Buffallows
-
స్వీమ్మింగ్ పూలో జలకాలాడుతున్న గేదలు
-
గేదెలపై పెద్దపులి పంజా
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో రెండు రోజులుగా పులి బీభత్సం సృష్టిస్తోంది. ఈ మేరకు మండలంలోని ఒడిపిలవంచ సమీపంలో ఓ ఆవుదూడను చంపిన పెద్దపులి.. తాజాగా ఆ గ్రామానికి సమీపంలోని వీరాపూర్ అటవీ ప్రాంతంలో గేదెల గుంపుపై దాడి చేసి దున్నను ఎత్తుకెళ్లింది. గుమ్మాళ్లపల్లికి చెందిన ఓదేలు అనే పశువుల కాపరి అదే గ్రామానికి చెందిన పలువురు రైతుల గేదెలను మేత కోసం సమీపంలోని వీరాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. గేదెలు మేత మేస్తున్న క్రమంలో హఠాత్తుగా పులి గేదెల గుంపుపైకి దూసుకువచ్చినట్లు పశువుల కాపరి తెలిపాడు.పులి దాడిని గమనించి ఓదేలు భయంతో గ్రామంలోకి పరుగులు తీశాడు. జరిగిన సంఘటనపై ప్రజాప్రతినిధుల ద్వారా అటవీశాఖ అధికారులు, పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. డీఎస్పీ బోనాల కిషన్, సీఐ రంజిత్‌రావు, ఎఫ్డీఓ వజ్రారెడ్డి, ఎఫ్ఆర్వో స్వాతి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గేదెల మందలోనుంచి రాజయ్య అనే రైతుకు చెందిన దున్నపోతును పులి ఎత్తుకెళ్లినట్లు ఓదేలు చెప్పాడు. ఘటనా స్థలంలో రక్తం మరకలు, పులి పాదాల గుర్తులను అధికారులు సేకరించారు. పులి ఆచూకీని గుర్తించడానికి అటవీశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా, పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని డీఎస్పీ బోనాల కిషన్, అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు సూచించారు. -
బర్రె మీదొచ్చి ఎన్నికల నామినేషన్
-
జాతి భేదాన్ని మరిచి..
సాక్షి, నాగార్జునసాగర్ : జాతి భేదాన్ని మరిచి గేదెలతో కోతి సహవాసం చేస్తూ జీవనం సాగిస్తుంది. మండలంలోని పోతునూరు గ్రామానికి చెందిన యాసాల వెంకటేశ్వర్రావు ఇంట్లోకి రెండు నెలల క్రితం కోతి పిల్ల వచ్చింది. అది ఇంటి పరిసరాలలోనే ఉంటూ గేదెలతో సహవాసం చేస్తూ వాటితో మమేకమైపోయింది. ఇలా పది రోజుల తర్వాత యజమాని వెంకటేశ్వర్రావు పశుగ్రాసం కోసం గేదెలను మేపడానికి వ్యవసాయ పొలాలకు తోలుకుపోతున్నా కోతి గేదెపై ఎక్కి వాటి వెంటే వచ్చింది. అప్పటి నుంచి రాత్రి సమయంలో ఇంటి ఆవరణలోని వేపచెట్టుపై నిద్రించటం, ఉదయం గేదెల వెంట పొలాలకు వెళ్లడం పరిపాటిగా మారింది. కోతిని గేదెలు కూడా ఏమీ అనడం లేదు. వెంకటేశ్వర్రావు కుటుంబ సభ్యులు కూడా కోతికి తినుబండారాలు ఇచ్చి ఆదరిస్తున్నారు. -
విద్యుదాఘాతంతో భారీ అగ్ని ప్రమాదం
శీతనపల్లి (కైకలూరు): విద్యుదాఘాతంతో మండలంలోని శీతనపల్లి గ్రామంలో సోమవారం మూడు తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. సుమారు రూ.10 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. బొర్రా పేర్రాజు, బొర్రా నాగమల్లేశ్వరీ, గోకనబోయిన చక్రవర్తి కుటుంబాలు పక్కపక్కనే తాటాకు ఇళ్లలో నివసిస్తున్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు పేర్రాజు ఆయన భార్య సామ్రాజ్యంతో నివసిస్తున్నారు. భర్త మరణించడంతో నాగమల్లేశ్వరి ఒంటరిగా ఉంటుంది. చక్రవర్తి పొలం పనులు చేస్తుండగా, భార్య మంగమ్మ పాఠశాలలో ఆయాగా పనిచేస్తుంది. విద్యుత్ షార్టు సర్కూట్ వల్ల ముందుగా చక్రవర్తి ఇంట్లో మంటలు రేగాయి. వృద్ధుడైన పేర్రాజును అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. అదే విధంగా నాగమల్లేశ్వరి మంటలు చూసి బయటకు పరుగులు తీసింది. చక్రవర్తి గొడ్లసావిడ వద్ద రెండు పాడి గేదెలు, ఒక పడ్డా అగ్నికీలకల్లో చిక్కుకున్నాయి. గ్రామస్తులు వాటి కట్లు విప్పారు. అప్పటికే వాటి శరీరం భారీగా కాలింది. సమీపంలోని కొబ్బరిచెట్లు ఆకులు మండలకు కాలిపోయాయి. రెండు గ్యాస్ సిలిండర్లు భారీ శబ్ధంతో పేలాయి. అగ్నిమాపక సిబ్బంది ఒక సిలిండరును పేలకుండా అదుపు చేశారు. అగ్నికీలలు పెరగడంతో బొర్రా మురళీ, నీలపాల రామచంద్రరావు ఇళ్ల అద్దాలు పగిలాయి. కైకలూరు అగ్నిమాపక అధికారి జీవీ రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలు అదుపు చేశారు. సర్పంచ్ కట్టా శ్రీనివాసరావు, వార్డు సభ్యులు పరమేశ్వరరావు, గ్రామ పెద్దలు బాధితులను పరామర్శించారు. గ్రామ ప్రత్యేకాధికారి అరుణ్‌కుమార్ వివరాలు సేకరించారు. పంచాయతీ, రెవెన్యూ అధికారులు బాధితుల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం బాధితులను అదుకోవాలన్నారు. -
గేదె గొంతులో ఇరుకున్న తాటిముట్టెలు
చేజర్ల : మండలంలోని గాలిపాళెంలో కామాటి వెంకటేశ్వర్లుకు చెందిన గేదె తాటిముట్టెలు తినింది. అయితే అవి గొంతు భాగంలో ఇరుక్కుపోయాయి. దీంతో అది అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. మంగళవారం గుర్తించిన యజమాని వెంటనే చేజర్ల పశువైద్యులు డాక్టర్ మురళీకష్ణారెడ్డి, పెళ్లేరు పశువైద్యులు డాక్టర్ Mýష్ణమోహన్లకు సమాచారం అందించారు. వారొచ్చి కొనప్రాణంతో ఉన్న గేదెకు మూడుగంటల పాటు శస్త్ర చికిత్స చేసి తాటిముట్టెలను బయటకు తీశారు. దీంతో గేదెకు ప్రాణాపాయం తప్పింది. -
మంత్రిగారి గేదెలు స్పెషలా?
ఉత్తరప్రదేశ్‌లోని బరియాపూర్‌కు చెందిన మనోజ్‌కుమార్ పాండేకు చెందిన ఎద్దును ఎవరో దొంగిలించారు. తానెంతో ఇష్టంగా చూసుకునే ఎద్దు కనిపించకపోయేసరికి మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడువారాలైనా ఎలాంటి ప్రయోజనం లేదు. పోలీసుల తీరుపై చిర్రెత్తుకొచ్చిన మనోజ్ ఓ వినూత్న ఆలోచన చేశాడు. ‘యూపీ సీనియర్ మంత్రి అజంఖాన్ గేదెలు పోతే 24 గంటల్లోగా వెతికితెస్తారు. నా ఎద్దు పోతే 24 రోజులైనా స్పందించరా? ఇదేం న్యాయం’ అంటూ ప్రశ్నిస్తూ పోస్టర్లను ముద్రించి బరియాపూర్‌లో పలుచోట్ల వేశాడు. 2014 ఫిబ్రవరిలో అజంఖాన్‌కు చెందిన ఏడు గేదెలు అపహరణకు గురైతే విధుల్లో నిర్లక్ష్యం వహించారని ముగ్గురు పోలీసులను కూడా సస్పెండ్ చేశారట. 24 గంటల్లో వాటిని వెతికిపట్టుకున్నారు. సామాన్యుడికో న్యాయం... మంత్రికో న్యాయమా అని మనోజ్ వేసిన పోస్టర్లు స్థానికుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించాయి. అందరూ వీటిని ఆసక్తిగా చదవడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. మంత్రిగారి ఫోటోను మార్ఫింగ్ చేసి అవమానించారని మనోజ్‌పై కేసు పెట్టారు. -
పాడి పశువుల ఎంపికలో జాగ్రత్తలు...
పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్‌బాబు వర్గల్: పాడి పశువులు రైతుకు జీవనోపాధిగా నిలుస్తున్నాయి. పాడి కోసం అనువైన ఆవులు, గేదెలను ఎంపిక చే సుకున్నపుడే తగిన పాల దిగుబడి సాధించవచ్చు. వ్యవసాయంతోపాటు పాడి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని వర్గల్ మండల పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ రమేష్‌బాబు సూచించారు. పాల దిగుబడికి ఉపయుక్తంగా ఉండే పశు జాతులు, నాణ్యమైన పాడి పశువు లక్షణాలను ఆయన వివరించారు. సంకర జాతి ఆవుల విషయంలో హోలిస్టయిన్ ఫ్రీజియన్, జెర్సీ జాతులకు మన వాతావరణాన్ని తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. ఇవి అధిక పాలసారతో రైతుకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెడతాయన్నారు. గేదెల విషయంలో ముర్రా, సూర్తీ, నాగపురి, జఫ్రాబాది, గ్రేడెడ్ జాతులు ఇక్కడి వాతావరణానికి అనుకూలమని వివరించారు. మంచి పాడి పశువుల లక్షణాలు... ూ పశువు ఆరోగ్యవంతమైనదై ఉండాలి. ూ శరీరం నిండుగా ఉండాలి. ూ గేదె లేదా ఆవును వెనుకనుంచి చూసినా ముందు నుంచి చూసినా త్రిభుజాకారంలో కనిపించాలి. ూ పొదుగు పెద్దదిగా ఉండాలి. పాలు తీసిన తరువాత ముడుచుకుపోవాలి. ూ నాలుగు చన్నులు చతురస్త్రాకారంగా ఉండాలి. అన్ని చన్నుల నుంచి పాలు వస్తుండాలి. ూ పాడికి పనికి వచ్చే పశువును ఎంపిక చేసుకున్న తర్వాత కనీసం వరుసగా మూడు రోజులు ఉదయం, సాయంత్రం పాల దిగుబడి పరీరక్షించిన తరువాత కొనుగోలు చేయాలి. సాగులో సమస్యలపై ఫోన్ ఇన్ నేడు సంగారెడ్డి రూరల్: పంటల సాగు, ఎరువుల వాడకంలో రైతులకు సూచనలు, సలహాలు అందించేందుకు జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గురువారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 7గంటల నుంచి 9 వరకు అన్నదాతలు తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. సాగులో ఎదుర్కొం టున్న సమస్యలపై ఫోన్ ఇన్ ద్వారా శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులను నుంచి తగిన సమాధానాలు పొందవచ్చన్నారు. ఫోన్ చేయాల్సిన నంబర్ 08455-278272. సమాచారం మెదక్ డీఈ దుర్గామహేశ్వరరావు 9440813625 మెదక్ ఏడీ రామచంద్రయ్య 9440813652 మెదక్ రూరల్- 1 ఏఈ తిరుపతయ్య 9440813676 మెదక్ రూరల్- 2 ఏఈ శ్రీనివాస్‌రావు 9440813335 వరిలో ఎర్ర, పసుపు మచ్చలు ప్రశ్న: వరి నాటి వారం రోజులైతంది. శేనుపై ఎర్రటి, పసుపు రంగు కనిపిస్తున్నయ్. దీని నివారణకు ఏం చేయాలో తెలియజేయండి. - అంజిరెడ్డి, జిన్నారం, ఫోన్: 9963831117 జవాబు: సూక్ష్మధాతు లోపం వల్ల వరి పంటపై ఇలాంటి రంగు గల మచ్చలు వస్తాయి. వీటి నివారణకు రెండున్నర గ్రాముల జింక్ సల్ఫేట్‌ను ఒక లీటర్ నీటిలో కలిపి పంటకు సరిపోయే మేర పిచికారీ చేయాలి. లేదా 4 గ్రాముల ఫార్ములా-4 మందును ఒక లీటర్ నీటిలో కలిపి స్పే చేయాలి. ఇలా చేయటం వల్ల వరిపై ఎర్రటి, పసుపురంగు గల మచ్చలు తొలగిపోతాయి. - సాల్మన్‌నాయక్, ఏఓ జిన్నారం, సెల్: 8886612477 -
నవ్వింత: గొర్రెతోక బెత్తెడేమోగానీ... బర్రెతోక బారెడు కదా!
బర్రె అనగానే హుర్రే అని ఆనందంతో కేకవేయాలన్నంత ఉత్సాహం నాకు. కర్రెగా ఉంది కాబట్టి బర్రెకు పెద్దగా ఎవరూ గ్లామర్‌ను ఆపాదించలేదుగానీ... బర్రె పాలను తొర్రిపళ్ల మధ్యగా జుర్రే ప్రతివాడూ దాన్ని ప్రతిరోజూ ప్రార్థించాలి. నెత్తిన పెట్టుకు పూజించాలి. ఎందుకోగానీ... ఆవుతో పోలిస్తే బర్రె మనకు పుర్రచెయ్యిలాంటిదే. అదే నేనైతేనా నా కథే వేరు. ‘మునుమును పుట్టె నాకొక ముద్దుల పట్టి... మువ్వలూచే ఆ తువ్వాయికి పాలిచ్చి రివ్వున వచ్చేస్తా... అప్పటి వరకూ నువ్వు వేచి ఉండమం’టూ పులిని రిక్వెస్ట్ చేసే సత్తెకాలపు ఆవు దేవత కథను నేనే గనక రాసి ఉంటే, ఆవుకు బదులుగా బర్రెనే కథనాయకురాలిని చేసి కథ నడిపించి ఉండేవాణ్ణి. ‘ఏడుతరాలు’ రాసిన అలెక్స్ హేలీ మాటేమోగానీ... ‘పాలవరాలు’ అంటూ ఎన్నెన్నో తరాల నుంచి ఆ నల్లజాతి జీవులు చేస్తున్న సేవల గురించి రాసి శాశ్వతకీర్తి గడించేవాణ్ణి. బర్రెలంటే నాకున్న ఇష్టం కొద్దీ... పైగా కాసిన్ని రోజులు గేదెలు కాసిన అనుభవం కొద్దీ వాటికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు లోకానికి వెల్లడి చేయ్యకపోతే నాకు మనశ్శాంతి ఉండదు, నా బతుక్కు నిష్కృతి ఉండదు. ‘ఇంటిముందు గాదె... ఇంటెనకాల గేదె’ ఉంటే ఇక దరిద్రం అన్నది ఆ ఇంటికే కాదు.. పక్కింటి కాంపౌండు వాల్ పరిసరాలక్కూడా రాదు. తక్కువ జీతాన్ని పోల్చాలంటే గొర్రెతోకతో పోలుస్తారు. కానీ... పెద్దమొత్తపు వేతనాన్ని బర్రెతోకతో హాయిగా పోల్చవచ్చు. ఎందుకంటే గొర్రెతోక బెత్తెడేమోగానీ బర్రెతోక బారెడు కదా. కుడితికి విడిచిన వేళ బర్రెను చూస్తేనే ఓ ఆనందం. అదో అద్భుత అనుభవం. తాడు విప్పీ విప్పగానే మన బర్రె కాస్తా ఒలింపిక్స్‌లో వంద మీటర్ల పరుగు పందెంలో పాల్గొనే నల్లజాతి క్రీడాకారిణిలా పరుగుపెడుతుంది. కుడితి గాబులో ముట్టెముంచి కూల్డ్రింక్లాగా దాన్ని పీల్చేసి... సుదీర్ఘకాలం తర్వాత ముట్టెబయటకు తీయగానే పొరపాటున కూడా మనం దానికి దగ్గరగా ఉండకూడదు. ఎందుకంటే... తృప్తితో బుస్సుమంటూ నిట్టూర్చే దాని ఊపిరి వల్ల మనం కుడితిగాబులో పడ్డ ఎలకలా కాకుండా... కుడితి జల్లులో తడిసిన పిల్లిగా మారిపోతాం. అందుకే ఆ సమయంలో దానికి ఎంత దూరంలో ఉంటే అంత మేలు. కుడితి గాబు నుంచి ముట్టె ఎత్తాక దాని చుట్టూ ఏర్పడ్డ కుడితి వలయాన్ని చూస్తూ ఉంటుందీ.... అబ్బ అచ్చం విశ్వసుందరి కిరీటభారంతో ఏర్పడ్డ కరోనా మచ్చలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇక అది గాబు దగ్గర్నుంచి తిరిగి కొట్టానికి వచ్చేటప్పుడు ఆ వంద మీటర్ల పరుగుపందెం క్రీడాకారిణి కాస్తా... మారథాన్ మహరాణిలా బరువుగా నడుస్తుంది. ఒడుపుగా కదులుతుంది. పొదుగుతో ఒదుగుతుంది. బిడ్డ అంటూ పుడితే మగబిడ్డయితే మేలనే మన మానవ లోకం కంటే గేదెల ప్రపంచమే మేలు. అక్కడ బర్రెకు దున్నకుర్ర కాకుండా ఆడదూడ పుట్టాలని ప్రతివారూ కోరుకుంటారు. గేదెల లోకంలోనే స్కానింగ్ సౌకర్యం ఉంటే అసలు దున్నపోతును చూసే అదృష్టం ఈ మానవాళికి ఉంటుందా అని నాకో సందేహం. అదీ గేదెల పాలమహిమ. మనుషుల పాపాల మహిమ. అప్పట్లో రాజుల కాలంలో బర్రెలకు కొంత సామాజిక గౌరవం లభించి ఉండిందని నా పరిశీలనతో తేలిన అభిప్రాయం. ఎందుకంటే పట్టపురాణిని పట్టమహిషి అని పిలిచేవారంటే మహిషానికి గౌరవమిచ్చారని అర్థమా లేక మహారాణి పాడిగేదెలాంటిదనే అభిప్రాయామా అన్న విషయంపై ఇదమిత్థంగా నేనో నిర్ధారణకు రాలేదుగానీ... బర్రెలకు ఎంతోకొంత గుర్తింపూ, గౌరవం దక్కాయన్న తృప్తి మాత్రం నాకుంది. నేను గేదెల్ని కాసే రోజుల్లో తరచి చూస్తే బర్రెలకూ, హీరోయిన్లకూ ఒక దగ్గరి పోలిక కనిపించేది. ఏ వాగుకో, చెరువుకో వాటిని కొట్టుకుపోయి, అక్కడ వాటిని నీళ్లలోకి వదిలాక ఇక వాటిని చూస్తే బాత్‌టబ్బులో ఉన్న హీరోయిన్ను చూసినట్టే అనిపించేది. ఇక వాటిని ఇంటికి తోలుకొచ్చే సమయంలోనూ వాటి నడక చూడాలీ... మాటలుండవు. అన్నీ చూపులే. కొద్ది దూరం వయ్యారంగా నడిచి, తోటివి వస్తున్నాయో రావడంలేదో అన్నట్లుగా ఒకచోట ఠక్కున ఆగి వెనక్కు చూసి, మళ్లీ ముందుకుసాగిపోయే గేదెల్ని చూస్తే... అచ్చం ర్యాంపుపై నడిచే మోడల్ని చూసినట్టే ఉంటుంది. అందుకే నా మట్టుకు నేను ర్యాంపుపై నడిచే మోడళ్ల నడకను క్యాట్ వాక్ అనడం కంటే బఫెలో బ్యాష్ అనడం బాగుంటుందేమో అన్నది వ్యక్తిగత అభిప్రాయం. ఆ పిల్లినడకలూ, మన పెళ్లినడకల కంటే... ఎందుకోగానీ, బరువుగా నడిచే బర్రెనడకలే బహుముచ్చటగా ఉంటాయి. బాదరాయణ సంబంధం అన్న మాట లాగే ఈలోకంలో ప్రతివాడిదీ గేదెరాయణబంధం. ఎందుకంటే ప్రతివాడూ అప్పుడో ఇప్పుడో