యువ నాయికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
చెన్నై : ఈ తరం యువ నాయికలకు మద్రాసు హైకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. 18 ఏళ్లు దాటని అమ్మాయిలు నాయికలుగా నటించడాన్ని నిషేధించాలన్న పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. తమిళనాడు మక్కల్ కట్చి రాష్ట్ర కార్యదర్శి ముత్తుసెల్వి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. చలన చిత్రాల్లో 18 ఏళ్లు నిండని అమ్మాయిలను కథానాయికలుగా నటింపజేస్తున్నారని తెలిపారు. ఈ వయసులో అమ్మాయిలు పరిపక్వత ఉండదని, అలాంటివారు మానసికంగా, శారీరకంగా బాధింపులకు గురి అవుతారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. అలాంటివారు అత్యాచారాలకు గురవుతున్నారని తెలిపారు.
ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో నటి సంధ్య, కార్తిక, లక్ష్మీమీనన్, తులసి వంటి నాయకలు 18 ఏళ్ల వయసు నిండకముందే పాఠశాలలో చదువుకుంటూనే నటిగా రంగప్రవేశం చేశారని తెలిపారు. ఇలాంటి బాలికలు నాయికలుగా నటించడం చిన్నారుల న్యాయ చట్టానికి, భారతీయ పిల్లల సంరక్షణ చట్టానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. కాబట్టి 18 ఏళ్ల వయసులోపు అమ్మాయిల్ని నాయికలుగా నటించడంపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు జీవితంలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో సాధించాలన్న లక్ష్యంతో పయనిస్తారని, ఈ విషయంలో న్యాయస్థానం కల్పించుకోదంటూ పిటిషన్ కొట్టివేసింది.