అమెరికాలో మరో విమాన ప్రమాదం.. | Small plane crash In USA Philadelphia | Sakshi
Sakshi News home page

అమెరికాలో మరో విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి

Feb 1 2025 6:51 AM | Updated on Feb 1 2025 8:09 AM

Small plane crash In USA Philadelphia

వాషింగ్టన్‌: అగ్ర రాజ్యం అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియా రాష్ట్రంలో విమానం ఇళ్లపై కూలిపోయింది. దీంతో, ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్టు సమాచారం. ఇక, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. అమెరికాలోని ఈశాన్య ఫిలడెల్ఫియాలో విమాన ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియాలోని షాపింగ్‌మాల్‌ సమీపంలో విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే ఇళ్లపై కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. విమానం కూలిపోయిన వెంటనే భారీ పేలుడు సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందినట్టు సమాచారం. మృతుల్లో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. 
 

ప్రమాదానికి గురైన విమానాన్ని లీఆర్‌జెట్‌ 55గా గుర్తించారు. విమాన ప్రమాదం నేపథ్యంలో పెన్సిల్వేనియా గవర్నర్‌ జోష్‌ శాప్రియా స్పందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే, విమానం మిస్సోరీ వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురైనట్టు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం కారణంగా చుట్టుపక్కల ప్రాం‍తాల రోడ్లను మూసివేసి సహాయక చర్యలు చేపట్టారు. కాగా, సాంకేతిక లోపం కారణంగానే విమాన ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇక, ఫెలడెల్ఫియా ఎయిర్‌పోర్టు నుంచి బిజినెస్‌ సంబంధిత జెట్స్‌, చిన్న విమానాలు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి.
 

ఇదిలా ఉండగా.. శుక్రవారం ఉదయమే అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అరుదైన రీతిలో ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్‌ ఢీకొని, నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 64 మంది ప్రయాణీకులు మృతిచెందారు. ఈ దుర్ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ టవర్‌లో సిబ్బంది కొరత కూడా ప్రమాదానికి ఓ కారణంగా తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్లను, విమానాలను ఒకే కంట్రోలర్‌ ఏకకాలంలో నియంత్రించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ పనులకు ఇద్దరు విధుల్లో ఉండాలి. కానీ, ఒకరు మాత్రమే ఉన్నారని ఇంటర్నేషనల్‌ ప్రిలిమినరీ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement