సినీ గీతాల్లో అసభ్య పదజాలమా!
మద్రాసు హైకోర్టు నాయమూర్తి ఖండన
తమిళసినిమా: సినీ గీతాల్లో అసభ్య పదజాలం హద్దులు మీరుతోందని, ఇది సమాజంపై దుష్ర్పభావం చూపిస్తుందని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తితీవ్రవ్యాఖ్యలు చేశారు. వివరాలు.. చెన్నై, మనలి ప్రాంతానికి చెందిన ప్రభుకుమార్‌ను 16 ఏళ్ల అమ్మాయిని అసభ్య పదజాలంతో దూషించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిలు కోరుతూ ప్రభుకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు శనివారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనను వినిపిస్తూ పోలీసులు పేర్కొన్న సదరు యువతి, ప్రభుకుమార్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, ఇది వారిపై పెట్టిన తప్పుడు కేసు అని వాదించారు.
అయితే పోలీసుల తరఫున హాజరైన న్యాయవాది ఆ అమ్మాయి తల్లితో కలిసి రోడ్డుపై వెళుతుండగా పెళ్లి చేసుకుని పారిపోదామా? పారిపోయి పెళ్లి చేసుకుందామా?అంటూ సినిమా పాటను పాడాడని పేర్కొన్నారు. అతని చర్యలను ప్రశ్నించిన వారిపై చెయ్యి చేసుకోవడమే కాకుండా హత్యా బెదిరింపులు చేశాడని కోర్టుకు వివరించారు. ఇరుతరఫు వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుకుమార్‌కు నిబంధనలతో కూడిన బెయిలు మంజూరు చేస్తూ ఇదిబాలల అత్యాచార నేర వ్యతిరేక చట్టం కింద నమోదైన కేసు అని పోలీసులు పూర్తిగా విచారణ చేసి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు.
సినీ పాటల్లో అసభ్య పదజాలంపై ఖండన
అదే సమయంలో సినీ రంగానికి చెందిన వారి చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. భావితరాల మనసుల్లో మంచి భావాలను, సమాజంలో బాధ్యతాయుతమైన అంశాలను పెంపొందించే విధంగా వారి చర్యలు ఉండాలన్నారు. అశ్లీల పదజాలాలు, హింసాత్మక సంఘటనలతో ఉన్నతమైన మన సంస్కృతి, సంప్రదాయాలకు సినీరంగానికి చెందిన వారు కీడు తలపెడుతున్నారని చురకలు వేస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమాలు, ఆ రంగానికి చెందిన వారు సమాజాభివృద్ధికి తోడ్పడాలని న్యాయమూర్తి హితవు పలికారు.