైప్-1 అనీ, ఉత్పత్తి చేసిన ఇన్సులిన్‌ను కణాలు సక్రమంగా వినియోగించలేకపోవడాన్ని టైప్-2 అనీ, గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటిస్‌ను జెస్టెషనల్ డయాబెటిస్ అని అంటారు.
టైప్-1 డయాబెటిస్: ఈ రకం వ్యాధి ఉన్న వారిలో క్లోమగ్రంథిలో ఉండే బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల శరీరంలో చక్కెరపాళ్లు పెరుగుతూ ఉంటాయి. వీళ్లలో రోగనిరోధక వ్యవస్థను రక్షించే టీ-సెల్స్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. కానీ పుట్టినప్పుడు వాళ్లు నార్మల్‌గానే ఉండవచ్చు. రానురానూ గ్లూకోజ్ పాళ్లు పెరగడంతో పిల్లలు బలహీనపడతారు. దీన్నే ‘జువెనైల్ డయాబెటిస్’ అని కూడా అంటారు.
టైప్-2 డయాబెటిస్: ఇది ఎక్కువగా నడివయసు వారిలో కనిపిస్తుంటుంది. తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి ఉన్నప్పుడు పిల్లల్లోనూ ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగినప్పుడు రక్తంలో చక్కెరపాళ్లు అధికమై బయటపడవచ్చు.
జెస్టెషనల్ డయాబెటిస్: గర్భధారణ సమయంలో వచ్చిన డయాబెటిస్ చాలామందిలో ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. అయితే అది మళ్లీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
డయాబెటిస్‌తో వచ్చే దుష్ర్పభావాలు చాలా ఎక్కువే. దీనివల్ల రక్తనాళాలు దెబ్బతినడం, గుండె సంబంధిత వ్యాధులు రావడం, కంటిలోని సున్నితమైన రక్తనాళాలు దెబ్బతిని (డయాబెటిస్ రెటినోపతి), చూపు కోల్పోవడం కూడా జరగవచ్చు. కిడ్నీలపై (డయాబెటిస్ నెఫ్రోపతి) దుష్ర్పభావం పడటం, నరాలు దెబ్బతినడం వల్ల వేళ్ల చివర్లకు చీమలు పాకినట్లు ఉండటం, స్పర్శ తగ్గడం, అరికాళ్ల నొప్పుల వంటి సమస్యలు రావచ్చు.
హోమియోలో డయాబెటిస్‌కు మంచి మందులు ఉన్నాయి. తీపిని ఇష్టపడేవారు, ఆధ్యాత్మికత ఉన్నవారికి సల్ఫర్, స్థూలకాయం ఉండి, త్వరగా కన్నీళ్లు వచ్చేవారికి కాల్కేరియా కార్బ్, తేలిగ్గా ఉద్వేగాలకు గురై, త్వరగా కోపం వచ్చేవారు, ఘాటైన మసాలా ఆహారాలను ఇష్టపడేవారికి నక్స్ వామికా వంటి ఎన్నో మంచి మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి.
- డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్,పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
న్యూరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 36 ఏళ్లు. నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఉద్యోగరీత్యా ఒత్తిళ్ల వల్ల తలనొప్పి వస్తోందని అనుకున్నాను. ఇటీవల మరిన్నిసార్లు రావడంతో డాక్టర్‌ను కలిశాను. ఆయన మైగ్రేన్‌గా గుర్తించారు. దయచేసి నాకు తగిన పరిష్కారం చూపించండి.
- సుహాస్, హైదరాబాద్
అనేక రకాల తలనొప్పుల్లో మైగ్రేన్ ఒకటి. ఇది 15 శాతం మంది యువతుల్లో, 6 శాతం మంది యువకుల్లో కనిపిస్తుంది. కొందరిలో ఇది తలకు ఒకవైపునే కనిపిస్తే, మరికొందరిలో తల మొత్తంలో నొప్పి వస్తుంటుంది. కడుపులో తిప్పడం, వాంతి కావడం, శబ్దాలను - కాంతిని భరించలేకపోవడం వంటి లక్షణాలు ఈ తలనొప్పుల్లో కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మైగ్రేన్ జన్యుపరంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి.
మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశాలు చాలా ఉంటాయి. వాటిని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. అవి... నిద్ర సరిగా లేకపోవడం, ఎండలో తిరగడం, చాక్లెట్లు, ఐస్‌క్రీములు ఎక్కువగా తీసుకోవడం వంటివి నొప్పిని తక్షణం మొదలయ్యేలా చేసే ట్రిగరింగ్ ఫ్యాక్టర్లలో కొన్ని. మనలో ఏ అంశం నొప్పిని ప్రేరేపిస్తోందో కనుగొంటే... చాలావరకు మైగ్రేన్‌ను నివారించవచ్చు. దాంతోపాటు సరైన పోషకాహారం తీసుకోవడం, మంచి ఆహార అలవాట్లు పాటించండం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వంటివి మైగ్రేన్‌ను నివారించే కొన్ని అంశాలు.
మైగ్రేన్ చికిత్సలో రెండు రకాల మందులు ఉపయోగిస్తారు. మొదటివి... తలనొప్పి వచ్చినప్పుడు తక్షణం నొప్పి నుంచి ఉపశమనం కలిగించే మందులు. వీటిని నోటి ద్వారా ఇస్తారు. ఒకవేళ రోగికి వాంతులు అవుతుంటే ముక్కు ద్వారాగానీ లేదా ఇంజెక్షన్ ద్వారా గానీ ఈ తరహా మందులు ఇవ్వవచ్చు. ఇక రెండో రకమైనవి... మున్ముందు నొప్పి రాకుండా ఉండటం కోసం దీర్ఘకాలం వాడాల్సిన మందులు. మీరు డాక్టర్‌ను సంప్రదించి మైగ్రేన్ పునరావృతం కాకుండా కోసం వాడాల్సిన దీర్ఘకాలిక మందులను వాడితే ఇది తిరగబెట్టే అవకాశాలు తక్కువ.
డాక్టర్ నీలేశ్ విజయ్ చౌధురీ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.
లైఫ్‌స్టయిల్ కౌన్సెలింగ్
నేను కూర్చొని చేసే వృత్తిలో ఉన్నాను. రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదు. ఒళ్లు అలిసేలా వ్యాయామం చేయమనీ, దాంతో బాగా నిద్రపడుతుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. వ్యాయామం చేసేవాళ్లకు అంతగా నిద్రపట్టదని మరికొందరు చెబుతున్నారు. నాకు వాస్తవాలు వివరించండి.
- ధన్‌రాజ్, నకిరేకల్
మీరు చెప్పిన రెండు అంశాలూ నిజమే. నిద్రకు ఉపక్రమించబోయే మూడు గంటల ముందుగా వ్యాయామం అంత సరికాదు. అలా చేస్తే నిద్రపట్టడం కష్టమే. అయితే రోజూ ఉదయంగానీ లేదా ఎక్సర్‌సైజ్‌కూ, నిద్రకూ చాలా వ్యవధి ఉండేలా గానీ వ్యాయామం చేస్తే మంచి నిద్ర పడుతుంది. ఒళ్లు అలిసేలా వ్యాయామంతో ఒళ్లెరగని నిద్రపడుతుంది. ఉదయం చేసే వ్యాయామంతో ఒత్తిడి నుంచి దూరమవుతారు. అయితే ఉదయం వేళ చేసే వ్యాయామం పగటి వెలుగులో అయితే మరింత ప్రభావపూర్వకంగా ఉంటుంది.
మీరు ఉదయం వేళలో వ్యాయామం చేయలేకపోతే అది సాయంత్రం వేళ అయితే మంచిది. మీ రోజువారీ పనుల వల్ల అప్పటికి మీ శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త పెరిగి ఉంటుంది. ఇక నిద్రవేళకు మన శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంటంది. కానీ వ్యాయామంతో మళ్లీ శరీరాన్ని ఉత్తేజపరచడం జరుగుతుంది. ఇక కార్డియోవాస్క్యులార్ వ్యాయామాల వల్ల గుండె స్పందనల వేగం, రేటు పెరుగుతాయి.
శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. వీటన్నింటి ఉమ్మడి ప్రభావాల వల్ల నిద్ర తగ్గుతుంది. అంతేకాదు... వ్యాయామం ముగిసిన 20 నిమిషాల తర్వాతగానీ గుండె కండరాల రక్తం పంపింగ్ ప్రక్రియ సాధారణ స్థితికి రాదు. అందుకే వ్యాయామానికీ, నిద్రకూ మధ్య వ్యవధి ఉండేలా చూసుకోవాలన్న మాట. ఇక స్ట్రెచింగ్ వ్యాయామాలు, బలాన్ని పెంచుకనే స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ తరహా వ్యాయామాలూ శరీరానికి మేలు చేసినా... అవేవీ కార్డియోవాస్క్యులార్ వ్యాయామాలకు సాటిరావు.
యోగా ప్రధానంగా తనువునూ, మనసునూ రిలాక్స్ చేసే ప్రక్రియ. మీ ఫ్రెండ్స్‌లో కొందరు చెప్పినట్లుగా దీర్ఘకాలిక నిద్రలేమికి వ్యాయామం విరుగుడు. అందుకే మరీ తీవ్రంగా (విగరస్‌గా) కాకుండా... మరీ చేసీచెయ్యనట్లు (మైల్డ్)గా కాకుండా... మాడరేట్ ఎక్సర్‌సైజ్ చేయండి. కంటినిండా నిద్రపోండి. వాకింగ్, జాగింగ్, జంపింగ్, స్విమ్మింగ్, టెన్నిస్ ఆడటం, డాన్స్ చేయడం లాంటి ఏ ప్రక్రియ అయినా వ్యాయామానికి మంచిదే. అయితే మీకు గుండెజబ్బులూ, స్థూలకాయం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే వ్యాయామాలు మొదలుపెట్టే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, మీకు తగిన వ్యాయామాలు సూచించమని అడగడం మేలు.
డాక్టర్ సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com
నిర్వహణ: యాసీన్
ఒంటికి పని చెప్తే కంటి నిండా నిద్ర!
Published Wed, Dec 9 2015 11:58 PM | Last Updated on Sat, Oct 20 2018 7:38 PM
Advertisement