ఏం ఖర్మ... ఆ మాటకొస్తే ప్రతిరోజూ గేదెపాలు తాగుతాడు. పాలు తాగనని చెప్పేవాడు కూడా ఏ టీయో, కాఫీనో ఆస్వాదిస్తాడు. అదీ కాదంటే ఐస్‌క్రీమ్ తినని వాడంటూ ఎవడూ ఉండడు కదా. అందుకే ఈ గేదెరాయణ బంధం కొద్దీ లోకంలోని ప్రతివాడిదీ సోదరాయణ సంబంధమే. అందుకే ప్రతిరోజూ అసలు ప్రతిజ్ఞ తర్వాత స్కూల్లో విద్యార్థులతో ‘గేదెమాతల్లి మన మాతృమూర్తి. బర్రెపాలు తాగినవారందరూ మన సహోదరులు’ అని కొత్త ప్రతిజ్ఞ ఒకటి చేయిస్తే మంచిదని నా సూచన. - యాసీన్ -
తపాలా: పేడ శాంపిల్
నేను 1968లో విశాఖపట్నంలో జిల్లాకోర్టు పక్కనున్న పశువుల హాస్పిటల్లో డాక్టర్‌గా పనిచేసేవాణ్ని. నక్కపల్లి నుండి కొత్తగా బదిలీ మీద వచ్చాను. రోజూ పాడి ఆవులు, గేదెలు, కుక్కలు వైద్యానికి వచ్చేవి. అప్పటికి పశువుల డాక్టర్‌గా నా అనుభవం నాలుగేళ్లే! నాతో పాటు ముగ్గురు కాంపౌండర్లు, నలుగురు అటెండర్లు పనిచేసేవాళ్లు. హాస్పిటల్ పక్కన ఎత్తులో ల్యాబరేటరీ ఉండేది. ఇప్పుడూ అక్కడే ఉంది. బ్లడ్ శాంపిల్స్, పేడ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్, రోగ నిర్ధారణకోసం పంపేవాళ్లం. ఒకరోజు ఆనందపురం దగ్గర నుండి అనుకొంటా, ఒక రైతు- పేరు నాయుడు- వచ్చి, ఎంతో బేల ముఖంతో ‘‘డాక్టరుబాబు, నాకు రెండు గేదెలున్నాయి. మా కుటుంబం అంతా దానిమీద బతుకుతున్నాం. అవి రెండూ గడ్డి తినడం లేదు! తెగ పారేస్తున్నాయి. మా ముసలిదానికీ, నాకూ గంజి నీళ్లు లేవు. నా ఇద్దరు కొడుకులు బడికి వెళ్లకుండా బిక్కు బిక్కుమంటూ ఇంటి దగ్గర ఉండిపోనారు. నానేటి చేయాలి బాబూ,’’ అన్నాడు. గేదెలు ఉపశమనానికి మందు ఇచ్చి, ‘‘ఏమయ్యా నాయుడూ! రేపు వచ్చేటప్పుడు రెండు గేదెల పేడ తీసుకొనిరా. పేడలోని దోషమేమైనా ఉంటే పరీక్ష చేయాలి,’’ అన్నాను. మరుసటి రోజున ఆ రైతు కావిడితో రెండు గేదెలూ రోజంతా వేసిన పేడ కావిడితో వచ్చాడు. ఒక పక్కన తాటాకుల బుట్ట, రెండో పక్కన గోనెతో మూట కట్టిన మొత్తం పేడ! నేను అప్పటికి స్నానం చేస్తున్నా అనుకొంటా. మా ఆవిడ ఆ రైతుని చూసి ఏదో బెల్లం బుట్ట తెచ్చాడేమో అనుకొందట. ఆయనకు మంచినీళ్లిచ్చి, ‘డాక్టరుగారు వస్తారు’ అని చెప్పిందట. ఈలోపు నేను రావడం, నాయుడు పేడ కావిడి గురించి చెప్పడం, నేనూ మా ఆవిడా నవ్వుకోవడం జరిగింది. ఈలోపున నా పక్క క్వార్టర్స్‌లో ఉన్న రామారావు- స్టాక్‌మెన్ కాంపౌండర్ రావటం, విషయం తెలుసుకొని, అందరితోపాటు ఒకటే నవ్వు. ఇదంతా ఎందుకు జరిగిందీ అంటే, నేను పేడ శాంపిల్ తెమ్మని చెప్పకుండా, రెండు గేదెలు వేసిన పేడ తెమ్మనడం వలన జరిగిన పొరపాటు. సామాన్యంగా పేడ శాంపిల్స్ అగ్గిపెట్టెలోగానీ, కాగితంలోగానీ పది గ్రాములు తెస్తే సరిపోతుంది. ఆ రోజు వైద్యానికి వచ్చినవాళ్లు నాయుడుని చూసి నవ్వటమే! నన్ను చూసీ నవ్వడమే! తదుపరి నాకు ఓపీ అయిపోగానే నా స్కూటరు మీద నాయుడును ఎక్కించుకుని, ఆనందపురం వెళ్లటమూ, ఆ రెండు గేదెలకూ మందివ్వడమూ జరిగింది. నాయుడు తెచ్చిన శాంపిల్స్ ల్యాబ్‌లో పరీక్ష చేసి, కడుపులో జలగల మూలంగా ఆ వ్యాధి వచ్చిందని నిర్ధారించాం. దానికి విరుగుడుగా ఏవలోధీన్ అనే మందు ఇవ్వటం జరిగింది. రైతులు ఎంత అమాయకంగా ఉంటారో, అంత మంచివాళ్లు కూడా. నేను విశాఖపట్టణంలో ఉన్న మూడు సంవత్సరాలూ ఆ రైతు వచ్చి కాయగూరలు ఇచ్చివెళ్లేవాడు. ఇది ఇప్పటికీ ఎప్పటికీ నేను మరువలేని విషయం. - డా॥రెడ్డిపల్లి సీతన్న నాయుడు విశాఖపట్నం గుడిలో భోజనాలు పెడతార్లే! మా మనవడి పేరు అశుతోష్. అంటే అల్ప సంతోషి, భోళా శంకరుడు. వాడికి అన్నీ సందేహాలే! తెల్లారి లేచింది మొదలు ప్రశ్నలు వేస్తూనేవుంటాడు. ‘‘సూర్యుడు పొద్దున్నే ఎందుకు వస్తాడు?’’ ‘‘పక్షులు ఎందుకు అరుస్తాయి?’’ ‘‘టీవీ ఎలా చేస్తారు?’’ ఇక వాడి చేష్టలు ఎలా ఉంటాయంటే, ఒకరోజు, ‘నాన్నా! నువ్వు ఆఫీస్‌కి వెళ్లొ’ద్దని తలుపు వేశాడు. ‘అరేయ్! వెళ్లకపోతే అడుక్కుతినాల్సొస్తుందిరా’ అని వాళ్ల నాన్న జవాబిచ్చాడు. దానికి వాడు, ‘ఏం భయం లేదు నాన్నా. మా స్కూల్ ముందు సాయిబాబా గుడిలో భోజనాలు పెడతారు; అప్పడాలు, ఐస్‌క్రీమ్ కూడా వేస్తారు’ అని సమాధానమిచ్చాడు. పై పోర్షన్లో ఉన్న కుటుంబం దగ్గరికి వాడు వెళ్తుంటాడు. వాళ్లని వేధిస్తున్నాడేమోనని ‘ఎందుకురా వాళ్లనలా చంపుతావ్. ఇక రా’ అంటే, ‘ఇంకాసేపు చంపనీ ఆంటీ’ అంటుంటారు వాళ్లు. ‘మా ఇంట్లోకి ఇంకా అశుతోష్ రాలేదండీ’ అంటుంటారు పక్కవాళ్లు. మా అల్లరి మనవడిని అందరూ ఇలా ముద్దు చేస్తుంటారు. - కందేపు లక్ష్మి లాంగ్రామం, గుంటూరు ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com