
సాక్షి, హైదరాబాద్: ‘తియ్యటి’వ్యాధి ఎందరిలోనో అంతులేని చేదును మిగులుస్తోంది. శరీరాన్ని లోపలి నుంచే పీల్చి పిప్పి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1980లో 10.80 కోట్లున్న షుగర్ పేషెంట్ల సంఖ్య 2014 నాటికి 42.20 కోట్లకు చేరుకుంది. 11 కోట్ల మందికిపైగా షుగర్ పేషెంట్లతో చైనా ప్రధమస్థానాన్ని కైవసం చేసుకోగా, 7.7 కోట్ల మందితో భారత్ ద్వితీయస్థానంలో నిలిచింది. 2030 నాటికి మనదేశంలో ఈ పేషెంట్ల సంఖ్య 10 కోట్లకు చేరవచ్చని అంచనా.
దేశ జనాభాలో 5.5 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం... కేరళ 7.5 శాతం (జాతీయ సగటు కూడా 7.5 శాతం), తమిళనాడు 6.6 శాతం, ఆంధ్రప్రదేశ్ 6.6 శాతం, తెలంగాణ 4.8 శాతం, కర్ణాటక 4.6 శాతం డయాబెటిస్ పేషెంట్లు ఉన్నారు.
ఈ లక్షణాలుంటే జాగ్రత్త పడాల్సిందే...
గతంలో 50 ఏళ్లు దాటినవారు మాత్రమే డయాబెటిస్‌కు గురయ్యేవారు. ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా 30, 40 దాటని వారిలోనూ ఈ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో 40 ఏళ్లు పైబడినవారిలో 20 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చుతున్నట్టు వెల్లడైంది. డయాబెటిస్ రోగులు తరచుగా మూత్ర విసర్జన చేయడం, రాత్రిపూట నాలుగైదు సార్లు లేవడం, తరచుగా ఆకలిగా అనిపించడం, ఒక్కోసారి ఎక్కువ ఆహారపదార్థాలు తీసుకున్నాక కూడా మళ్లీ ఏదో ఒకటి తినడం మొదలుపెట్టడం వంటి లక్షణాలున్న వారు తమ రక్తంలో చక్కెర శాతాన్ని పరీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఒకే విధమైన జీవనశైలి, ఆహార అలవాట్లు ఉన్నప్పటికీ క్రమంగా బరువు కోల్పోతుంటే మధుమేహం లక్షణాలు కావచ్చునని చెబుతున్నారు. చేతులు, కాళ్లు, చర్మంలో నొప్పి కొనసాగితే, అది మధుమేహం సంకేతం కావచ్చు. కంటి చూపు క్షీణత లేదా తక్కువ సమయంలో కళ్లద్దాల పవర్ పెరుగుతుండటం, మందులు తీసుకున్నా తరచుగా చర్మ వ్యాధులకు గురైనా, అవి సులభంగా తగ్గకపోయినా అది డయాబెటిస్ కావొచ్చునంటున్నారు.
చక్కెరతో మధుమేహం! అపోహ మాత్రమే..
చక్కెరతో మధుమేహం అనేది ఓ అపోహ మాత్రమే. ఒకసారి ఈ వ్యాధి బారిన పడ్డాక డయాబెటిస్‌తోనే జీవితాంతం గడపాలని, దానిని వెనక్కు పంపలేమనే అభిప్రాయం గతంలో ఉండేది. కాని తాజా సాంకేతికతలు, ఉన్నత శ్రేణి మందులు అందుబాటులోకి వచ్చాక తగిన జాగ్రత్తలతోపాటు డాక్టర్ల సూచనలను పేషెంట్ పాటిస్తే షుగర్ వ్యాధిని కచ్చితంగా తగ్గించొచ్చు.
రోజువారీ అలవాట్లలో బద్ధకం, వ్యాయామం చేసేందుకు విముఖత, జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పులు డయాబెటిస్ పెరుగుదలకు కారణమవుతున్నాయి. చక్కెర వ్యాధి అనేది తనకు తానుగా ప్రమాదకారి కాదు. అది ఒక ‘గేట్‌వే’గా సకల అనారోగ్యాలకు కారణమవుతుంది. అందువల్ల దాని పట్ల జాగురూకతతో ఉండటం, ముందుగానే దానిని గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యం.
– డా.ప్రభుకుమార్ చల్లగాలి, డయాబెటాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్
ప్రతీ ఇద్దరిలో ఒకరికి ?
దేశంలో ప్రతీ ఇద్దరిలో ఒకరికి డయాబెటిస్ వచ్చినా దానిని వారు గుర్తించలేకపోతున్నట్టు వైద్యవర్గాల అంచనా. 2019 మే నెలలో ఒక సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం.. డయాబెటిస్ బారిన పడ్డాక 24 శాతం మంది మాత్రమే దానిని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు. ఇతర గ్రూపులు, కేటగిరీల వారితో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోని పురుషులు, అందునా తక్కువ ఆదాయం, తక్కువ విద్యాస్థాయిలు ఉన్నవారిలోనూ దీని బారిన ఎక్కువగా పడుతున్నట్టు స్పష్టమైంది.
‘వేరియేషన్ ఇన్ హెల్త్ సిస్టమ్ ఫెర్‌ఫార్మెన్స్ ఫర్ మేనేజింగ్ డయాబెటిస్ అమాంగ్ స్టేట్స్ ఇన్ ఇండియా – ఎ క్రాస్ సెక్షనల్ స్టడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ ఏజ్డ్ 15 టు 49’శీర్షికతో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్, చెన్నై, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఇతర అంతర్జాతీయ సంస్థలు కలిసి నిర్వహించిన విస్తృత పరిశీలనలో అనేకముఖ్యమైన విషయాలు వెల్లడయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment