మీరు మధుమేహం బారిన పడ్డారో లేదో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? కానీ... దూరంగా ఉండే డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవడం ఇష్టం లేదా? ఇంట్లోకి వచ్చి రక్త నమూనాలు సేకరించినా వద్దని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఓ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఓ పదిసెకన్లపాటు మాట్లాడితే మీకు డయాబిటీస్ ఉన్నదీ లేనిది స్పష్టమైపోతుంది అంటున్నారు క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు. మన మాటకూ మధుమేహానికీ సంబంధం ఏమిటనేదేనా మీ ప్రశ్న.. అయితే చదివేయండి!
మారిన జీవనశైలి, ఆహారపు అలావాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాలతో ప్రపంచంలో ఏటికేడాదీ మధుమేహ బాధితులు పెరిగిపోతున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా భారతదేశం టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాజధానిగా మారిపోయిందన్న వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాధిని వీలైనంత తొందరగా, సులువుగా గుర్తించేందుకు తగిన పరీక్షలు అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ బయోటెక్ కంపెనీ క్లిక్ ల్యాబ్ వీటిల్లో ఒకటి. ఈ సంస్థ శాస్త్రవేత్తలు కొందరు ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించి కేవలం వాయిస్ రికార్డింగ్ ద్వారా మాత్రమే మధుమేహం సోకిన వారిని గుర్తించవచ్చునని నిర్ధారించారు.
అధ్యయనంలో భాగంగా క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు 267 మందిని ఎంచుకున్నారు. వీరిలో 192 మంది వ్యాధి సోకనివారు. మిగిలిన 75 మంది మధుమేహంతో బాధపడుతున్న వారు. వీరందరి స్మార్ట్‌ఫోన్లలో శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన ఒక అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేశారు. అధ్యయనంలో పాల్గొన్న వారు ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి కొన్ని నిర్దిష్ట పదాలతో కూడిన వాక్యాన్ని రోజుకు ఆరుసార్లు రికార్డు చేయమని కోరారు. మాట్లాడే వేగాన్ని బట్టి ఈ ఆడియో రికార్డింగ్ ఆరు నుంచి పది సెకన్ల నిడివి మాత్రమే ఉంటుంది.
సూక్ష్మస్థాయి తేడాలు...
ఈ పద్ధతిలో శాస్త్రవేత్తలకు మొత్తం 18465 రికార్డింగ్‌లు లభించాయి. స్థాయి, తీవ్రత వంటి 14 ధ్వని సంబంధిత అంశాలను విశ్లేషించి చూసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. మధుమేహ రోగుల రికార్డింగ్‌లలో సాధారణ పరిస్థితుల్లో మనం అస్సలు వినలేని సూక్ష్మస్థాయి తేడాలున్నట్లు స్పష్టమైంది. ప్రత్యేకమైన సిగ్నల్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ మాత్రమే వీటిని గుర్తించగలదన్నమాట. మధుమేహులు, ఇతరుల మధ్య ఉన్న తేడాలు చాలా సుస్పష్టంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మధుమేహం బారిన పడ్డ వారి స్వరంలో సూక్ష్మమైన తేడాలు వస్తాయని ఈ అధ్యయనం చెబుతోంది.
కృత్రిమ మేధను జోడించారు...
క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా తెలుసుకున్న విషయాలకు కృత్రిమ మేధను జోడించడంతో ఫలితాలు మరింత కచ్చితత్వంతో రావడం మొదలైంది. వ్యక్తి వయసు, పురుషుడా? మహిళనా? ఎత్తు?, బరువు? వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని స్వరాన్ని విశ్లేషించేందుకు రూపొందించిన కృత్రిమమేధ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించినప్పుడు మహిళల్లో టైప్-2 వ్యాధిని 89 శాతం కచ్చితంగా గుర్తించినట్లు తెలిసింది.
పురుషుల విషయంలో ఈ కచ్చితత్వం 86 శాతం మాత్రమే. టెక్నాలజీకి మరింత పదును పెడితే కచ్చితత్వం కూడా పెరుగుతుందని, పైగా ప్రస్తుతం పరగడపున నిర్వహిస్తున్న ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్‌ల కచ్చితత్వం 85 శాతం మాత్రమేనని శాస్త్రవేత్తలు వివరించారు. సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్షలు కూడా 91 శాతం, 92 శాతం కచ్చితత్వంతో కూడిన ఫలితాలను మాత్రమే ఇస్తున్నట్లు క్లిక్ ల్యాబ్స్ శాస్త్రవేత్త జేసీ కాఫ్‌మాన్ తెలిపారు.
స్వరం ద్వారా మధుమేహాన్ని గుర్తించే పద్ధతిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు మరిన్ని పరీక్షలు చేపడుతున్నామని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా మధుమేహ పరీక్షలకు ప్రస్తుతం అవుతున్న వ్యయప్రయాసలను గణనీయంగా తగ్గించవచ్చునని అభిప్రాయపడ్డారు. పరిశోధన వివరాలు మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్: డిజిటల్ హెల్త్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment