న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రానున్న 30 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోనుంది. ప్రస్తుతం 50 కోట్లుగా ఉన్న చక్కెర వ్యాధి బాధితుల సంఖ్య 2050 కల్లా రెట్టింపు కంటే ఎక్కువగా 130 కోట్లకు చేరనుంది ఈ విషయాలను లాన్‌సెట్ పత్రిక వెల్లడించింది. ‘డయాబెటిస్ ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది.
ప్రపంచ దేశాల ఆరోగ్య వ్యవస్థలన్నిటికీ ఇది సవాలు వంటిదే. ఈ వ్యాధి కారణంగా ముఖ్యంగా గుండెజబ్బుల కూడా పెరుగుతాయి’అని ఈ పరిశోధనలకు సారథ్యం వహించిన యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన లియానె ఒంగ్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 96 శాతం టైప్ 2 డయాబెటిస్‌వేనని తెలిపారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్–2021 సర్వే ఆధారంగా 1990– 2021 సంవత్సరాల మధ్య వయస్సు, లింగం ఆధారంగా 204 దేశాలు, భూభాగాల్లో మధుమేహం విస్తృతి, అనారోగ్యం, మరణాలను బట్టి 2050 వరకు మధుమేహం వ్యాప్తి ఎలా ఉంటోందో వీరు అంచనా వేశారు. వీరి అధ్యయనం ప్రకారం.. మధుమేహం వ్యాప్తి రేటు 6.1%గా ఉంది.
మరణాలు, వైకల్యానికి ప్రధాన కారణాలుగా నిలిచే టాప్–10 వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఉండటం గమనార్హం. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలలో అత్యధికంగా 9.3% మంది ఈ వ్యాధికి గురికాగా 2050 నాటికి ఇది 16.8%కి చేరుకోనుంది. అదే లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాల్లో అప్పటికల్లా దీని విస్తృతి 11.3% గా ఉంటుందని ఈ సర్వే తెలిపింది.
అంతేకాకుండా, 65 ఏళ్లు, ఆపైన వారే ఎక్కువగా డయాబెటిస్ బారినపడుతున్నారని, అన్నిదేశాల్లోనూ ఇదే ఒరవడిని గుర్తించామని లియానె ఒంగ్ పేర్కొన్నారు. అత్యధికంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం ప్రాంతాల్లో అత్యధికంగా ఈ వయస్సు వారిలో 39.4 శాతం మంది ఈ జబ్బు బారినపడినట్లు గుర్తించామన్నారు. అత్యల్పంగా మధ్య ఆసియా, మధ్య యూరప్, తూర్పు యూరప్ దేశాల్లో 19.8% మందిలోనే ఉంది.
టైప్2 డయాబెటిస్‌కు ప్రధానమైన 16 కారణాల్లో బీఎంఐ ప్రాథమిక కారణమని, టైప్ 2 డయాబెటిస్‌తో సంభవించే మరణాలు, వైకల్యాలకు ఇదే కీలకమని సర్వే తెలిపింది. ఆల్కహాల్, పొగాకు వినియోగంతోపాటు, ఆహార, వృత్తిపరమైన, పర్యావరణ సంబంధ సమస్యలతోపాటు తక్కువ శారీరక శ్రమ ఇందుకు ప్రధానమైన అంశాలని పేర్కొంది. తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాల్లో జన్యుసంబంధ, సామాజిక, ఆర్థిక అంశాలు కూడా ఈ వ్యాధి బారినపడేందుకు కారణాలుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment