తపాలా: పేడ శాంపిల్ | Cattels Dung Sample to send for disease investigation | Sakshi
Sakshi News home page

తపాలా: పేడ శాంపిల్

Published Sun, May 11 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

తపాలా: పేడ శాంపిల్

తపాలా: పేడ శాంపిల్

నేను 1968లో విశాఖపట్నంలో జిల్లాకోర్టు పక్కనున్న పశువుల హాస్పిటల్లో డాక్టర్‌గా పనిచేసేవాణ్ని. నక్కపల్లి నుండి కొత్తగా బదిలీ మీద వచ్చాను. రోజూ పాడి ఆవులు, గేదెలు, కుక్కలు వైద్యానికి వచ్చేవి. అప్పటికి పశువుల డాక్టర్‌గా నా అనుభవం నాలుగేళ్లే! నాతో పాటు ముగ్గురు కాంపౌండర్లు, నలుగురు అటెండర్లు పనిచేసేవాళ్లు. హాస్పిటల్ పక్కన ఎత్తులో ల్యాబరేటరీ ఉండేది. ఇప్పుడూ అక్కడే ఉంది. బ్లడ్ శాంపిల్స్, పేడ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్, రోగ నిర్ధారణకోసం పంపేవాళ్లం. ఒకరోజు ఆనందపురం దగ్గర నుండి అనుకొంటా, ఒక రైతు- పేరు నాయుడు- వచ్చి, ఎంతో బేల ముఖంతో ‘‘డాక్టరుబాబు, నాకు రెండు గేదెలున్నాయి. మా కుటుంబం అంతా దానిమీద బతుకుతున్నాం. అవి రెండూ గడ్డి తినడం లేదు! తెగ పారేస్తున్నాయి. మా ముసలిదానికీ, నాకూ గంజి నీళ్లు లేవు. నా ఇద్దరు కొడుకులు బడికి వెళ్లకుండా బిక్కు బిక్కుమంటూ ఇంటి దగ్గర ఉండిపోనారు. నానేటి చేయాలి బాబూ,’’ అన్నాడు.
 
 గేదెలు ఉపశమనానికి మందు ఇచ్చి, ‘‘ఏమయ్యా నాయుడూ! రేపు వచ్చేటప్పుడు రెండు గేదెల పేడ తీసుకొనిరా. పేడలోని దోషమేమైనా ఉంటే పరీక్ష చేయాలి,’’ అన్నాను. మరుసటి రోజున ఆ రైతు కావిడితో రెండు గేదెలూ రోజంతా వేసిన పేడ కావిడితో వచ్చాడు. ఒక పక్కన తాటాకుల బుట్ట, రెండో పక్కన గోనెతో మూట కట్టిన మొత్తం పేడ! నేను అప్పటికి స్నానం చేస్తున్నా అనుకొంటా. మా ఆవిడ ఆ రైతుని చూసి ఏదో బెల్లం బుట్ట తెచ్చాడేమో అనుకొందట. ఆయనకు మంచినీళ్లిచ్చి, ‘డాక్టరుగారు వస్తారు’ అని చెప్పిందట. ఈలోపు నేను రావడం, నాయుడు పేడ కావిడి గురించి చెప్పడం, నేనూ మా ఆవిడా నవ్వుకోవడం జరిగింది. ఈలోపున నా పక్క క్వార్టర్స్‌లో ఉన్న రామారావు- స్టాక్‌మెన్ కాంపౌండర్ రావటం, విషయం తెలుసుకొని, అందరితోపాటు ఒకటే నవ్వు.
 
 ఇదంతా ఎందుకు జరిగిందీ అంటే, నేను పేడ శాంపిల్ తెమ్మని చెప్పకుండా, రెండు గేదెలు వేసిన పేడ తెమ్మనడం వలన జరిగిన పొరపాటు. సామాన్యంగా పేడ శాంపిల్స్ అగ్గిపెట్టెలోగానీ, కాగితంలోగానీ పది గ్రాములు తెస్తే సరిపోతుంది. ఆ రోజు వైద్యానికి వచ్చినవాళ్లు నాయుడుని చూసి నవ్వటమే! నన్ను చూసీ నవ్వడమే!
 
 తదుపరి నాకు ఓపీ అయిపోగానే నా స్కూటరు మీద నాయుడును ఎక్కించుకుని, ఆనందపురం వెళ్లటమూ, ఆ రెండు గేదెలకూ మందివ్వడమూ జరిగింది. నాయుడు తెచ్చిన శాంపిల్స్ ల్యాబ్‌లో పరీక్ష చేసి, కడుపులో జలగల మూలంగా ఆ వ్యాధి వచ్చిందని నిర్ధారించాం. దానికి విరుగుడుగా ఏవలోధీన్ అనే మందు ఇవ్వటం జరిగింది.
 రైతులు ఎంత అమాయకంగా ఉంటారో, అంత మంచివాళ్లు కూడా. నేను విశాఖపట్టణంలో ఉన్న మూడు సంవత్సరాలూ ఆ రైతు వచ్చి కాయగూరలు ఇచ్చివెళ్లేవాడు. ఇది ఇప్పటికీ ఎప్పటికీ నేను మరువలేని విషయం.
 - డా॥రెడ్డిపల్లి సీతన్న నాయుడు
 విశాఖపట్నం
 
 గుడిలో భోజనాలు పెడతార్లే!
 మా మనవడి పేరు అశుతోష్. అంటే అల్ప సంతోషి, భోళా శంకరుడు. వాడికి అన్నీ సందేహాలే! తెల్లారి లేచింది మొదలు ప్రశ్నలు వేస్తూనేవుంటాడు. ‘‘సూర్యుడు పొద్దున్నే ఎందుకు వస్తాడు?’’ ‘‘పక్షులు ఎందుకు అరుస్తాయి?’’ ‘‘టీవీ ఎలా చేస్తారు?’’ ఇక వాడి చేష్టలు ఎలా ఉంటాయంటే, ఒకరోజు, ‘నాన్నా! నువ్వు ఆఫీస్‌కి వెళ్లొ’ద్దని తలుపు వేశాడు. ‘అరేయ్! వెళ్లకపోతే అడుక్కుతినాల్సొస్తుందిరా’ అని వాళ్ల నాన్న జవాబిచ్చాడు. దానికి వాడు, ‘ఏం భయం లేదు నాన్నా. మా స్కూల్ ముందు సాయిబాబా గుడిలో భోజనాలు పెడతారు; అప్పడాలు, ఐస్‌క్రీమ్ కూడా వేస్తారు’ అని సమాధానమిచ్చాడు. పై పోర్షన్‌లో ఉన్న కుటుంబం దగ్గరికి వాడు వెళ్తుంటాడు. వాళ్లని వేధిస్తున్నాడేమోనని ‘ఎందుకురా వాళ్లనలా చంపుతావ్. ఇక రా’ అంటే, ‘ఇంకాసేపు చంపనీ ఆంటీ’ అంటుంటారు వాళ్లు. ‘మా ఇంట్లోకి ఇంకా అశుతోష్ రాలేదండీ’ అంటుంటారు పక్కవాళ్లు. మా అల్లరి మనవడిని అందరూ ఇలా ముద్దు చేస్తుంటారు.
 - కందేపు లక్ష్మి
 లాంగ్రామం, గుంటూరు
 
 ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు,
 మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి.
 మా చిరునామా: తపాలా, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1,
 రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34.  funday.sakshi@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement