
‘ఆశా’ పోస్టును వేలంలో అమ్మిన పెద్దలు
సంతబోమ్మాళి: శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మాళి మండలం లక్కివలస పంచాయతీ గెద్దలపాడు తీరప్రాంత గ్రామంలో సోమవారం గ్రామ పెద్దలు దారుణ నిర్ణయానికి పాల్పడ్డారు. ఓ ఆశావర్కర్ తాము చెప్పినట్టు నడుచుకోలేదని ఆమె కుటుంబాన్ని వెలివేశారు. 19 మంది సభ్యులతో కూడిన గ్రామ పెద్దలు ఏం చెబితే అక్కడ అదే వేదంగా నడుస్తోంది. బోరుభద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గెద్దలపాడులో చంద్రమ్మ ఆశా వర్కర్‌గా 2014 నుంచి పనిచేస్తోంది.
ఇటీవల గ్రామంలోని ఆశ వర్కర్, అంగన్‌వాడీ పోస్టులకు గ్రామ పెద్దలు వేలం నిర్వహించారు. ఆ మేరకు డబ్బులు ఇచ్చిన వారికి ఆ పోస్టులను అమ్మేశారు. అంగన్‌వాడీ కార్యకర్త పోస్టును రూ.2 లక్షలకు ఓ మహిళ దక్కించుకుంది. దీంతో అప్పటి వరకూ పనిచేస్తున్న హరిదేవితో రాజీనామా చేయించారు. ఆశా వర్కర్ పోస్టునూ రూ.1.90 లక్షలకు వేలంలో అమ్మేశారు.
అయితే ప్రస్తుత ఆశా వర్కర్ చంద్రమ్మ రాజీనామా చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో ఎవరూ మాట్లాడకూడదని, వారికి ఎవరూ సాయం చేయకూడదని, శుభకార్యాలకు వెళ్లకూడదని గ్రామ పెద్దలు హుకుం జారీ చేశారు. దీన్ని ఎవరు అతిక్రమించినా తగిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. దీంతో చంద్రమ్మ మంగళవారం యూనియన్‌తో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment