Diabetes disease
-
శాకాహారంతో మధుమేహం ముప్పు తగ్గుతుందా?
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే సమస్య. ఇప్పటివరకు దీనికి శాశ్వత పరిష్కారం లేకపోయినా సరైన డైట్‌తో మధుమేహాన్ని నివారించవచ్చు అని ఓ అధ్యయనంలో తేలింది. మొక్కల ఆధారిత ఆహారాన్ని(plant-based diet) తీసుకోవడం వల్ల మధుమేహం ముప్పు 24% వరకు తగ్గుతుందని మెడ్‌యునీ వియెన్సాస్ సెంటర్ జరిపిన రీసెర్చ్‌లో వెల్లడైంది. దీని ప్రకారం..పండ్లు, కాయకూరలు, గింజలు, పప్పుదినుసులు, విత్తనాలు వంటి శాకాహారంతో మధుమేహాన్ని నివారించడంతో పాటు ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారికి మేలైన చికిత్సగా పనిచేస్తుందని గతంలోనూ ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. తాజాగా మరోసారి ఇది రుజువైంది. శాకాహారం తినడం వల్ల కాలేయం, కిడ్నీ పనితీరు మెరుగవడంతో పాటు, డయాబెటిస్ ముప్పు తగ్గేందుకు తోడ్పుతుందని పరిశోధకులు గుర్తించారు. మాంసాహారంలో అధికంగా ఉండే మాంసకృత్తులు, పిండిపదార్థాలు.. డయాబెటిస్‌కు దారితీస్తాయని వారు పేర్కొన్నారు. ఊబకాయం,వయసు పైబడటం, శారీరక శ్రమ లేకపోవడం సహా జన్యపరమైన కారణాల వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉన్నా శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆహారంలో అధిక మొత్తంలో స్వీట్లు, ప్రాసెస్ చేసిన పదార్థాలు, కూల్‌డ్రింక్స్ వంటివి టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని, అందుకే మనం తీసుకునే ఆహారం మధుమేహం నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. మాంసాహారాన్ని వారానికి ఒకసారి కంటే ఎక్కువగా తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందని తెలిపారు. -
పేరెంట్స్‌కి షుగర్ ఉంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుందా?
మా పేరెంట్స్ ఇద్దరికీ సుగర్ ఉంది. నాకు ఈమధ్యే పెళ్లయింది. మా పేరెంట్స్‌కి సుగర్ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీలో నాకూ సుగర్ వచ్చే ప్రమాదం ఉందా? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. మాధవి, హాసన్పర్తి ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే డయాబెటీస్‌ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇది ఒకరకంగా సాధారణమే. ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన డయాబెటీస్ .. ప్రసవం తరువాత తగ్గిపోతుంది. కుటుంబంలో .. దగ్గరి బంధువుల్లో టైప్ 2 డయాబెటీస్ ఉంటే.. గర్భిణీలో సుగర్ కనపడుతుంది. కనపడే రిస్క్ రెండున్నర రెట్లు ఎక్కువ. తల్లికి సుగర్ ఉంటే ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే చాన్స్ ఎక్కువ. తండ్రికి సుగర్ ఉంటే 30 శాతం రిస్క్ ఉంటుంది. ఇద్దరికీ 70 శాతం రిస్క్ ఉంటుంది. 10–20 శాతం ప్రెగ్నెన్సీస్లో జీడీఎమ్ ఉంటుంది. దీనికి జెనెటిక్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కారణం. వేళకు భోంచేయకపోవడం.. పౌష్టికాహారం తీసుకోకపోవడం, అవసరాని కన్నా ఎక్కువ తినడం, జంక్, ఫ్రోజెన్, ప్రాసెస్డ్ ఫుడ్, వేపుళ్లు, నూనె పదార్థాలు ఎక్కువ తినడం, రోజూ వ్యాయామం చేయకపోవడం, ప్రెగ్నెన్సీకి ముందే బరువు ఎక్కువగా ఉండటం, బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 30 కన్నా ఎక్కువ ఉండటం.. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం వంటివన్నీ జెస్టేషనల్ డయాబెటీస్ రిస్క్‌ని పెంచుతాయి. మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ‘బ్యాడ్ సుగర్’ అంటే వైట్ బ్రెడ్, పాస్తా, పేస్ట్రీస్, మైదా, పళ్ల రసాలు, ప్రాసెస్డ్ ఫుడ్, కార్న్ సిరప్స్ వంటివాటిని దూరం పెట్టాలి. మీరు బరువు ఎక్కువ ఉంటే కనీసం పది శాతం అయినా బరువు తగ్గాలి. అప్పుడే ప్రెగ్నెన్సీలో సుగర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. అరగంట సేపు ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్ లాంటివి కనీసం వారానికి అయిదు రోజులైనా చేయాలి. ఫైబర్, తాజా కూరగాయలు, ఆకు కూరలు, పొట్టు ధాన్యాలు, గుమ్మడి గింజలు, నట్స్ వంటివి తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే జెస్టేషనల్ డయాబెటీస్ లేదా తరువాతైనా సుగర్ వచ్చే చాన్సెస్ తగ్గుతాయి. (చదవండి: ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!) -
ఆ రోజే ఎందుకు డయాబెటిస్ డే జరుపుకుంటున్నాం?
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి కుటుంబంలో ఓ డయాబెటిస్ పేషెంట్ తప్పకుండా ఉంటున్నారు. రోజుకి రోజుకి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వ్యాధి సైలంట్ కిల్లర్‌లా మొత్తం అవయవాలన్నింటిపై ప్రభావం చూపించి మనిషి ఆయఃప్రమాణాని తగ్గించేస్తోంది. ఈ మధుమేహం కారణంగా చాలామంది గుండె, మూత్రపిండాల, కంటి ఇన్ఫెక్షన్లా బారిన పడినవాళ్లు కోకొల్లలు. ఇది ఓ మహమ్మారిలా మనుషులను చుట్టుముట్టి జీవితాన్ని హారతి కర్పూరంలా తెలియకుండానే హరించేస్తుంది. నిజం చెప్పాలంటే ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలిక వ్యాధిలా ఉండిపోతుంది. కేవలం శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా రక్షించుకోవడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. అలాంటి మధుమేహ వ్యాధి కోసం ప్రత్యేకంగా ఓ రోజును ఏర్పాటు చేసి మరీ ఎందుకు జరుపుతున్నారు. అసలు ఈ మధుమేహాన్ని ఎలా నియంత్రించుకోవాలి తదితరాల గురించే ఈ కథనం!. చాలామంది దీనికి తీసుకోవల్సిన తగు జాగ్రత్తలు, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ వ్యాధి కారణంగా తలెత్తే రుగ్మతలు బారినపడి ప్రాణాలు కోల్పోతున్నా వాళ్ల సంఖ్య ఎక్కువ. దీంతో ప్రజలందరికి ఈ వ్యాధిపై అవగాహన వచ్చేలా ఒక రోజుని ఏర్పాటు చేసుకుని..ప్రతి ఏటా అందుకు సంబంధించిన కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తే కనీసం ఈ వ్యాధి కారణంగా చనిపోతున్న వారి సంఖ్యను తగ్గించగలగడమే కాక మధుమేహ రోగుల సంఖ్యను కూడా నియంత్రించగలిగుతామని నిపుణులు భావించారు. అదీగాక ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన ఏర్పడితే అదుపులో పెట్టుకుని దీర్ఘకాలం జీవించేలా చేయగలుగుతాం. ఆ రోజు ఎందుకంటే.. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతుతో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య 1991లో ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించగా, 2006 నుంచి అధికారికంగా పాటిస్తున్నారు. ఇక 1922లో సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ తన సహచర శాస్త్రవేత్తతో కలిసి ఇన్సులిన్ని కనిపెట్టిన సంగతి విధితమే. అయితే సర్ ఫ్రెడరిక్ ఈ వ్యాధిని నియంత్రిచడానికి రోగులను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నించాడు. పైగా ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని రోగుల్లో ధైర్యాన్ని నింపేవాడు. ఆయన విశేష కృషికి గానూ ఏటా సర్ ఫ్రెడరిక్ పుట్టిన రోజు నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డేగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ఒక్కో థీమ్‌తో ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన ఏర్పడేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధుమేహంలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ అనేది ఒక రకమైన జన్యుపరమైన రుగ్మత, ఇది ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ మీ జీవనశైలి, చెడు అలవాట్ల కారణంగా వస్తుంది. ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్(ఐడీఎఫ్) ప్రపంచ వ్యాప్తంగా సుమారు 537 మిలియన్ల(సుమారు 53 కోట్ల మందికి) మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2045 నాటిక సుమారు 700 మిలియన్ల(70 కోట్లకు)కు పైగా పెరుగుతుందని అంచనా. దాదాపు 90%నికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు టైప్2 డయాబెటిస్‌తోనే బాధపడుతున్నారు. దీన్ని క్రమతప్పక వ్యాయామం, ధూమపానానికి దూరంగా ఉండటం తోపాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో అదుపులో పెట్టుకోవచ్చు లేదా నివారించొచ్చు. ఈ ఏడాది థీమ్ "మధుమేహ సంరక్షణకు ప్రాముఖ్యత". ఈ ప్రచార క్యాంపెయిన్‌తో మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం. అందరికీ ఈ వ్యాధి పట్ల అవగాహన, వారికి కావల్సిన మద్దతును అందిచడం, సమస్య తీవ్రతను నివారించేలా దృష్టి సారించడం వంటి స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేగాదు 2030 నాటికి మధుమేహాన్ని నియంత్రించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునేలా అన్ని రకాల వనరులను వినియోగించుకోవాలని ఆరోగ్య కార్యకర్తలకు పిలుపునిస్తోంది ఈ ప్రచార కార్యక్రమం. ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనాలంటే.. ముందుగా మీకు టైప్ 2 మధుమేహం వచ్చిందో లేదో చెకప్ చేయించుకోవాలిజ మధుమేహం గురించి తెలుసుకోవడం, నివారణకు ఏం చేయాలి తదితరాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి మధుమేహగ్రస్తులకు మద్దుతు ఇవ్వడం మీ సమీప ప్రాంతో ఈ దినోత్సవాన్ని నిర్వహించడంల లేదా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం జెనీవాలోని ఐక్యరాజ్యసమితికి మీ జాతీయ ఆరోగ్య మంత్రి లేదా శాశ్వత మిషన్‌కు లేఖ పంపడం లేదా మధేమేహ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వమని కోరడం వంటివి చేయాలి (చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
ఇక రోజూ ఇన్సులిన్ అవసరం లేదు!
మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. ఈ వ్యాధి ఒకసారి వస్తే ఎప్పటికీ నయం కాదు. ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. అందుకే మధుమేహం రాకముందే అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇక షుగర్ వ్యాధి వచ్చిందంటే ప్రతిరోజూ మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడాల్సిందే. అయితే ఇకపై ఆ కష్టాలు కొంతవరకు తీరనున్నాయి. ప్రతిరోజూ కాకుండా వారంలో ఒకసారి మాత్రమే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందట. సైంటిస్టులు జరిపిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. భారత్‌లో మధుమేహం దూకుడు పెంచుతోంది. ఏటా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. దాదాపుగా 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ‘లాన్సెట్’లో పబ్లిష్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది. కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన ఈ అధ్యయనంలో దాదాపు 13.6 కోట్ల మందికి ప్రీడయాబెటిస్ ఉందని అంచనా వేశారు. మనుషుల్లో తగినంత ఇన్సులిన్, హార్మోన్ తయారుకాకపోవడం లేదా ఆ పరిస్థితిలో సరిగ్గా ప్రతిస్పందించలేకపోవటం వల్ల హై బ్లడ్ షుగర్ వస్తుంది. లైఫ్ స్టైల్లో మార్పులు, ఫ్యామిలీ హిస్టరీ వల్ల ఈమధ్య కాలంలో తక్కువ వయసులోనే పలువురు మధుమేహం బారిన పడుతున్నారు. డయాబెటిస్‌ను నియంత్రణలో పెట్టకపోతే ప్రాణానికే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్, కంటిచూపు పోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే మధుమేహం రాకముందే పరిస్థితిని అదుపులో ఉంచుకోవడం మంచిది. మధుమేహం రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో టైప్-2 డయాబెటిస్ సాధారణమైంది. ప్రతిరోజూ మందులు వాడితే సరిపోతుంది. ఇక టైప్-1 డయాబెటిస్ వారు మాత్రం జీవితాంతం ప్రతిరోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. ఒకరోజూ ఇన్సులిన్ తీసుకోకపోయినా పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వీరికి కాస్త ఉపశమనం లభించనుంది. శాస్త్రవేత్తలు తాజాగా రూపొందించిన 'ఐకోడెక్' అనే ఇన్సులిన్‌తో కేవలం వారానికి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇది డైలీ తీసుకునే ఇన్సులిన్ షాట్స్‌కి సమానంగా ఉంటుందని క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. 'ఐకోడెక్' ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుందని తేలింది. టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న 582 మంది రోగులపై ఈ ట్రయల్స్ నిర్వహించారు. వీరిలో సగం మందికి 'ఐకోడెక్' అనే ఇంజెక్షన్‌ను ఇవ్వగా, మిగతా సగం మందికి 'డెగ్లుడెక్' అనే సాధారణ ఇన్సులిన్ ఇంజెక్షన్(రోజూ వాడేది)ను ఇచ్చారు. దాదాపు 26 వారాల తర్వాత వీరి HbA1C(గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్)లెవల్స్‌ను పరిశీలించగా.. ఊహించని మార్పులను కనుగొన్నారు. డెగ్లుడెక్ ఇన్సులిన్‌తో పోలిస్తే తాజాగా శాస్త్రవేత్తలు కొనిపెట్టిన ఐకోడెక్ ఇన్సులిన్‌ను వాడిన వాళ్లలో హైపోగ్లైసీమిక్ (తక్కువ గ్లూకోజ్ స్థాయిలు) కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ ఇదంత పెద్ద విషయం కాదని, ఈ రకమైన ఇన్సులిన్‌తో వారానికి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. -
ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా? షుగర్ వ్యాధి వస్తుందట
ఉప్పు ఎక్కువగా వాడితే రక్తపోటు(బీపీ)వస్తుందనే ఇప్పటి వరకు విన్నాం. కానీ ఉప్పు వల్ల మధుమేహం కూడా వస్తుందని మీకు తెలుసా? లండన్‌కు చెందిన సైంటిస్టులు తాజాగా జరిపిన రీసెర్చ్‌లో ఈ విషయం వెల్లడైంది. మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటే మధుమేహం వస్తుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. మరి రోజువారి మొత్తంలో ఎంత మేరకు ఉప్పు తీసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో చూసేద్దాం. ఉప్పు లేకుండా వంట చేయడం దాదాపు అసాధ్యం. ఏ వంట చేయాలన్నా ఉప్పు తప్పనిసరి. చాలామంది కూర చప్పగా ఉందనో, రుచి కోసమో మోతాదుకు మించి ఉప్పు వాడేస్తుంటారు. ఊరగాయ పచ్చళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బోలెడంత ఉప్పు ఉంటుంది అందులో. అయితే ఇలా అవసరానికి మించి ఉప్పు తినడం వల్ల రక్తపోటు వస్తుందనే ఇప్పటి వరకు మనకు తెలుసు. కానీ తాజాగా ఉప్పు వల్ల మధుమేహం కూడా వస్తుందని పరిశోధకులు తెలిపారు. అధిక ఉప్పు వాడటం వల్ల టైప్-2 డయాబెటిస్ వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. యూకేలోని 'తులనే' యూనివర్సిటీ నిర్వహించిన రీసెర్చ్‌లో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 12 ఏళ్ల పాటు 13 వేల మందిపై జరిపిన అధ్యయనంలో.. మోతాదుకు మించి ఉప్పు వాడే వారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే రిస్క్ అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉప్పు తక్కువ తీసుకునే వారితో పోలిస్తే, ఎక్కువగా కొన్నిసార్లు తీసుకునే వ్యక్తుల్లో 13 శాతం, సాధారణంగా తీసుకునే వారిలో 20 శాతం, ఎల్లప్పుడూ తీసుకునే వారిలో 39 శాతం టైప్ 2 డయాబెటిస్ వచ్చినట్లుగా అధ్యయనంలో వెల్లడైంది. ఉప్పు తక్కువగా తీసుకుంటే బీపీ మాత్రమే కాదు, మధుమేహం వచ్చే ఛాన్స్ కూడా తగ్గించుకోవచ్చని సైంటిస్టులు తెలిపారు. కొంతమంది ఆహారం తీసుకొనేటప్పుడు టేబుల్ సాల్ట్ వాడతారని దీని వల్ల టైప్ 2 మధుమేహం 40 శాతం పెరిగే అవకాశం ఉందని కొత్త పరిశోధనలో తేలిందని తులనే యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు రెండు టీ స్పూన్ల ఉప్పుును తీసుకునే వారిలో డయాబెటిస్ ముప్పుు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఉప్పుతో డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే మాత్రం రోజు 1500 మి. గ్రా లకు మించి ఉప్పు వాడరాదని నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు బీపీ, షుగర్ సహా గుండె సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. -
షుగర్ పేషెంట్స్.. పచ్చి కూరగాయలు, పండ్లు తింటున్నారా?
ఇటీవలి కాలంలో ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. ఆధునిక జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులు, అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, వంశపార్యపరంగాగా, ఒత్తిడి..ఇలా రకరకాల కారణాల వల్ల చాలామంది టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగినప్పుడు వచ్చే ఈ పరిస్థితిని డయాబెటిస్ అంటారు. ప్రస్తుతం వయసులో సంబంధం లేకుండా అందరిలోనూ డయాబెటిస్ సమస్య వస్తోంది. ఈ క్రమంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్లో ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. డయాబెటిస్ అనేది మెటబాలిక్ కండిషన్. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుకోవాలంటే మీ డైట్లో తప్పకుండా ఫైబర్ ఫుడ్‌ని చేర్చుకోవాల్సిందే. ఎందుకంటే కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించి..రక్తంలో గ్లూకోజ్ స్పైక్‌లను తగ్గిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగిన పరిమాణంలో ఉంటాయి. స్టార్(సర్వే ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటిస్ విత్ ఫైబర్-రిచ్ న్యూట్రిషన్ డ్రింక్) జరిపిన అధ్యాయనంలోనూ ఇదే విషయం వెల్లడైంది. టైప్-2 డయాబెటిస్ ఉన్న సుమారు 3,042మంది రోగులపై ఈ పాన్ ఇండియా సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా మూడు నెలల పాటు ఫైబర్ రిచ్ సప్లిమెంట్స్ తీసుకున్న వారిని ఒక గ్రూపుగా, సప్లిమెంట్ తీసుకోనివారిని మరో గ్రూపుగా విభజించి వారిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది గమనించారు. గ్లూకోజ్ స్థాయి గణనీయంగా తగ్గింది ►HbA1C(గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్)స్థాయి గణనీయంగా 8.04 నుండి 7.32కి తగ్గింది ► సుమారు 82% మంది రోగులలో 3కిలోల వరకు బరువు తగ్గడం కనిపించింది. ► సప్లిమెంట్ తీసుకున్న వారు ఉత్సాహంగా ఉన్నట్లు గమనించారు. దీని ప్రకారం..ఫైబర్ రిచ్ సప్లిమెంట్ రోజువారి వినియోగంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎలా నియంత్రిస్తుందన్నది సర్వే ఆధారంగా మరోసారి రుజువైంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కంట్రోల్లో ఫైబర్ పాత్ర ఎంత ముఖ్యం అన్నది ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలిపోయింది. RSSDI, అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వంటి సంస్థలు కూడా మధుమేహం ఉన్నవారు తమ డైట్లో రిచ్ ఫైబర్(పీచు పదార్థం) ఫుడ్స్‌ని తీసుకోవాల్సిందిఆ సిఫార్సు చేస్తున్నారు. మధుమేహం ఉన్నవారు రోజుకి 25-40 గ్రా.ల ఫైబర్ తీసుకోవాల్సిందిగా RSSDI సిఫార్సు చేసింది. మధుమేహం నియంత్రణలో సనైన పోషకాహారం పాటించడం ఎంతో అవసరమని సౌత్ ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ ఎండోక్రైన్ సొసైటీస్ (SAFES) ప్రెసిడెంట్, డాక్టర్ సంజయ్ కల్రా అన్నారు. మధుమేహంతో బాధపడేవాళ్లు తమ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర వినియోగాన్ని తగ్గించడమే కాకుండా ఫైబర్ రిచ్ ఫుడ్స్‌ని పెంచుకోవాల్సిందిగా తెలిపారు. ఫైబర్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంచెం తిన్నా ఎక్కువ తిన్న అనుభూతిని కలిగించడమే కాకుండా, కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలివే.. ►పచ్చి కూరగాయలు, పండ్లు ► గోధుమలు, ఓట్స్ ► బ్రౌన్ రైస్,క్వినోవా, బార్లీ ► జీడిపప్పు, బాదం, పిస్తా వంటి నట్స్ ► బీన్స్, ధాన్యాలు ► అవిసె గింజలు ► బ్రకోలి,యాపిల్ ► స్ట్రా బెర్రీలు, గూస్ బెర్రీలు,బ్లూబెర్రీలు ► అరటి పండు, అవకాడో మొదలైనవి. -
మాటలతోనే మధుమేహాన్ని పట్టేస్తుంది!
మీరు మధుమేహం బారిన పడ్డారో లేదో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? కానీ... దూరంగా ఉండే డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవడం ఇష్టం లేదా? ఇంట్లోకి వచ్చి రక్త నమూనాలు సేకరించినా వద్దని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఓ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుని ఓ పదిసెకన్లపాటు మాట్లాడితే మీకు డయాబిటీస్ ఉన్నదీ లేనిది స్పష్టమైపోతుంది అంటున్నారు క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు. మన మాటకూ మధుమేహానికీ సంబంధం ఏమిటనేదేనా మీ ప్రశ్న.. అయితే చదివేయండి! మారిన జీవనశైలి, ఆహారపు అలావాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాలతో ప్రపంచంలో ఏటికేడాదీ మధుమేహ బాధితులు పెరిగిపోతున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా భారతదేశం టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాజధానిగా మారిపోయిందన్న వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాధిని వీలైనంత తొందరగా, సులువుగా గుర్తించేందుకు తగిన పరీక్షలు అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ బయోటెక్ కంపెనీ క్లిక్ ల్యాబ్ వీటిల్లో ఒకటి. ఈ సంస్థ శాస్త్రవేత్తలు కొందరు ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించి కేవలం వాయిస్ రికార్డింగ్ ద్వారా మాత్రమే మధుమేహం సోకిన వారిని గుర్తించవచ్చునని నిర్ధారించారు. అధ్యయనంలో భాగంగా క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు 267 మందిని ఎంచుకున్నారు. వీరిలో 192 మంది వ్యాధి సోకనివారు. మిగిలిన 75 మంది మధుమేహంతో బాధపడుతున్న వారు. వీరందరి స్మార్ట్ఫోన్లలో శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన ఒక అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేశారు. అధ్యయనంలో పాల్గొన్న వారు ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి కొన్ని నిర్దిష్ట పదాలతో కూడిన వాక్యాన్ని రోజుకు ఆరుసార్లు రికార్డు చేయమని కోరారు. మాట్లాడే వేగాన్ని బట్టి ఈ ఆడియో రికార్డింగ్ ఆరు నుంచి పది సెకన్ల నిడివి మాత్రమే ఉంటుంది. సూక్ష్మస్థాయి తేడాలు... ఈ పద్ధతిలో శాస్త్రవేత్తలకు మొత్తం 18465 రికార్డింగ్‌లు లభించాయి. స్థాయి, తీవ్రత వంటి 14 ధ్వని సంబంధిత అంశాలను విశ్లేషించి చూసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. మధుమేహ రోగుల రికార్డింగ్‌లలో సాధారణ పరిస్థితుల్లో మనం అస్సలు వినలేని సూక్ష్మస్థాయి తేడాలున్నట్లు స్పష్టమైంది. ప్రత్యేకమైన సిగ్నల్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ మాత్రమే వీటిని గుర్తించగలదన్నమాట. మధుమేహులు, ఇతరుల మధ్య ఉన్న తేడాలు చాలా సుస్పష్టంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మధుమేహం బారిన పడ్డ వారి స్వరంలో సూక్ష్మమైన తేడాలు వస్తాయని ఈ అధ్యయనం చెబుతోంది. కృత్రిమ మేధను జోడించారు... క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా తెలుసుకున్న విషయాలకు కృత్రిమ మేధను జోడించడంతో ఫలితాలు మరింత కచ్చితత్వంతో రావడం మొదలైంది. వ్యక్తి వయసు, పురుషుడా? మహిళనా? ఎత్తు?, బరువు? వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని స్వరాన్ని విశ్లేషించేందుకు రూపొందించిన కృత్రిమమేధ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించినప్పుడు మహిళల్లో టైప్-2 వ్యాధిని 89 శాతం కచ్చితంగా గుర్తించినట్లు తెలిసింది. పురుషుల విషయంలో ఈ కచ్చితత్వం 86 శాతం మాత్రమే. టెక్నాలజీకి మరింత పదును పెడితే కచ్చితత్వం కూడా పెరుగుతుందని, పైగా ప్రస్తుతం పరగడపున నిర్వహిస్తున్న ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్‌ల కచ్చితత్వం 85 శాతం మాత్రమేనని శాస్త్రవేత్తలు వివరించారు. సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్షలు కూడా 91 శాతం, 92 శాతం కచ్చితత్వంతో కూడిన ఫలితాలను మాత్రమే ఇస్తున్నట్లు క్లిక్ ల్యాబ్స్ శాస్త్రవేత్త జేసీ కాఫ్మాన్ తెలిపారు. స్వరం ద్వారా మధుమేహాన్ని గుర్తించే పద్ధతిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు మరిన్ని పరీక్షలు చేపడుతున్నామని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా మధుమేహ పరీక్షలకు ప్రస్తుతం అవుతున్న వ్యయప్రయాసలను గణనీయంగా తగ్గించవచ్చునని అభిప్రాయపడ్డారు. పరిశోధన వివరాలు మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్: డిజిటల్ హెల్త్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
డయాబెటిస్ రావడానికి అసలు కారణం ఇదే...
-
2050 నాటికి 130 కోట్ల మందికి మధుమేహం
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రానున్న 30 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోనుంది. ప్రస్తుతం 50 కోట్లుగా ఉన్న చక్కెర వ్యాధి బాధితుల సంఖ్య 2050 కల్లా రెట్టింపు కంటే ఎక్కువగా 130 కోట్లకు చేరనుంది ఈ విషయాలను లాన్సెట్ పత్రిక వెల్లడించింది. ‘డయాబెటిస్ ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ప్రపంచ దేశాల ఆరోగ్య వ్యవస్థలన్నిటికీ ఇది సవాలు వంటిదే. ఈ వ్యాధి కారణంగా ముఖ్యంగా గుండెజబ్బుల కూడా పెరుగుతాయి’అని ఈ పరిశోధనలకు సారథ్యం వహించిన యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన లియానె ఒంగ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 96 శాతం టైప్ 2 డయాబెటిస్వేనని తెలిపారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్–2021 సర్వే ఆధారంగా 1990– 2021 సంవత్సరాల మధ్య వయస్సు, లింగం ఆధారంగా 204 దేశాలు, భూభాగాల్లో మధుమేహం విస్తృతి, అనారోగ్యం, మరణాలను బట్టి 2050 వరకు మధుమేహం వ్యాప్తి ఎలా ఉంటోందో వీరు అంచనా వేశారు. వీరి అధ్యయనం ప్రకారం.. మధుమేహం వ్యాప్తి రేటు 6.1%గా ఉంది. మరణాలు, వైకల్యానికి ప్రధాన కారణాలుగా నిలిచే టాప్–10 వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఉండటం గమనార్హం. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలలో అత్యధికంగా 9.3% మంది ఈ వ్యాధికి గురికాగా 2050 నాటికి ఇది 16.8%కి చేరుకోనుంది. అదే లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాల్లో అప్పటికల్లా దీని విస్తృతి 11.3% గా ఉంటుందని ఈ సర్వే తెలిపింది. అంతేకాకుండా, 65 ఏళ్లు, ఆపైన వారే ఎక్కువగా డయాబెటిస్ బారినపడుతున్నారని, అన్నిదేశాల్లోనూ ఇదే ఒరవడిని గుర్తించామని లియానె ఒంగ్ పేర్కొన్నారు. అత్యధికంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం ప్రాంతాల్లో అత్యధికంగా ఈ వయస్సు వారిలో 39.4 శాతం మంది ఈ జబ్బు బారినపడినట్లు గుర్తించామన్నారు. అత్యల్పంగా మధ్య ఆసియా, మధ్య యూరప్, తూర్పు యూరప్ దేశాల్లో 19.8% మందిలోనే ఉంది. టైప్2 డయాబెటిస్‌కు ప్రధానమైన 16 కారణాల్లో బీఎంఐ ప్రాథమిక కారణమని, టైప్ 2 డయాబెటిస్తో సంభవించే మరణాలు, వైకల్యాలకు ఇదే కీలకమని సర్వే తెలిపింది. ఆల్కహాల్, పొగాకు వినియోగంతోపాటు, ఆహార, వృత్తిపరమైన, పర్యావరణ సంబంధ సమస్యలతోపాటు తక్కువ శారీరక శ్రమ ఇందుకు ప్రధానమైన అంశాలని పేర్కొంది. తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాల్లో జన్యుసంబంధ, సామాజిక, ఆర్థిక అంశాలు కూడా ఈ వ్యాధి బారినపడేందుకు కారణాలుగా ఉన్నాయి. -
డయాబెటిస్ ఉన్నవాళ్లు గుండె జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
-
3 గంటల ముందే లైట్లార్పితే.. గర్భిణుల్లో మధుమేహానికి చెక్! కీలక విషయాలు
న్యూఢిల్లీ: గర్భిణులు పడుకోవడానికి కొద్ది గంటల ముందే ఇంట్లో లైట్లను పూర్తిగా ఆర్పేయడమో, బాగా తగ్గించడమో చేస్తే మధుమేహం ముప్పును నివారించవచ్చట. కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ల వెలుతురు కూడా ఈ ఆర్పేయాల్సిన లైట్ల జాబితాలోకే వస్తుంది! అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ వర్సిటీ తాజా అధ్యయనం ఈ మేరకు తేల్చింది. నిద్రకు ముందు చాలాసేపు లైట్ల వెలుగులో గడిపితే గ్లూకోజ్ నియంత్రణపై ప్రభావం పడుతుందని అధ్యయనానికి సారథ్యం వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మింజీ కిమ్ తెలిపారు. ‘‘741 మంది గర్భిణులపై చేసిన ప్రయోగంలో ఇది నిర్ధారణ అయింది. అందుకే వీలైతే గర్భధారణ సమయంలో కంప్యూటర్లు, మొబైల్, టీవీ వాడకానికి పూర్తిగా దూరంగా ఉండటం చాలా మంచిది. కుదరని పక్షంలో కనీసం వాటిని వీలైనంత డిమ్‌గా మార్చుకోవాలి’’ అని సూచించారు. నిద్రకు ముందు లైట్ల వెలుగులో బాగా గడిపితే పొత్తికడుపు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలకూ దారి తీస్తుందని కూడా హెచ్చరించారు! -
మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ
సాక్షి, విశాఖపట్నం: మధుమేహం దూకుడు పెంచుతోంది. ఏటా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. జనాభా మాదిరిగానే మధుమేహ రోగుల్లోనూ చైనా, భారత్ పోటీ పడుతున్నాయి. చైనా 141 మిలియన్ల మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా.. భారత్ 77 మిలియన్ల మధుమేహులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. మన దేశంలో మధుమేహం బాధితుల సంఖ్య 2045 సంవత్సరం నాటికి 135 మిలియన్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. దీని బారినపడే వారిలో మహిళల (40 శాతం) కంటే పురుషులే (60 శాతం) అధికంగా ఉంటున్నారు. 2020లో దేశంలో 7 లక్షల మంది డయాబెటిస్తో చనిపోయారు. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం దేశంలోకెల్లా కేరళ 19.8 శాతం మధుమేహ బాధితులతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో 13.6 శాతంతో ఛండీగఢ్, తమిళనాడు, 8.9 శాతంతో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అంటే మన రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 9 మందికి మధుమేహం ఉన్నట్టు లెక్క. మధుమేహ బాధితుల సంఖ్య పెరగడానికి వివిధ అంశాలు దోహదం చేస్తున్నాయనే విషయాన్ని ఇదివరకే గుర్తించారు. స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్స్ తినడం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు, వంశ పారంపర్యం వంటివి ప్రధాన కారణాలుగా తేల్చారు. ప్రతి ఇద్దరు మధుమేహుల్లో ఒకరు తనకు ఆ రోగం ఉన్నట్టు గుర్తించలేకపోతున్నట్టు పరిశోధనల్లో తేలింది. ఇది కూడా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరగడానికి దోహదపడుతోంది. ఇదీ చదవండి: చైనాలో కోవిడ్ విజృంభణ.. ఫోర్త్ వేవ్ వచ్చినా ప్రాణాంతకం కాదు! -
ప్రపంచంలోనే 2వ స్థానం.. ‘తియ్యటి’ జబ్బుతో తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ‘తియ్యటి’వ్యాధి ఎందరిలోనో అంతులేని చేదును మిగులుస్తోంది. శరీరాన్ని లోపలి నుంచే పీల్చి పిప్పి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1980లో 10.80 కోట్లున్న షుగర్ పేషెంట్ల సంఖ్య 2014 నాటికి 42.20 కోట్లకు చేరుకుంది. 11 కోట్ల మందికిపైగా షుగర్ పేషెంట్లతో చైనా ప్రధమస్థానాన్ని కైవసం చేసుకోగా, 7.7 కోట్ల మందితో భారత్ ద్వితీయస్థానంలో నిలిచింది. 2030 నాటికి మనదేశంలో ఈ పేషెంట్ల సంఖ్య 10 కోట్లకు చేరవచ్చని అంచనా. దేశ జనాభాలో 5.5 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం... కేరళ 7.5 శాతం (జాతీయ సగటు కూడా 7.5 శాతం), తమిళనాడు 6.6 శాతం, ఆంధ్రప్రదేశ్ 6.6 శాతం, తెలంగాణ 4.8 శాతం, కర్ణాటక 4.6 శాతం డయాబెటిస్ పేషెంట్లు ఉన్నారు. ఈ లక్షణాలుంటే జాగ్రత్త పడాల్సిందే... గతంలో 50 ఏళ్లు దాటినవారు మాత్రమే డయాబెటిస్‌కు గురయ్యేవారు. ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా 30, 40 దాటని వారిలోనూ ఈ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో 40 ఏళ్లు పైబడినవారిలో 20 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చుతున్నట్టు వెల్లడైంది. డయాబెటిస్ రోగులు తరచుగా మూత్ర విసర్జన చేయడం, రాత్రిపూట నాలుగైదు సార్లు లేవడం, తరచుగా ఆకలిగా అనిపించడం, ఒక్కోసారి ఎక్కువ ఆహారపదార్థాలు తీసుకున్నాక కూడా మళ్లీ ఏదో ఒకటి తినడం మొదలుపెట్టడం వంటి లక్షణాలున్న వారు తమ రక్తంలో చక్కెర శాతాన్ని పరీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకే విధమైన జీవనశైలి, ఆహార అలవాట్లు ఉన్నప్పటికీ క్రమంగా బరువు కోల్పోతుంటే మధుమేహం లక్షణాలు కావచ్చునని చెబుతున్నారు. చేతులు, కాళ్లు, చర్మంలో నొప్పి కొనసాగితే, అది మధుమేహం సంకేతం కావచ్చు. కంటి చూపు క్షీణత లేదా తక్కువ సమయంలో కళ్లద్దాల పవర్ పెరుగుతుండటం, మందులు తీసుకున్నా తరచుగా చర్మ వ్యాధులకు గురైనా, అవి సులభంగా తగ్గకపోయినా అది డయాబెటిస్ కావొచ్చునంటున్నారు. చక్కెరతో మధుమేహం! అపోహ మాత్రమే.. చక్కెరతో మధుమేహం అనేది ఓ అపోహ మాత్రమే. ఒకసారి ఈ వ్యాధి బారిన పడ్డాక డయాబెటిస్‌తోనే జీవితాంతం గడపాలని, దానిని వెనక్కు పంపలేమనే అభిప్రాయం గతంలో ఉండేది. కాని తాజా సాంకేతికతలు, ఉన్నత శ్రేణి మందులు అందుబాటులోకి వచ్చాక తగిన జాగ్రత్తలతోపాటు డాక్టర్ల సూచనలను పేషెంట్ పాటిస్తే షుగర్ వ్యాధిని కచ్చితంగా తగ్గించొచ్చు. రోజువారీ అలవాట్లలో బద్ధకం, వ్యాయామం చేసేందుకు విముఖత, జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పులు డయాబెటిస్ పెరుగుదలకు కారణమవుతున్నాయి. చక్కెర వ్యాధి అనేది తనకు తానుగా ప్రమాదకారి కాదు. అది ఒక ‘గేట్‌వే’గా సకల అనారోగ్యాలకు కారణమవుతుంది. అందువల్ల దాని పట్ల జాగురూకతతో ఉండటం, ముందుగానే దానిని గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యం. – డా.ప్రభుకుమార్ చల్లగాలి, డయాబెటాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్ ప్రతీ ఇద్దరిలో ఒకరికి ? దేశంలో ప్రతీ ఇద్దరిలో ఒకరికి డయాబెటిస్ వచ్చినా దానిని వారు గుర్తించలేకపోతున్నట్టు వైద్యవర్గాల అంచనా. 2019 మే నెలలో ఒక సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం.. డయాబెటిస్ బారిన పడ్డాక 24 శాతం మంది మాత్రమే దానిని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు. ఇతర గ్రూపులు, కేటగిరీల వారితో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోని పురుషులు, అందునా తక్కువ ఆదాయం, తక్కువ విద్యాస్థాయిలు ఉన్నవారిలోనూ దీని బారిన ఎక్కువగా పడుతున్నట్టు స్పష్టమైంది. ‘వేరియేషన్ ఇన్ హెల్త్ సిస్టమ్ ఫెర్ఫార్మెన్స్ ఫర్ మేనేజింగ్ డయాబెటిస్ అమాంగ్ స్టేట్స్ ఇన్ ఇండియా – ఎ క్రాస్ సెక్షనల్ స్టడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ ఏజ్డ్ 15 టు 49’శీర్షికతో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్, చెన్నై, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఇతర అంతర్జాతీయ సంస్థలు కలిసి నిర్వహించిన విస్తృత పరిశీలనలో అనేకముఖ్యమైన విషయాలు వెల్లడయ్యాయి. -
ఒంటికి పని చెప్తే కంటి నిండా నిద్ర!
హోమియో కౌన్సెలింగ్ డయాబెటిస్ వ్యాధి హోమియో విధానంలో తగ్గుతుందా? - రవిచంద్ర, చీరాల డయాబెటిస్ రక్తంలో చక్కెరపాళ్లు అధికం కావడం వల్ల వచ్చే వ్యాధి. ఇందులో మూత్రం ఎక్కువగా రావడం, ఆకలి, దాహం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇందులోని కొన్ని ముఖ్యమైన రకాలుంటాయి. శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడాన్ని టైప్-1 అనీ, ఉత్పత్తి చేసిన ఇన్సులిన్‌ను కణాలు సక్రమంగా వినియోగించలేకపోవడాన్ని టైప్-2 అనీ, గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటిస్‌ను జెస్టెషనల్ డయాబెటిస్ అని అంటారు. టైప్-1 డయాబెటిస్: ఈ రకం వ్యాధి ఉన్న వారిలో క్లోమగ్రంథిలో ఉండే బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల శరీరంలో చక్కెరపాళ్లు పెరుగుతూ ఉంటాయి. వీళ్లలో రోగనిరోధక వ్యవస్థను రక్షించే టీ-సెల్స్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. కానీ పుట్టినప్పుడు వాళ్లు నార్మల్‌గానే ఉండవచ్చు. రానురానూ గ్లూకోజ్ పాళ్లు పెరగడంతో పిల్లలు బలహీనపడతారు. దీన్నే ‘జువెనైల్ డయాబెటిస్’ అని కూడా అంటారు. టైప్-2 డయాబెటిస్: ఇది ఎక్కువగా నడివయసు వారిలో కనిపిస్తుంటుంది. తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి ఉన్నప్పుడు పిల్లల్లోనూ ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగినప్పుడు రక్తంలో చక్కెరపాళ్లు అధికమై బయటపడవచ్చు. జెస్టెషనల్ డయాబెటిస్: గర్భధారణ సమయంలో వచ్చిన డయాబెటిస్ చాలామందిలో ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. అయితే అది మళ్లీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్తో వచ్చే దుష్ర్పభావాలు చాలా ఎక్కువే. దీనివల్ల రక్తనాళాలు దెబ్బతినడం, గుండె సంబంధిత వ్యాధులు రావడం, కంటిలోని సున్నితమైన రక్తనాళాలు దెబ్బతిని (డయాబెటిస్ రెటినోపతి), చూపు కోల్పోవడం కూడా జరగవచ్చు. కిడ్నీలపై (డయాబెటిస్ నెఫ్రోపతి) దుష్ర్పభావం పడటం, నరాలు దెబ్బతినడం వల్ల వేళ్ల చివర్లకు చీమలు పాకినట్లు ఉండటం, స్పర్శ తగ్గడం, అరికాళ్ల నొప్పుల వంటి సమస్యలు రావచ్చు. హోమియోలో డయాబెటిస్‌కు మంచి మందులు ఉన్నాయి. తీపిని ఇష్టపడేవారు, ఆధ్యాత్మికత ఉన్నవారికి సల్ఫర్, స్థూలకాయం ఉండి, త్వరగా కన్నీళ్లు వచ్చేవారికి కాల్కేరియా కార్బ్, తేలిగ్గా ఉద్వేగాలకు గురై, త్వరగా కోపం వచ్చేవారు, ఘాటైన మసాలా ఆహారాలను ఇష్టపడేవారికి నక్స్ వామికా వంటి ఎన్నో మంచి మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. - డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్,పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఉద్యోగరీత్యా ఒత్తిళ్ల వల్ల తలనొప్పి వస్తోందని అనుకున్నాను. ఇటీవల మరిన్నిసార్లు రావడంతో డాక్టర్‌ను కలిశాను. ఆయన మైగ్రేన్‌గా గుర్తించారు. దయచేసి నాకు తగిన పరిష్కారం చూపించండి. - సుహాస్, హైదరాబాద్ అనేక రకాల తలనొప్పుల్లో మైగ్రేన్ ఒకటి. ఇది 15 శాతం మంది యువతుల్లో, 6 శాతం మంది యువకుల్లో కనిపిస్తుంది. కొందరిలో ఇది తలకు ఒకవైపునే కనిపిస్తే, మరికొందరిలో తల మొత్తంలో నొప్పి వస్తుంటుంది. కడుపులో తిప్పడం, వాంతి కావడం, శబ్దాలను - కాంతిని భరించలేకపోవడం వంటి లక్షణాలు ఈ తలనొప్పుల్లో కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మైగ్రేన్ జన్యుపరంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశాలు చాలా ఉంటాయి. వాటిని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. అవి... నిద్ర సరిగా లేకపోవడం, ఎండలో తిరగడం, చాక్లెట్లు, ఐస్‌క్రీములు ఎక్కువగా తీసుకోవడం వంటివి నొప్పిని తక్షణం మొదలయ్యేలా చేసే ట్రిగరింగ్ ఫ్యాక్టర్లలో కొన్ని. మనలో ఏ అంశం నొప్పిని ప్రేరేపిస్తోందో కనుగొంటే... చాలావరకు మైగ్రేన్‌ను నివారించవచ్చు. దాంతోపాటు సరైన పోషకాహారం తీసుకోవడం, మంచి ఆహార అలవాట్లు పాటించండం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వంటివి మైగ్రేన్‌ను నివారించే కొన్ని అంశాలు. మైగ్రేన్ చికిత్సలో రెండు రకాల మందులు ఉపయోగిస్తారు. మొదటివి... తలనొప్పి వచ్చినప్పుడు తక్షణం నొప్పి నుంచి ఉపశమనం కలిగించే మందులు. వీటిని నోటి ద్వారా ఇస్తారు. ఒకవేళ రోగికి వాంతులు అవుతుంటే ముక్కు ద్వారాగానీ లేదా ఇంజెక్షన్ ద్వారా గానీ ఈ తరహా మందులు ఇవ్వవచ్చు. ఇక రెండో రకమైనవి... మున్ముందు నొప్పి రాకుండా ఉండటం కోసం దీర్ఘకాలం వాడాల్సిన మందులు. మీరు డాక్టర్‌ను సంప్రదించి మైగ్రేన్ పునరావృతం కాకుండా కోసం వాడాల్సిన దీర్ఘకాలిక మందులను వాడితే ఇది తిరగబెట్టే అవకాశాలు తక్కువ. డాక్టర్ నీలేశ్ విజయ్ చౌధురీ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. లైఫ్‌స్టయిల్ కౌన్సెలింగ్ నేను కూర్చొని చేసే వృత్తిలో ఉన్నాను. రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదు. ఒళ్లు అలిసేలా వ్యాయామం చేయమనీ, దాంతో బాగా నిద్రపడుతుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. వ్యాయామం చేసేవాళ్లకు అంతగా నిద్రపట్టదని మరికొందరు చెబుతున్నారు. నాకు వాస్తవాలు వివరించండి. - ధన్‌రాజ్, నకిరేకల్ మీరు చెప్పిన రెండు అంశాలూ నిజమే. నిద్రకు ఉపక్రమించబోయే మూడు గంటల ముందుగా వ్యాయామం అంత సరికాదు. అలా చేస్తే నిద్రపట్టడం కష్టమే. అయితే రోజూ ఉదయంగానీ లేదా ఎక్సర్‌సైజ్‌కూ, నిద్రకూ చాలా వ్యవధి ఉండేలా గానీ వ్యాయామం చేస్తే మంచి నిద్ర పడుతుంది. ఒళ్లు అలిసేలా వ్యాయామంతో ఒళ్లెరగని నిద్రపడుతుంది. ఉదయం చేసే వ్యాయామంతో ఒత్తిడి నుంచి దూరమవుతారు. అయితే ఉదయం వేళ చేసే వ్యాయామం పగటి వెలుగులో అయితే మరింత ప్రభావపూర్వకంగా ఉంటుంది. మీరు ఉదయం వేళలో వ్యాయామం చేయలేకపోతే అది సాయంత్రం వేళ అయితే మంచిది. మీ రోజువారీ పనుల వల్ల అప్పటికి మీ శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త పెరిగి ఉంటుంది. ఇక నిద్రవేళకు మన శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంటంది. కానీ వ్యాయామంతో మళ్లీ శరీరాన్ని ఉత్తేజపరచడం జరుగుతుంది. ఇక కార్డియోవాస్క్యులార్ వ్యాయామాల వల్ల గుండె స్పందనల వేగం, రేటు పెరుగుతాయి. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. వీటన్నింటి ఉమ్మడి ప్రభావాల వల్ల నిద్ర తగ్గుతుంది. అంతేకాదు... వ్యాయామం ముగిసిన 20 నిమిషాల తర్వాతగానీ గుండె కండరాల రక్తం పంపింగ్ ప్రక్రియ సాధారణ స్థితికి రాదు. అందుకే వ్యాయామానికీ, నిద్రకూ మధ్య వ్యవధి ఉండేలా చూసుకోవాలన్న మాట. ఇక స్ట్రెచింగ్ వ్యాయామాలు, బలాన్ని పెంచుకనే స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ తరహా వ్యాయామాలూ శరీరానికి మేలు చేసినా... అవేవీ కార్డియోవాస్క్యులార్ వ్యాయామాలకు సాటిరావు. యోగా ప్రధానంగా తనువునూ, మనసునూ రిలాక్స్ చేసే ప్రక్రియ. మీ ఫ్రెండ్స్‌లో కొందరు చెప్పినట్లుగా దీర్ఘకాలిక నిద్రలేమికి వ్యాయామం విరుగుడు. అందుకే మరీ తీవ్రంగా (విగరస్‌గా) కాకుండా... మరీ చేసీచెయ్యనట్లు (మైల్డ్)గా కాకుండా... మాడరేట్ ఎక్సర్సైజ్ చేయండి. కంటినిండా నిద్రపోండి. వాకింగ్, జాగింగ్, జంపింగ్, స్విమ్మింగ్, టెన్నిస్ ఆడటం, డాన్స్ చేయడం లాంటి ఏ ప్రక్రియ అయినా వ్యాయామానికి మంచిదే. అయితే మీకు గుండెజబ్బులూ, స్థూలకాయం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే వ్యాయామాలు మొదలుపెట్టే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, మీకు తగిన వ్యాయామాలు సూచించమని అడగడం మేలు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com నిర్వహణ: యాసీన్