తలనొప్పి... తగ్గేదెలా? | how to decrease the Headache pain? | Sakshi
Sakshi News home page

తలనొప్పి... తగ్గేదెలా?

Published Fri, Mar 11 2016 1:02 PM | Last Updated on Sat, Oct 20 2018 7:38 PM

తలనొప్పి... తగ్గేదెలా? - Sakshi

తలనొప్పి... తగ్గేదెలా?

న్యూరో కౌన్సెలింగ్
నా వయసు 39 ఏళ్లు. తరచూ తలనొప్పి వస్తోంది. దీని నుంచి విముక్తి పొందడానికి తగిన మార్గాలు చెప్పండి.
 - నవీన, కరీంనగర్

 
* మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. తలనొప్పి తగ్గడానికి మీరు ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించండి.
* ఎక్కువ శబ్దం, కాంతి లేని చోట విశ్రాంతి తీసుకోండి. విపరీతమైన శబ్దం, శక్తిమంతమైన వెలుగు వంటి అంశాలు తలనొప్పిని మరింత ప్రేరేపిస్తాయి.
* ఘాటైన వాసనలకు దూరంగా ఉండండి. సరిపడని పర్‌ఫ్యూమ్‌ల వల్ల తలనొప్పి ఎక్కువ కావచ్చు.
* తలనొప్పి తగ్గుతుందనే అపోహతో టీ, కాఫీలను పరిమితికి మించి తాగడం మంచిది కాదు.
* చాక్లెట్లు, కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం మానేయాలి. కెఫిన్ ఉండే శీతలపానీయాల నుంచి దూరంగా ఉండాలి.
* ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు పనిచేయాల్సి వచ్చినప్పుడు యాంటీగ్లేర్ గ్లాసెస్ ధరించడం మంచిది. ప్రతి అరగంటకు ఒకసారి కనీసం ఐదు నిమిషాల పాటు రిలాక్స్ కావాలి. కనురెప్ప కొట్టకుండా అదేపనిగా కంప్యూటర్ స్క్రీన్‌ను చూడటం సరికాదు.
* కంటికి ఒత్తిడి కలిగించే పనులు చేయకూడదు. కుట్లు, అల్లికలు వంటి పనులు చేసేవారు మధ్య మధ్య కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి.
* తలనొప్పితో పాటు వాంతులు, తలతిరగడం వంటివి కనిపిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- డాక్టర్ మురళీధర్‌రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్

 
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 34 సంవత్సరాలు. ఈమధ్య కాళ్లు నొప్పిగా ఉండి, నడుముభాగం నుంచి కాలివేళ్ల వరకు లాగినట్లుగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సయాటికా అన్నారు. సయాటికా అంటే ఏమిటో తెలియజేస్తూ, హోమియోపతిలో దీనికి పరిష్కారం సూచించగలరు.
 -ఏనుగుల శ్రీనివాసరావు, మెదక్

 
సయాటికా అనేది ఒకరకపు నొప్పి. ఇది ముఖ్యంగా తుంటినుండి మొదలై కాలివరకు నొప్పి వస్తుంది. సయాటిక్ నరంలోకి వచ్చే అసాధారణ లోపాల వల్ల ఇది వస్తుంది. ఈ సయాటిక్ నరం నడుములోని వెన్నుపాము నుంచి ప్రారంభమై దిగువకు ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది. కాలిలో ఉండే అనేక కండరాలను, ఇతర నిర్మాణాలను నియంత్రిస్తుంది. సయాటిక్ నరం ప్రయాణించే మార్గంలో అడ్డంకులు లేదా అవరోధాలు ఏర్పడటం లేదా నరం నలగడం లేదా వత్తుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది.
 
కారణాలు: ప్రధాన  కారణం హెర్నియేటెడ్ డిస్క్. అంటే వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ వెలుపలికి చొచ్చుకొని వచ్చి, వెన్నుపామును నొక్కడం వల్ల సయాటిక్ నరం ఒత్తుకుపోయి నొప్పి వస్తుంది.
వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు అరిగిపోవడం లేదా దానిలో ఉండే జిగురు వంటి పదార్థం తగ్గిపోవడం వల్ల కూడా బయటి నుంచి సయాటిక్ నరంపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది.

లాంబార్ స్పైనల్ స్టీనోసిస్: ఏ కారణం చేత అయినా వెన్నుపాము ప్రయాణించే మార్గం ఇరుకుగా మారితే దానిని స్టీనోసిస్ అంటారు. దీనివల్ల నరాలపై వత్తిడి పెరుగుతుంది. నొప్పి వస్తుంది.

ఫైరీ ఫార్మిస్ సిండ్రోమ్: ఫైరీ ఫార్మిస్ అనే కండరం సయాటిక్ కండరంపై అమరి ఉంటుంది. ఒకవేళ ఈ కండరంలో ఒత్తిడి పెరిగితే సయాటిక్ నరం పైన కూడా ఒత్తిడి పెరిగి, నొప్పి వస్తుంది. ఇది ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల లేదా మోటారు వాహనాల యాక్సిడెంట్లు, జారిపడటం వంటి వాటివల్ల కూడా వస్తుంది.
 
లక్షణాలు: ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, నడవలేకపోవడం, చేతివేళ్లు, కాలివేళ్లు తిమ్మిరి పట్టినట్లు అవడం, కాళ్లు, పాదాలలో సూదులతో గుచ్చినట్లు ఉండటం, ఒక్కోసారి నొప్పితోబాటు కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించడం వంటివి సయాటికాలో ముఖ్యలక్షణాలు.
 
నిర్ధారణ: ఎక్స్‌రే, నొప్పి లక్షణాల ఆధారంగా.
 
నివారణ: పోషకాహారం తీసుకోవడం, మజిల్ రిలాక్సేషన్ ఎక్సర్‌సైజులు చేయడం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా.
 
హోమియో చికిత్స: హోమియోలో కాన్‌స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా వ్యాధిని  అదుపు చేయడం జరుగుతుంది. మీరు హోమియో వైద్య నిపుణులను సంప్రదించండి.
 
- డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి,హైదరాబాద్

 
బ్లడ్ క్యాన్సర్ కౌన్సెలింగ్
మా అమ్మగారికి  40 ఏళ్లు. ఈమధ్య కొన్ని పరీక్షలు చేయించినప్పుడు ఆమెకు బ్లడ్‌క్యాన్సర్ అని తెలిసింది. బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణాలు చెప్పండి.
 - లక్ష్మిసుప్రియ, నిడదవోలు

 
రక్తకణాల ఉత్పత్తి ప్రభావితం కావడం వల్ల బ్లడ్  క్యాన్సర్ వస్తుంది. ఇది ప్రధానంగా బోన్ మ్యారో (ఎముకమజ్జ /మూలగ)లో ప్రారంభమవుతుంది. ఇక్కడి మూలకణాలు వృద్ధిచెంది... అవి ఎర్ర, తెల్ల కణాలుగానూ, ప్లేట్‌లెట్స్‌గానూ తయారవుతాయి. బ్లడ్ క్యాన్సర్ వచ్చినవారిలో తెల్లరక్తకణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దాంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది.

ఇలా అనియంత్రితంగా రక్తకణాలు పెరగడాన్ని బ్లడ్‌క్యాన్సర్‌గా చెప్పుకోవచ్చు. ఇలా నియంత్రణ లేకుండా పెరిగిన కణాలు మిగతా వాటిని పనిచేయనివ్వవు. ఫలితంగా రోగనిరోధక శక్తి కోల్పోతారు. బ్లడ్ క్యాన్సర్స్‌లో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి... 1) లుకేమియా 2) లింఫోమా 3) మైలోమా

లక్షణాలు: బ్లడ్‌క్యాన్సర్‌లో పరిపక్వం కాని తెల్లరక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతుంటాయి. వీటివల్ల గాయాలైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టించడానికి అవసరమైన ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులలో గాయాలైనప్పుడు అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్లుగా కనపడటం, చర్మం మీద ఎర్రగా దద్దుర్లు కనిపిస్తుంటాయి.
 
తెల్ల రక్తకణాలు వ్యాధి కారక సూక్ష్మజీవులతో పోరాడుతూ ఉండే తెల్లరక్తకణాల పనితీరు దెబ్బతింటుంది. దాంతో అవి తమ విధులను సక్రమంగా నెరవేర్చలేవు. పైగా అవి విపరీతంగా పెరగడం వల్ల ఎర్రరక్తణాలు తగ్గిపోవడంతో రోగికి రక్తహీనత రావచ్చు. దాంతో వాళ్లకు ఆయాసం కూడా రావచ్చు. ఇతర జబ్బులలో కూడా ఈ లక్షణాలు ఉండవచ్చు. అందుకే కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు బోన్‌మ్యారో పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.
 
ఇతర లక్షణాలు: జ్వరం, వణుకు, రాత్రుళ్లు చెమటలు పోవడం, ఇన్‌ఫ్లుయెంజా, అలసట, ఆకలి లేకపోవడం, చిన్నగాయం నుంచి అధిక రక్తస్రావం, తలనొప్పి, కాలేయం, స్ప్లీన్ వాడు, ఎముకల నొప్పి, సాధారణంగా బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారికి ప్రధానంగా మందులతో (కీమోథెరపీ) చికిత్స చేస్తారు. మీ అమ్మగారి విషయంలో మీ డాక్టర్ చెప్పిన సూచనలు పాటించి, తగిన చికిత్స అందించండి.
 
- డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీ,సీనియర్ హిమటో
 ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ
 హాస్సిటల్స్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement