సినిమాల తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులోని మద్రాస్ హైకోర్టు సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. దర్శకులు సినిమాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. శృతిమించిన హింస, అసభ్యపదాల పాటలతో యువకుల మనసును కలుషితం చేస్తున్నారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చెన్నైలో 16 ఏళ్ల విద్యార్థిని వెంటపడి ప్రేమపేరుతో వేధించి, ప్రేమించకుంటే చంపేస్తానని బెదిరించిన ప్రభుకుమార్ (19) అనే విద్యార్థి కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తల్లితో కలసి వెళ్తున్న బాధితురాలిని ఉద్దేశిస్తూ ప్రభు ఓ సినిమాలోని అసభ్యపదజాలంతో కూడిన పాటపాడాడు. కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి యువకులపై సినిమాల ప్రభావాన్ని ప్రస్తావించారు.
రిమాండ్లో ఉన్న ప‍్రభుకు హైకోర్టు న్యాయమూర్థి జస్టిస్ ఎస్ వైద్యనాథన్ బెయిల్ మంజూరు చేశారు. పదివేల రూపాయల బాండ్లను రెండింటిని పూచీకత్తుగా సమర్పించాలని ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ప్రతిరోజు పోలీసు స్టేషన్లో హాజరుకావాల్సిందిగా ప్రభును ఆదేశించారు. దర్శకులు, నిర్మాతలు సినిమాల్లో హెచ్చుమీరిన హింస, బూతు పదాలతో కూడిన పాటలు చూపిస్తూ యువకుల మనసులను కలుషితం చేస్తున్నారని, దీనివల్ల మన సంస్కృతి, సత్ప్రవర్తన చెడిపోతున్నాయని న్యాయస్థానం పేర్కొంది. మీడియా అన్నది శక్తిమంతమైన గురువు అని, సినిమాల ప్రభావం పిల్లలపై ఉంటుందని, యువతలో మంచి ఆలోచనలు కలిగించే బాధ్యతను దర్శక నిర్మాతలు విస్మరించరాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.