కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో రెండు రోజులుగా పులి బీభత్సం సృష్టిస్తోంది. ఈ మేరకు మండలంలోని ఒడిపిలవంచ సమీపంలో ఓ ఆవుదూడను చంపిన పెద్దపులి.. తాజాగా ఆ గ్రామానికి సమీపంలోని వీరాపూర్ అటవీ ప్రాంతంలో గేదెల గుంపుపై దాడి చేసి దున్నను ఎత్తుకెళ్లింది. గుమ్మాళ్లపల్లికి చెందిన ఓదేలు అనే పశువుల కాపరి అదే గ్రామానికి చెందిన పలువురు రైతుల గేదెలను మేత కోసం సమీపంలోని వీరాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు.
గేదెలు మేత మేస్తున్న క్రమంలో హఠాత్తుగా పులి గేదెల గుంపుపైకి దూసుకువచ్చినట్లు పశువుల కాపరి తెలిపాడు.పులి దాడిని గమనించి ఓదేలు భయంతో గ్రామంలోకి పరుగులు తీశాడు. జరిగిన సంఘటనపై ప్రజాప్రతినిధుల ద్వారా అటవీశాఖ అధికారులు, పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. డీఎస్పీ బోనాల కిషన్, సీఐ రంజిత్‌రావు, ఎఫ్‌డీఓ వజ్రారెడ్డి, ఎఫ్‌ఆర్వో స్వాతి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
గేదెల మందలోనుంచి రాజయ్య అనే రైతుకు చెందిన దున్నపోతును పులి ఎత్తుకెళ్లినట్లు ఓదేలు చెప్పాడు. ఘటనా స్థలంలో రక్తం మరకలు, పులి పాదాల గుర్తులను అధికారులు సేకరించారు. పులి ఆచూకీని గుర్తించడానికి అటవీశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా, పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని డీఎస్పీ బోనాల కిషన్, అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment