తేలిగ్గా తీసుకుంటున్న తల్లిదండ్రులు.. స్కూల్ ఎగ్గొట్టేందుకు కుంటిసాకులని భావన
నిర్లక్ష్యం చేస్తే మైగ్రేన్ ముప్పే.. ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి మైగ్రేన్
ప్రతి 10 మంది పురుషుల్లో ఒకరికి మైగ్రేన్ పీడ
కొత్తగా అందుబాటులోకి సీజీఆర్పీ వంటి చికిత్సలు
‘సాక్షి’తో అమెరికాకు చెందిన ప్రముఖ న్యూరో నిపుణురాలు డెబోరా
సాక్షి, విశాఖపట్నం: పిల్లల్లోనూ పార్శ్వపు (మైగ్రేన్ హెడేక్) తలనొప్పి విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని యూఎస్‌కు చెందిన అంతర్జాతీయ న్యూరో నిపుణురాలు డాక్టర్ డెబోరా ఫ్రెడిమాన్ అన్నారు. విశాఖలో జరుగుతున్న ఇండియన్ అకాడెమీ ఆఫ్ న్యూరాలజీ (ఐయాన్‌కాన్)–2024 సదస్సులో కీలకోపన్యాసం చేసేందుకు వచ్చిన ఆమె ‘సాక్షి’తో మైగ్రేన్‌కు సంబంధించిన పరిశోధనలు, చికిత్సలపై ఆదివారం మాట్లాడారు. ఆమె ఏం చెప్పారంటే...
ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి..
15 నుంచి 40 ఏళ్లలోపు వారిలో మైగ్రేన్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా న్యూరో సమస్యలతో వచ్చే వంద మందిలో 40 మంది మైగ్రేన్ అని చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారు. ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు, ప్రతి 10 మంది పురుషుల్లో ఒకరికి మైగ్రేన్ ఉంది. గడచిన పదేళ్లలో మైగ్రేన్‌తో బాధపడే వారి సంఖ్య దాదాపు 80 శాతం పెరిగింది. ఇది కలవరపాటుకు గురిచేసే అంశం.
‘ఆరా’ రావడం వల్లే..
ప్రపంచ జనాభాలో 10 శాతం మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. వీరిలో 4 శాతం మందికి తలనొప్పి వచ్చే ముందు ‘ఆరా’ అనే అనుభవం ఉంటోంది. కళ్లముందు మెరుపులు వచ్చినట్టు.. చుట్టూ బైర్లు కమ్మినట్లు, శరీరమంతా మొద్దుబారిన భావనకు గురవుతున్నారు. దీన్నే ఆరా అని పిలుస్తున్నాం. ఈ ఆరా ద్వారానే మైగ్రేన్‌కు మంచి చికిత్సల్ని తీసుకురాగలుగుతున్నాం. దాదాపు 20 ఏళ్లుగా మైగ్రేన్‌పై పరిశోధనలు చేస్తున్నాను. మెదడులో ఉండే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్‌ఎఫ్) అనే ద్రవం అలల మాదిరిగా కదులుతూ మెదడులోని మలినాల్ని శుభ్రం చేస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ సీఎస్ఎఫ్లోకి సమస్యాత్మక ప్రోటీన్స్ వచ్చినప్పుడు ఆరా మొదలై.. మైగ్రేన్ అనుభవం ఏర్పడుతుంది. ఈ ఆరాకు కారణమవుతున్న ప్రోటీన్లను అడ్డుకునేలా మందులు కనిపెట్టాం. ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నాం.
ఒత్తిడికి దూరంగా ఉండాలి
మైగ్రేన్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా కనిపించడం లేదు. 25 శాతం మంది మాత్రమే మైగ్రేన్‌ని ముందస్తుగా గుర్తించగలుగుతున్నారు. మైగ్రేన్ వచ్చినప్పుడు ప్రారంభంలోనే గుర్తించి వైద్యుల్ని సంప్రదిస్తే.. దానికి తగినట్లుగా మందులు వాడుతుంటే.. క్రమంగా నివారించగలం. మైగ్రేన్‌కు సరైన చికిత్స లేదు. కానీ.. ఇటీవల కాలంలో సీజీఆర్‌పీ వంటి కొత్త చికిత్సలతో పాటు లాస్మిడిటన్, ట్రిప్టాన్స్ వంటి మందులు అందుబాటులోకి రావడంతో మైగ్రేన్ అటాక్స్‌ని తగ్గించగలుగుతున్నాం. అయితే.. జీవనశైలిలో మార్పులు రావాలి. సమయానికి నిద్ర,మంచి ఆహారం, నీరు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం ద్వారానే మైగ్రేన్‌ని నియంత్రించగలం.
చిన్నారులూ బాధితులే
మరో బాధాకరమైన విషయమేమిటంటే.. మైగ్రేన్‌కు చిన్నారులూ బాధితులుగా మారుతున్నారు. ప్రతి 100 మంది చిన్నారుల్లో 20 మంది దీనిబారిన పడుతున్నారు. బాలికలతో పోలిస్తే బాలురులో ఎక్కువగా ఇది కనిపిస్తోంది. తమకు తలనొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పినా.. వాళ్లు నమ్మడం లేదు. స్కూల్ ఎగ్గొట్టేందుకు చెబుతున్న కుంటిసాకులుగానే తీసుకుంటున్నారు. ఇదే ప్రమాదకరంగా మారుతోంది. తేలిగ్గా తీసుకుంటే మైగ్రేన్ ముప్పుగా మారుతుందన్న విషయం తల్లిదండ్రులు గుర్తించాలి. యుక్తవయసులో మాత్రం ఇది అమ్మాయిల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment