సోషల్ మీడియా పోస్టుల కేసులో మేజిస్ట్రేట్ కోర్టు తీరును ఆక్షేపించిన హైకోర్టు
సెక్షన్ 111 కింద నేరం చేశారనేందుకు దర్యాప్తు అధికారి ఆధారాలు చూపలేదు
మేజిస్ట్రేట్ మాత్రం ఆధారాలున్నాయంటూ రిమాండ్ విధించారు
111 కింద కేసుకు నిందితునిపై ఒకటి కంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై ఉండాలి
అందులో కనీసం ఒక చార్జిషీట్‌నైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలి
అలాంటిదేమీ లేకపోయినా రిమాండ్ ఇచ్చారు
పోలీసులు అరెస్ట్‌కు కారణాలనూ చెప్పలేదు
అయినా రిమాండ్ రిపోర్ట్‌పై మేజిస్ట్రేట్ సంతృప్తి వ్యక్తం చేశారన్న ధర్మాసనం
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 111 కింద పోలీసులు పెడుతున్న కేసుల్లో నిందితులకు మేజిస్ట్రేట్ కోర్టులు యాంత్రికంగా రిమాండ్ విధిస్తుండటాన్ని హైకోర్టు ఆక్షేపించింది. దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడు బీఎన్‌ఎస్ సెక్షన్ 111 కింద నేరం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలను చూపకపోయినా మేజిస్ట్రేట్ మాత్రం ఆ సెక్షన్ కింద నేరం చేశారనేందుకు ఆధారాలున్నాయని రిమాండ్ ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం తెలిపింది.
మేజిస్ట్రేట్ మెదడు ఉపయోగించకుండా, లోపభూయిష్టంగా ఉత్తర్వులిస్తున్నారని తేల్చి చెప్పింది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకటరమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేసి అతన్ని విడుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ పప్పుల చెలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి, తీర్పు రిజర్వ్ చేసింది. ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో మేజిస్ట్రేట్ కోర్టు తీరును తప్పుపట్టింది.
ఓ వ్యక్తిపై సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే, అతనిపై గత పదేళ్లలో ఒకటికంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై, వాటిలో ఒకదానినైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత కేసులో నిందితుడిపై గత పదేళ్లలో కేసులు నమోదయినట్లు గానీ, చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు గానీ దర్యాప్తు అధికారి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించలేదంది. అలాగే బీఎన్‌ఎస్ సెక్షన్ 47 కింద దర్యాప్తు అధికారి నిందితునికి ఇచి్చన నోటీసులో అరెస్ట్‌కు కారణాలను పేర్కొన్నట్లు మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో తెలిపారని, వాస్తవానికి అరెస్ట్‌కు కారణాలను దర్యాప్తు అధికారి పేర్కొనలేదని తెలిపింది.
అయినప్పటికీ దర్యాప్తు అధికారి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌పై మేజిస్ట్రేట్ సంతృప్తి వ్యక్తం చేశారంది. మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించడమే కాక, కనీసం నోటీసులో పేర్కొన్న అరెస్ట్‌కు కారణాలను నిందితునికి రాతపూర్వకంగా ఇచ్చారా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించలేదని ఆక్షేపించింది. మేజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వుల్లో ఈ రెండు లోపాల కారణంగా ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌కు విచారణార్హత ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో మాత్రం నిందితుని అరెస్ట్‌కు నిర్దిష్ట కారణాలు స్పష్టంగా పేర్కొన్నారని తెలిపింది. అందువల్ల ప్రస్తుత కేసులో నిందితుని అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించలేమంది. అందువల్ల అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. పిటిషనర్ లేదా నిందితుడు వారికి చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment