నవ్వింత: గొర్రెతోక బెత్తెడేమోగానీ... బర్రెతోక బారెడు కదా! | Buffalo's tail more long better than Sheep tail | Sakshi
Sakshi News home page

నవ్వింత: గొర్రెతోక బెత్తెడేమోగానీ... బర్రెతోక బారెడు కదా!

Published Sun, Jun 15 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

నవ్వింత: గొర్రెతోక బెత్తెడేమోగానీ...  బర్రెతోక బారెడు కదా!

నవ్వింత: గొర్రెతోక బెత్తెడేమోగానీ... బర్రెతోక బారెడు కదా!

బర్రె అనగానే హుర్రే అని ఆనందంతో కేకవేయాలన్నంత ఉత్సాహం నాకు.  కర్రెగా ఉంది కాబట్టి బర్రెకు పెద్దగా ఎవరూ గ్లామర్‌ను ఆపాదించలేదుగానీ... బర్రె పాలను తొర్రిపళ్ల మధ్యగా జుర్రే ప్రతివాడూ దాన్ని ప్రతిరోజూ ప్రార్థించాలి. నెత్తిన పెట్టుకు పూజించాలి.
 ఎందుకోగానీ... ఆవుతో పోలిస్తే బర్రె మనకు పుర్రచెయ్యిలాంటిదే. అదే నేనైతేనా నా కథే వేరు. ‘మునుమును పుట్టె నాకొక ముద్దుల పట్టి... మువ్వలూచే ఆ తువ్వాయికి పాలిచ్చి రివ్వున వచ్చేస్తా... అప్పటి వరకూ నువ్వు వేచి ఉండమం’టూ పులిని రిక్వెస్ట్ చేసే సత్తెకాలపు ఆవు దేవత కథను నేనే గనక రాసి ఉంటే, ఆవుకు బదులుగా బర్రెనే కథనాయకురాలిని చేసి కథ నడిపించి ఉండేవాణ్ణి. ‘ఏడుతరాలు’ రాసిన అలెక్స్ హేలీ మాటేమోగానీ... ‘పాలవరాలు’ అంటూ ఎన్నెన్నో తరాల నుంచి ఆ నల్లజాతి జీవులు చేస్తున్న సేవల గురించి రాసి శాశ్వతకీర్తి గడించేవాణ్ణి.
 
 బర్రెలంటే నాకున్న ఇష్టం కొద్దీ... పైగా కాసిన్ని రోజులు గేదెలు కాసిన అనుభవం కొద్దీ వాటికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు లోకానికి వెల్లడి చేయ్యకపోతే నాకు మనశ్శాంతి ఉండదు, నా బతుక్కు నిష్కృతి ఉండదు. ‘ఇంటిముందు గాదె... ఇంటెనకాల గేదె’ ఉంటే ఇక దరిద్రం అన్నది ఆ ఇంటికే కాదు.. పక్కింటి కాంపౌండు వాల్ పరిసరాలక్కూడా రాదు. తక్కువ జీతాన్ని పోల్చాలంటే  గొర్రెతోకతో పోలుస్తారు. కానీ... పెద్దమొత్తపు వేతనాన్ని బర్రెతోకతో హాయిగా పోల్చవచ్చు. ఎందుకంటే గొర్రెతోక బెత్తెడేమోగానీ బర్రెతోక బారెడు కదా.
 
 కుడితికి విడిచిన వేళ బర్రెను చూస్తేనే ఓ ఆనందం. అదో అద్భుత అనుభవం. తాడు విప్పీ విప్పగానే మన బర్రె కాస్తా ఒలింపిక్స్‌లో వంద మీటర్ల పరుగు పందెంలో పాల్గొనే నల్లజాతి క్రీడాకారిణిలా పరుగుపెడుతుంది. కుడితి గాబులో ముట్టెముంచి కూల్‌డ్రింక్‌లాగా దాన్ని పీల్చేసి... సుదీర్ఘకాలం తర్వాత ముట్టెబయటకు తీయగానే పొరపాటున కూడా మనం దానికి దగ్గరగా ఉండకూడదు. ఎందుకంటే... తృప్తితో బుస్సుమంటూ నిట్టూర్చే దాని ఊపిరి వల్ల మనం కుడితిగాబులో పడ్డ ఎలకలా కాకుండా... కుడితి జల్లులో తడిసిన పిల్లిగా మారిపోతాం. అందుకే ఆ సమయంలో దానికి ఎంత దూరంలో ఉంటే అంత మేలు. కుడితి గాబు నుంచి ముట్టె ఎత్తాక దాని చుట్టూ ఏర్పడ్డ కుడితి వలయాన్ని చూస్తూ ఉంటుందీ.... అబ్బ అచ్చం విశ్వసుందరి కిరీటభారంతో ఏర్పడ్డ కరోనా మచ్చలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇక అది గాబు దగ్గర్నుంచి తిరిగి కొట్టానికి వచ్చేటప్పుడు ఆ వంద మీటర్ల పరుగుపందెం క్రీడాకారిణి కాస్తా... మారథాన్ మహరాణిలా బరువుగా నడుస్తుంది. ఒడుపుగా కదులుతుంది. పొదుగుతో ఒదుగుతుంది.
 
 బిడ్డ అంటూ పుడితే మగబిడ్డయితే మేలనే మన మానవ లోకం కంటే గేదెల ప్రపంచమే మేలు. అక్కడ బర్రెకు దున్నకుర్ర కాకుండా ఆడదూడ పుట్టాలని ప్రతివారూ కోరుకుంటారు. గేదెల లోకంలోనే స్కానింగ్ సౌకర్యం ఉంటే అసలు దున్నపోతును చూసే అదృష్టం ఈ మానవాళికి ఉంటుందా అని నాకో సందేహం. అదీ గేదెల పాలమహిమ. మనుషుల పాపాల మహిమ. అప్పట్లో రాజుల కాలంలో బర్రెలకు కొంత సామాజిక గౌరవం లభించి ఉండిందని నా పరిశీలనతో తేలిన అభిప్రాయం. ఎందుకంటే పట్టపురాణిని పట్టమహిషి అని పిలిచేవారంటే మహిషానికి గౌరవమిచ్చారని అర్థమా లేక మహారాణి పాడిగేదెలాంటిదనే అభిప్రాయామా అన్న విషయంపై ఇదమిత్థంగా నేనో నిర్ధారణకు రాలేదుగానీ... బర్రెలకు ఎంతోకొంత గుర్తింపూ, గౌరవం దక్కాయన్న తృప్తి మాత్రం నాకుంది.
 
 నేను గేదెల్ని కాసే రోజుల్లో తరచి చూస్తే బర్రెలకూ, హీరోయిన్లకూ ఒక దగ్గరి పోలిక కనిపించేది. ఏ వాగుకో, చెరువుకో వాటిని కొట్టుకుపోయి, అక్కడ వాటిని నీళ్లలోకి  వదిలాక ఇక వాటిని చూస్తే బాత్‌టబ్బులో ఉన్న హీరోయిన్‌ను చూసినట్టే అనిపించేది. ఇక వాటిని ఇంటికి తోలుకొచ్చే సమయంలోనూ వాటి నడక చూడాలీ... మాటలుండవు. అన్నీ చూపులే.
 
 కొద్ది దూరం వయ్యారంగా నడిచి, తోటివి వస్తున్నాయో రావడంలేదో అన్నట్లుగా ఒకచోట ఠక్కున ఆగి వెనక్కు చూసి, మళ్లీ ముందుకుసాగిపోయే గేదెల్ని చూస్తే... అచ్చం ర్యాంపుపై నడిచే మోడల్ని చూసినట్టే ఉంటుంది. అందుకే నా మట్టుకు నేను ర్యాంపుపై నడిచే మోడళ్ల నడకను క్యాట్ వాక్ అనడం కంటే బఫెలో బ్యాష్ అనడం బాగుంటుందేమో అన్నది వ్యక్తిగత అభిప్రాయం. ఆ పిల్లినడకలూ, మన పెళ్లినడకల కంటే... ఎందుకోగానీ, బరువుగా నడిచే బర్రెనడకలే బహుముచ్చటగా ఉంటాయి.
 
 బాదరాయణ సంబంధం అన్న మాట లాగే ఈలోకంలో ప్రతివాడిదీ గేదెరాయణబంధం. ఎందుకంటే ప్రతివాడూ అప్పుడో ఇప్పుడో ఏం ఖర్మ... ఆ  మాటకొస్తే ప్రతిరోజూ గేదెపాలు తాగుతాడు. పాలు తాగనని చెప్పేవాడు కూడా ఏ టీయో, కాఫీనో ఆస్వాదిస్తాడు. అదీ కాదంటే ఐస్‌క్రీమ్ తినని వాడంటూ ఎవడూ ఉండడు కదా. అందుకే ఈ గేదెరాయణ బంధం కొద్దీ లోకంలోని ప్రతివాడిదీ సోదరాయణ సంబంధమే. అందుకే ప్రతిరోజూ అసలు ప్రతిజ్ఞ తర్వాత స్కూల్లో విద్యార్థులతో ‘గేదెమాతల్లి మన మాతృమూర్తి. బర్రెపాలు తాగినవారందరూ మన సహోదరులు’ అని కొత్త ప్రతిజ్ఞ ఒకటి చేయిస్తే మంచిదని నా సూచన.
 - యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement