
మేజిస్ట్రేట్ల తీరుపై హైకోర్టు ఆక్షేపణ.. సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో ఈ వైఖరి
ఫిర్యాదులో లేని అంశాలపై కేసుల నమోదు..
వాటిని పూర్తిగా పరిశీలించ కుండానే రిమాండ్ విధింపా?
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తుండటాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఫిర్యాదులో లేని అంశాల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి, నిందితులను రిమాండ్ కోసం హాజరు పరుస్తున్న సమయంలో మేజిస్ట్రేట్‌లు పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండానే రిమాండ్ విధించడం సరికాదని అభిప్రాయపడింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్, మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్ అరెస్ట్ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
ఈ కేసులో అన్ని అంశాలను లోతుగా పరిశీలిస్తామంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు తన తండ్రి ప్రేమ్‌కుమార్‌ను అక్రమంగా నిర్భంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొరిటిపాటి అభియన్ గత ఏడాది హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. అభినయ్ తరఫు న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం కాలరాస్తున్నారన్నారు. ఈ వ్యాజ్యం పరిధిని విస్తృతం చేసి పోలీసులను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
వ్యంగ్యం కూడా నేరమైంది..
ప్రేమ్‌కుమార్ అరెస్ట్ విషయంలో పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత ఉదయం 8 గంటలకు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు చూపారని మహేశ్వరరెడ్డి తెలిపారు. ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారో అప్పుడే అరెస్ట్ చేసినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వ పెద్దలపై వ్యంగ్యంగా విమర్శలు చేసినందుకే కేసులు పెట్టారని, వ్యంగ్యం కూడా నేరం కావడం ఇప్పుడే చూస్తున్నామన్నారు.
ప్రేమ్‌కుమార్ బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డారంటూ పోలీసులు కేసు పెట్టారని, వాస్తవానికి ఫిర్యాదులో అందుకు సంబంధించి ఎలాంటి ఆరోపణ లేదన్నారు. మేజి్రస్టేట్ ఈ విషయాన్ని పట్టించుకోకుండా రిమాండ్ విధించారన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది.
సమగ్ర పరిశీలన చేయకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు జారీ చేయడం సబబు కాదని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment