Prabhukumar
-
నిప్పుల కుంపటి.. జర జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పులకుంపటిలా మారింది. మండు టెండలు, వడగాడ్పులు, ఉక్కబోత రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తున్నాయి. వీటిని తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో ఎండలు మరింత ముదిరి 45 నుంచి 48 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని వాతావరణ శాఖ సైతం హెచ్చరిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల ఉష్ణోగ్రతలు 42, 43 డిగ్రీలకు చేరుకున్నాయి. హైదరాబాద్‌సహా మరికొన్ని చోట్ల ఎండ తక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నా, వడగాడ్పుల వేడి, ఉక్కబోత వంటివి జనాలను హడలెత్తిస్తున్నాయి. రాత్రి అయినా చల్లబడని వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మే నెలలో భానుడి భగభగలతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో వడదెబ్బతోపాటు జలుబు, దగ్గు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, మెదడు లాగినట్లు ఉండటం వంటివి చోటుచేసుకుంటాయని పేర్కొంటున్నారు. బరువులు ఎత్తడం, ఇతర శారీరక అలసట కలిగించే పనులేవీ చేయకపోయినా చెమటలు పట్టి శరీరం నుంచి సోడియం, పొటాషియం, క్లోరైడ్స్ తగ్గిపోతాయని, ఆ విధంగా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఇళ్లలో ఉండే వృద్ధులు, చిన్నపిల్లలపైనా అధిక ప్రభావం వృద్ధులు, చిన్నపిల్లలు ఇళ్లలోనే ఉన్నా అధిక ఉష్ణోగ్రతలు వారిపై అధిక ప్రభావం చూపుతాయి. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధుల్లో సోడియం స్థాయిలు తగ్గిపోవడం వల్ల అయోమయం, ఎటూ తోచని తీరుతోపాటు కోమాలోకి వెళ్లే అవకాశాలుంటాయి. వడగాల్పులు చెవుల్లోకి వెళ్లి కళ్లు మంటలెక్కడం, మెదడు ప్రభావితమై, ఒళ్లునొప్పులతో జ్వరమొచ్చినట్టుగా అవుతుంది. ఆహారాన్ని అరిగించే ఎంజైమ్స్ పొడిబారిపోయి నీళ్ల విరేచనాలు వంటి వాటికి దారితీయవచ్చు. అందువల్ల తరచూ నీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు తాగాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఇళ్ల నుంచి బయటకు వెళ్లకపోవడం మంచిది. ఆఫీసుల్లో, ఇళ్లలో ఏసీలు, కూలర్లతో 18–20 డిగ్రీల వాతావరణంలో ఉండి 40 డిగ్రీలకు పైబడిన బయటి ప్రాంతాలకు వెళ్లొద్దు. కొద్దిసమయం 30–35 డిగ్రీలున్న ప్రదేశంలో ఉండి వేడికి అలవాటు పడ్డాక బయటకు వెళ్లాలి. ఒక్కసారిగా వాతావరణ మార్పు సంభవించే చల్లటి ప్రదేశం నుంచి వేడి ప్రాంతానికి, వేడి ప్రదేశం నుంచి చల్లని ప్రాంతాలకు రావడం, పోవడం వంటివి చేస్తే వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ. ఇళ్లలోనే తాజా పండ్లరసాలు, నిమ్మకాయ నీళ్లు, ఉప్పు, చక్కెర కలిపిన పలుచటి మజ్జిగ తాగడం మంచిది. ఎలక్ట్రాల్ నీళ్లు, ఓఆర్ఎస్, ఇతర పానీయాలు తీసుకోవాలి. బయట రంగునీళ్లు, ఈగలు వాలే చెరుకురసాలు, శుభ్రత లేని పానీయాలు, ఎనర్జీ డ్రింకులు తీసుకోవడం వల్ల ఉపయోగం లేకపోగా ఆరోగ్యం పాడయ్యే ప్రమాదముంది. – డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, జనరల్ ఫిజీషియన్, లైఫ్ మల్టీస్పెషాలిటీస్ క్లినిక్ -
ప్రపంచంలోనే 2వ స్థానం.. ‘తియ్యటి’ జబ్బుతో తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ‘తియ్యటి’వ్యాధి ఎందరిలోనో అంతులేని చేదును మిగులుస్తోంది. శరీరాన్ని లోపలి నుంచే పీల్చి పిప్పి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1980లో 10.80 కోట్లున్న షుగర్ పేషెంట్ల సంఖ్య 2014 నాటికి 42.20 కోట్లకు చేరుకుంది. 11 కోట్ల మందికిపైగా షుగర్ పేషెంట్లతో చైనా ప్రధమస్థానాన్ని కైవసం చేసుకోగా, 7.7 కోట్ల మందితో భారత్ ద్వితీయస్థానంలో నిలిచింది. 2030 నాటికి మనదేశంలో ఈ పేషెంట్ల సంఖ్య 10 కోట్లకు చేరవచ్చని అంచనా. దేశ జనాభాలో 5.5 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం... కేరళ 7.5 శాతం (జాతీయ సగటు కూడా 7.5 శాతం), తమిళనాడు 6.6 శాతం, ఆంధ్రప్రదేశ్ 6.6 శాతం, తెలంగాణ 4.8 శాతం, కర్ణాటక 4.6 శాతం డయాబెటిస్ పేషెంట్లు ఉన్నారు. ఈ లక్షణాలుంటే జాగ్రత్త పడాల్సిందే... గతంలో 50 ఏళ్లు దాటినవారు మాత్రమే డయాబెటిస్‌కు గురయ్యేవారు. ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా 30, 40 దాటని వారిలోనూ ఈ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో 40 ఏళ్లు పైబడినవారిలో 20 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చుతున్నట్టు వెల్లడైంది. డయాబెటిస్ రోగులు తరచుగా మూత్ర విసర్జన చేయడం, రాత్రిపూట నాలుగైదు సార్లు లేవడం, తరచుగా ఆకలిగా అనిపించడం, ఒక్కోసారి ఎక్కువ ఆహారపదార్థాలు తీసుకున్నాక కూడా మళ్లీ ఏదో ఒకటి తినడం మొదలుపెట్టడం వంటి లక్షణాలున్న వారు తమ రక్తంలో చక్కెర శాతాన్ని పరీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకే విధమైన జీవనశైలి, ఆహార అలవాట్లు ఉన్నప్పటికీ క్రమంగా బరువు కోల్పోతుంటే మధుమేహం లక్షణాలు కావచ్చునని చెబుతున్నారు. చేతులు, కాళ్లు, చర్మంలో నొప్పి కొనసాగితే, అది మధుమేహం సంకేతం కావచ్చు. కంటి చూపు క్షీణత లేదా తక్కువ సమయంలో కళ్లద్దాల పవర్ పెరుగుతుండటం, మందులు తీసుకున్నా తరచుగా చర్మ వ్యాధులకు గురైనా, అవి సులభంగా తగ్గకపోయినా అది డయాబెటిస్ కావొచ్చునంటున్నారు. చక్కెరతో మధుమేహం! అపోహ మాత్రమే.. చక్కెరతో మధుమేహం అనేది ఓ అపోహ మాత్రమే. ఒకసారి ఈ వ్యాధి బారిన పడ్డాక డయాబెటిస్‌తోనే జీవితాంతం గడపాలని, దానిని వెనక్కు పంపలేమనే అభిప్రాయం గతంలో ఉండేది. కాని తాజా సాంకేతికతలు, ఉన్నత శ్రేణి మందులు అందుబాటులోకి వచ్చాక తగిన జాగ్రత్తలతోపాటు డాక్టర్ల సూచనలను పేషెంట్ పాటిస్తే షుగర్ వ్యాధిని కచ్చితంగా తగ్గించొచ్చు. రోజువారీ అలవాట్లలో బద్ధకం, వ్యాయామం చేసేందుకు విముఖత, జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పులు డయాబెటిస్ పెరుగుదలకు కారణమవుతున్నాయి. చక్కెర వ్యాధి అనేది తనకు తానుగా ప్రమాదకారి కాదు. అది ఒక ‘గేట్‌వే’గా సకల అనారోగ్యాలకు కారణమవుతుంది. అందువల్ల దాని పట్ల జాగురూకతతో ఉండటం, ముందుగానే దానిని గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యం. – డా.ప్రభుకుమార్ చల్లగాలి, డయాబెటాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్ ప్రతీ ఇద్దరిలో ఒకరికి ? దేశంలో ప్రతీ ఇద్దరిలో ఒకరికి డయాబెటిస్ వచ్చినా దానిని వారు గుర్తించలేకపోతున్నట్టు వైద్యవర్గాల అంచనా. 2019 మే నెలలో ఒక సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం.. డయాబెటిస్ బారిన పడ్డాక 24 శాతం మంది మాత్రమే దానిని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు. ఇతర గ్రూపులు, కేటగిరీల వారితో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోని పురుషులు, అందునా తక్కువ ఆదాయం, తక్కువ విద్యాస్థాయిలు ఉన్నవారిలోనూ దీని బారిన ఎక్కువగా పడుతున్నట్టు స్పష్టమైంది. ‘వేరియేషన్ ఇన్ హెల్త్ సిస్టమ్ ఫెర్ఫార్మెన్స్ ఫర్ మేనేజింగ్ డయాబెటిస్ అమాంగ్ స్టేట్స్ ఇన్ ఇండియా – ఎ క్రాస్ సెక్షనల్ స్టడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ ఏజ్డ్ 15 టు 49’శీర్షికతో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్, చెన్నై, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఇతర అంతర్జాతీయ సంస్థలు కలిసి నిర్వహించిన విస్తృత పరిశీలనలో అనేకముఖ్యమైన విషయాలు వెల్లడయ్యాయి. -
అంతర్జాతీయ త్రోబాల్ క్లినిక్‌కు ప్రభుకుమార్
హిందూపురం టౌన్ : త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ త్రోబాల్ అసోసియేషన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ త్రోబాల్ క్లినిక్‌కు జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్రోబాల్ అసోసియేషన్ టెక్నికల్ అఫీషియల్‌గా తనను నియమిస్తూ త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుండి ఉత్తర్వులు అందాయని త్రోబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రభుకుమార్ తెలిపారు. ఈనెల 21 నుంచి 24 వరకు బ్యాంకాక్, థాయ్‌ల్యాండ్‌లో త్రోబాల్ క్లినిక్‌ను నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో దాదాపు 30 దేశాలు పాల్గొంటాయని తెలిపారు. త్రోబాల్ క్లినిక్‌కు ప్రభుకుమార్ ఎంపిక కావడంతో అనంతపురం జిల్లాకే కాకుండా హిందూపురానికి కూడా గర్వకారణమని ఏపీ త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షులు విద్యాసాగర్, ఆనంద్‌నాయక్, పీడీ లోక్‌నాథ్ అన్నారు. -
సినీ గీతాల్లో అసభ్య పదజాలమా!
మద్రాసు హైకోర్టు నాయమూర్తి ఖండన తమిళసినిమా: సినీ గీతాల్లో అసభ్య పదజాలం హద్దులు మీరుతోందని, ఇది సమాజంపై దుష్ర్పభావం చూపిస్తుందని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తితీవ్రవ్యాఖ్యలు చేశారు. వివరాలు.. చెన్నై, మనలి ప్రాంతానికి చెందిన ప్రభుకుమార్‌ను 16 ఏళ్ల అమ్మాయిని అసభ్య పదజాలంతో దూషించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిలు కోరుతూ ప్రభుకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు శనివారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనను వినిపిస్తూ పోలీసులు పేర్కొన్న సదరు యువతి, ప్రభుకుమార్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, ఇది వారిపై పెట్టిన తప్పుడు కేసు అని వాదించారు. అయితే పోలీసుల తరఫున హాజరైన న్యాయవాది ఆ అమ్మాయి తల్లితో కలిసి రోడ్డుపై వెళుతుండగా పెళ్లి చేసుకుని పారిపోదామా? పారిపోయి పెళ్లి చేసుకుందామా?అంటూ సినిమా పాటను పాడాడని పేర్కొన్నారు. అతని చర్యలను ప్రశ్నించిన వారిపై చెయ్యి చేసుకోవడమే కాకుండా హత్యా బెదిరింపులు చేశాడని కోర్టుకు వివరించారు. ఇరుతరఫు వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుకుమార్‌కు నిబంధనలతో కూడిన బెయిలు మంజూరు చేస్తూ ఇదిబాలల అత్యాచార నేర వ్యతిరేక చట్టం కింద నమోదైన కేసు అని పోలీసులు పూర్తిగా విచారణ చేసి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. సినీ పాటల్లో అసభ్య పదజాలంపై ఖండన అదే సమయంలో సినీ రంగానికి చెందిన వారి చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. భావితరాల మనసుల్లో మంచి భావాలను, సమాజంలో బాధ్యతాయుతమైన అంశాలను పెంపొందించే విధంగా వారి చర్యలు ఉండాలన్నారు. అశ్లీల పదజాలాలు, హింసాత్మక సంఘటనలతో ఉన్నతమైన మన సంస్కృతి, సంప్రదాయాలకు సినీరంగానికి చెందిన వారు కీడు తలపెడుతున్నారని చురకలు వేస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమాలు, ఆ రంగానికి చెందిన వారు సమాజాభివృద్ధికి తోడ్పడాలని న్యాయమూర్తి హితవు పలికారు.