అది పక్షవాతం కాదు... బెల్స్‌పాల్సీ | paralysis is not it ... Bells palsi | Sakshi
Sakshi News home page

అది పక్షవాతం కాదు... బెల్స్‌పాల్సీ

Published Tue, Mar 22 2016 1:58 AM | Last Updated on Sat, Oct 20 2018 7:38 PM

అది పక్షవాతం కాదు... బెల్స్‌పాల్సీ - Sakshi

అది పక్షవాతం కాదు... బెల్స్‌పాల్సీ

 న్యూరాలజీ కౌన్సెలింగ్
 నా వయసు 50 ఏళ్లు. నాకు ఉన్నట్టుండి మూడు రోజులుగా కుడివైపు మూతి వంకరపోతోంది. కనురెప్ప మూసుకుపోవడం లేదు. ఇది పక్షవాత లక్షణమా?  - నిరంజనరావు, కర్నూలు

మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘బెల్స్ పాల్సీ’ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖానికి వెళ్లే ఒక నరం దెబ్బతినడం వల్ల, వైరల్ జ్వరాల కారణంగా కూడా ఇది రావచ్చు. అయితే ఇది పక్షవాతం అనే అపోహ ఉంది. అది నిజం కాదు. కొన్ని రకాల మందులతో దీన్ని తగ్గించవచ్చు. ముఖానికి ఫిజియోథెరపీ చేయడంతోనూ, ఫేషియల్ స్టిమ్యులేషన్‌తోనూ ఇది తగ్గే అవకాశం ఉంది.  ఈ జబ్బు వచ్చిన 80 శాతం మందిలో రెండు నెలల్లోనే నయమవుతుంది. కొంతమందిలో ఇది రెండోవైపు కూడా వచ్చి చేతులు, కాళ్లు కూడా చచ్చుబడ్డట్టు ఉండవచ్చు. అలా జరిగితే ఆసుపత్రిలో అడ్మిట్ అయి వైద్యం చేయించుకోవాలి. ఆందోళనపడనక్కరలేదు.  డాక్టరును సంప్రదించి సరైన మందులు, ఫిజియోథెరపీ తీసుకోండి. బెల్స్ పాల్సీ తప్పక నయమవుతుంది.
 
మా అబ్బాయి వయసు 15 ఏళ్లు. ఏడాది నుంచి చాలా నీరసంగా కనిపిస్తున్నాడు. ఏ పని చేయాలన్నా చాలా సమయం తీసుకుంటున్నాడు. ఒక్కోసారి చేతులు, మెడ వంకర్లు పోతున్నాయి. తగిన సలహా ఇవ్వండి. - ఆనందరావు, నూజివీడు

 ఈ వయసులో ఉన్న పిల్లల్లో ‘విల్సన్ డిసీజ్’ అనే జబ్బు రావచ్చు. ఈ జబ్బు వచ్చిన వారిలో చేతులు, కాళ్లు వంకర్లు పోవడం, మాట స్పష్టంగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నీళ్లు కూడా మింగలేకపోవడం జరగవచ్చు. ఈ జబ్బును ‘స్లిట్ లాంప్’ పరీక్ష, కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై స్కానింగ్ పరీక్షలతో నిర్ధారణ చేయవచ్చు.  మన శరీరంలో ‘కాపర్’ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఈ జబ్బు వస్తుంది. దీన్ని కొన్ని మందులతో తగ్గించవచ్చు. చేతులు కాళ్లు వంకరలు తగ్గడానికి కూడా మందులు ఉంటాయి. అయితే కొన్ని నెలలు మొదలుకొని, కొన్నేళ్ల వరకు వాడాల్సి రావచ్చు. ఇది జన్యుపరమైన జబ్బు కాబట్టి ఒకే కుటుంబంలోని చాలా మంది పిల్లల్లోనూ వచ్చే అవకాశం ఉంది. దీన్ని నివారించాలంటే దగ్గరి సంబంధాల్లో పెళ్లిళ్లు చేసుకోకపోవడమే మంచిది.
 
 డర్మటాలజీ కౌన్సెలింగ్
ఎండలోకి వెళ్లినప్పుడల్లా నా ముఖం, మెడ భాగాలు ఎర్రగా మారుతున్నాయి. ఈ ఎర్రమచ్చల్లో దురదగా ఉంటోంది. గత పది రోజుల నుంచి ఈ పరిణామాన్ని గమనిస్తున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి.  - వనజ, గుంటూరు

 మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు సన్‌బర్న్స్ వస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది ‘ఫొటోసెన్సిటివిటీ’ ఉన్నవారిలో ఈ వేసవిలో ఇది చాలా సాధారణ సమస్య. దీనికోసం ఈ కింది సూచనలు పాటించండి.
ఆ ఎర్రమచ్చల మీద ‘డెసోనైడ్’ అనే మైల్డ్ స్టెరాయిడ్ ఉన్న క్రీము ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రాసుకుంటూ పదిరోజుల పాటు వాడండి.
  ఎండలో బయటకు వెళ్లే ముందు 50 ప్లస్ ఎస్‌పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ రాయండి. ప్రతిరోజూ ఉదయం రాసుకొని బయటకు వెళ్లడంతో పాటు ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్ క్రీమ్ రాసుకుంటూ ఉండాలి.
  ప్రతిరోజూ యాంటీ ఆక్సిడెంట్స్ ట్యాబ్లెట్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తీసుకోండి. ఇవి కనీసం మూడు నెలల పాటు వాడండి.
  మంచి రంగు ఉండే తాజా పండ్లు ఎక్కువగా తినండి. అలాగే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు ఎక్కువగా వాడాలి.
అలాగే క్యారట్, క్యాప్సిక ం (పసుపు పచ్చరంగులో ఉండేవి) ఎక్కువగా తీసుకోవాలి.
పైన పేర్కొన్న జాగ్రత్తలతో పాటు రోజూ కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల మన ప్రతి కణం పునరుత్తేజం పొందుతుంది. పై సూచనలు పాటించాక కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఒకసారి డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
హోమియో కౌన్సెలింగ్
 నా వయసు 45 సంవత్సరాలు. కొంతకాలంగా మూత్రంలో మంట, అప్పుడప్పుడు చీము, రక్తం పడటం, నడుంనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్‌ని సంప్రదిస్తే కిడ్నీలు ఇన్ఫెక్షన్‌కి గురైనాయని చెప్పారు. మందులు వాడుతున్నా, సమస్య పూర్తిగా తగ్గడం లేదు. హోమిమో చికిత్స ద్వారా నా సమస్యకి పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - అపర్ణ, విజయవాడ

మన శరీరంలో మూత్రపిండాలది అత్యంత కీలకమైన పాత్ర. అవి నిరంతరం రక్తాన్ని వడపోసి, శరీరంలోని మలినాలను, అధిక నీటిశాతాన్ని మూత్రం ద్వారా బయటకు పంపించడమే కాకుండా శరీరానికి అవసరమయ్యే లవణాల సమతుల్యతనూ కాపాడతాయి. అలాగే రక్త పీడనాన్ని కూడా నియంత్రిస్తుంటాయి. నేటి ఆధునిక జీవనశైలి వలన ఎక్కువ మంది తరచు మూత్రపిండాల ఇన్ఫెక్షన్లకు గురౌతున్నారు. మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం అన్నీ వస్తాయి. సాధారణంగా రక్తప్రవాహం ద్వారా కానీ, మూత్రకోశ ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. కారణాలు:మూత్ర వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కలగడానికి 80 శాతం వరకు బ్యాక్టీరియా, 15 శాతం వరకు వైరస్‌లు మరికొంత శాతం ఫంగల్, కొన్ని పరాన్నజీవులు కారణం. మూత్రం ఎక్కువ సమయం విసర్జించకుండా ఉన్న సమయంలో బ్యాక్టీరియా అధికంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

మూత్ర వ్యవస్థలో రాళ్లు మూత్రవిసర్జనకు అడ్డుగా నిలిచి ఈ సమస్య ఉత్పన్నం అవడానికి తోడ్పడతాయి. పురుషుల్లో పోలిస్తే స్త్రీలలో మూత్రకోశం ఇన్ఫెక్షన్లను ఎక్కువగా గమనించవచ్చు. ముఖ్యంగా రజస్వల అయ్యే సమయంలోనూ, ప్రసూతి సమయంలో కూడా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం వీరిలో ఎక్కువగా ఉంటుంది. కృత్రిమ మూత్ర గొట్టాలు(క్యాథెటర్స్), స్టెంట్స్, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, హార్మోన్ల అసమతుల్యత, మలబద్దకం వలన కూడా మూత్ర మార్గం ఇన్ఫెక్షన్లు క లుగుతాయి.

లక్షణాలు: మూత్రపిండాల ఇన్ఫెక్షన్ల వలన రోగికి తరచు జ్వరం, కడుపు నొప్పి వస్తుంటాయి. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు కడుపునొప్పి నడుముకు లేదా గజ్జలలోకి, అటుపైన తొడల వరకు కూడా పాకుతుంది. కొన్ని సందర్భాల్లో మూత్రంలో చీము, రక్తం కూడా పడటం గమనించవచ్చు. ఆకలి లేకపోవడం, ఒళ్ళు నొప్పులు, నీరసంతో పాటు మూత్రంలో చీము, రక్తం పడటం వంటి ఇతర మూత్రకోశ సమస్యలూ ఉంటాయి.

జాగ్రత్తలు: వ్యక్తిగత శుభ్రత పాటించ డం, ఎక్కువ నీరు తాగటం, మూత్రాన్ని నియంత్రించకుండా ఉండటం, కృత్రిమ గర్భనిరోధక సాధనాలు వాడేటప్పుడు జాగ్రత్త వహించడం, మలబద్దకం ఏర్పడకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి కలగకుండా నియంత్రించుకోవచ్చు.

హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌లో జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా రోగనిరోధక శక్తిని ప్రేరేపించడం వల్ల ఇన్ఫెక్షన్ తాలూకు సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించబడతాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement