Magistrate Court
-
మేజిస్ట్రేట్ చాలా యాంత్రికంగా వ్యవహరించారు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 111 కింద పోలీసులు పెడుతున్న కేసుల్లో నిందితులకు మేజిస్ట్రేట్ కోర్టులు యాంత్రికంగా రిమాండ్ విధిస్తుండటాన్ని హైకోర్టు ఆక్షేపించింది. దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడు బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద నేరం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలను చూపకపోయినా మేజిస్ట్రేట్ మాత్రం ఆ సెక్షన్ కింద నేరం చేశారనేందుకు ఆధారాలున్నాయని రిమాండ్ ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం తెలిపింది. మేజిస్ట్రేట్ మెదడు ఉపయోగించకుండా, లోపభూయిష్టంగా ఉత్తర్వులిస్తున్నారని తేల్చి చెప్పింది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకటరమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేసి అతన్ని విడుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ పప్పుల చెలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి, తీర్పు రిజర్వ్ చేసింది. ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో మేజిస్ట్రేట్ కోర్టు తీరును తప్పుపట్టింది. ఓ వ్యక్తిపై సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే, అతనిపై గత పదేళ్లలో ఒకటికంటే ఎక్కువ చార్జిషీట్లు దాఖలై, వాటిలో ఒకదానినైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత కేసులో నిందితుడిపై గత పదేళ్లలో కేసులు నమోదయినట్లు గానీ, చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు గానీ దర్యాప్తు అధికారి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించలేదంది. అలాగే బీఎన్ఎస్ సెక్షన్ 47 కింద దర్యాప్తు అధికారి నిందితునికి ఇచి్చన నోటీసులో అరెస్ట్‌కు కారణాలను పేర్కొన్నట్లు మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో తెలిపారని, వాస్తవానికి అరెస్ట్‌కు కారణాలను దర్యాప్తు అధికారి పేర్కొనలేదని తెలిపింది. అయినప్పటికీ దర్యాప్తు అధికారి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌పై మేజిస్ట్రేట్ సంతృప్తి వ్యక్తం చేశారంది. మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించడమే కాక, కనీసం నోటీసులో పేర్కొన్న అరెస్ట్‌కు కారణాలను నిందితునికి రాతపూర్వకంగా ఇచ్చారా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించలేదని ఆక్షేపించింది. మేజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వుల్లో ఈ రెండు లోపాల కారణంగా ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌కు విచారణార్హత ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో మాత్రం నిందితుని అరెస్ట్‌కు నిర్దిష్ట కారణాలు స్పష్టంగా పేర్కొన్నారని తెలిపింది. అందువల్ల ప్రస్తుత కేసులో నిందితుని అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించలేమంది. అందువల్ల అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. పిటిషనర్ లేదా నిందితుడు వారికి చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలని తెలిపింది. -
రవిప్రకాశ్‌పై కేసు ఉపసంహరణ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: నిధుల దుర్వినియోగం, ఫోర్జరీలకు పాల్పడ్డారంటూ టీవీ9 మాజీ డైరెక్టర్ రవిప్రకాశ్‌పై నమోదైన కేసు ఉపసంహరణకు అనుమతించిన కూకట్‌పల్లిలోని మేజి్రస్టేట్ కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పి.కౌశిక్ రావు హైకోర్టును ఆశ్రయించారు. రవి ప్రకాశ్‌పై కేసు ఉపసంహరణకు రాష్ట్ర ప్రభుత్వం 2024, మార్చి 15న జీవో 158 జారీ చేసింది. దీని ఆధారంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెమో దాఖలు చేయగా, కూకట్పల్లి కోర్టు తీర్పునిచి్చంది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కౌశిక్‌రావు కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ వేణుగోపాల్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘రవిప్రకాశ్‌పై క్రిమినల్ కేసును మార్చిలో ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీని ఆధారంగా అనుమతిస్తూ మేజి్రస్టేట్ ఉత్తర్వులు జారీ చేయడం చట్టవిరుద్ధం. కేసు పూర్వాపరాలను, ఇతర అంశాలను పరిశీలించకుండానే ఉత్తర్వుల జారీ సరికాదు. క్రిమినల్ కేసు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు?.. కారణాలు ఏమైనా ఉన్నాయా?.. లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వం కేసును ఉపసంహరించుకోవడంతో పడే ప్రభావాన్ని, చార్జిషీట్లోని ఆధారాలను, సాక్షుల స్టేట్మెంట్లను పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదు. మేజి్రస్టేట్ కూడా ఎలాంటి కారణాలను పేర్కొనకుండా మెమోను అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. రవిప్రకాశ్.. నిందితుడిగా ఫోర్జరీ పత్రాలు సృష్టించడం, మోసానికి పాల్పడటం లాంటి పనులు చేశారని సాక్షులు వాంగ్మూలంలో పేర్కొ న్నారు. యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేయకూడదన్న సత్యాన్ని మేజి్రస్టేట్ పాటించలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుని మేజిస్ట్రేట్ కోర్టు ఇచి్చన ఉత్తర్వులను రద్దు చేయాలి’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వం, రవిప్రకాశ్, సొంటినేని శివాజీ, జె. కనకరాజు, జె. తేజవర్మ, మహేశ్ గాం«దీకి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 5కి వాయిదా వేశారు. -
అప్పుడేదో వ్యంగ్యం ప్రదర్శించా అంతే: రాహుల్ గాంధీ
‘‘నీరవ్.. లలిత్.. నరేంద్ర మోదీ.. ఇలా ఈ దొంగలంతా ఒకే ఇంటిపేరుతో ఉండడం ఎలా?’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెర మీదకు వచ్చాయి. ఆ టైంలో రాహుల్‌కి వ్యతిరేకంగా పరువు నష్టం దావా వేశాడు ఓ బీజేపీ నేత. ఈ కేసుకు సంబంధించి గురువారం సూరత్ కోర్టులో ప్రత్యక్షంగా హాజరైన రాహుల్.. మేజిస్ట్రేట్ ముందు తన చివరి స్టేట్మెంట్ ఇచ్చారు. సూరత్: తనకు వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం దావా కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తుది వాంగ్మూలం ఇచ్చారు. ‘‘నేను ఏ కమ్యూనిటీని లక్క్ష్యంగా చేసుకుని ఆ కామెంట్ చేయలేదు. కేవలం ఆ సమయానికి వ్యంగ్యం ప్రదర్శించా అంతే. అంతకుమించి నాకేం గుర్తులేదు’’ అని రాహుల్ కోర్టుకు తెలియజేశారు. కాగా, ఈ కేసులో స్వయంగా హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని వారం క్రితమే రాహుల్‌ను మేజిస్ట్రేట్ ఏఎన్ దవే ఆదేశించారు. ఇక ఇరువర్గాల స్టేట్మెంట్స్ రికార్డు పూర్తి కావడంతో జులై 12 నుంచి ఈ కేసులో కోర్టులో వాదనలు జరగనున్నాయి. కాగా, 2019లో కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఏప్రిల్13న కోలార్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ తన ప్రసంగంలో పై వ్యాఖ్యలు చేశాడు. అయితే మోదీ ఇంటిపేరుతో ఉన్నవాళ్లంతా దొంగలే అని అర్థం వచ్చేలా రాహుల్ మాట్లాడాడని, ప్రధానిని అగౌరవపరిచారని, తన పరువుకూ భంగం కలిగిందని చెబుతూ బీజేపీ నేత పూర్ణేష్ మోదీ, రాహుల్‌పై దావా వేశాడు. ఈ కేసులో 2019 అక్టోబర్‌లోనే రాహుల్ ఇంతకు ముందు హాజరై.. ఆరోపణల్ని నమోదు చేయొద్దని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని కోర్టును అభ్యర్థించారు కూడా. చదవండి: ఆత్మనిర్భర్ అంటే..:రాహుల్ గాంధీ -
ఇమ్రాన్‌పై కేసు నమోదు
పట్నా : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై బిహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టులో శనివారం కేసు నమోదైంది. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో ఇమ్రాన్ ఖాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ముజఫర్‌పూర్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ర్టేట్ కోర్టులో న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా కేసు నమోదు చేశారు. ఇమ్రాన్ తన ప్రసంగంలో భారత్‌పై అణుయుద్ధం దిశగా బెదిరింపు వ్యాఖ్యలు చేశారని తన ఫిర్యాదులో ఓజా పేర్కొన్నారు. తన ఫిర్యాదు ఆధారంగా ఇమ్రాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో దేశంలో మత సామరస్యం దెబ్బతినేలా పాక్ ప్రధాని వ్యాఖ్యానించారని తన పిటిషన్లో ఓజా ప్రస్తావించారు. మరోవైపు ఇమ్రాన్ ప్రసంగంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్ అంతర్జాతీయ వేదికపై కశ్మీర్లో పరిస్ధితులపై మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టింది. ఐరాస ప్రసంగంలో భాగంగా ఇమ్రాన్ వ్యాఖ్యలను భారత నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. -
భర్తపై తప్పుడు కేసు పెట్టిన భార్యకు..
సాక్షి, ఆత్మకూరు(కర్నూలు): భర్తపై తప్పుడు కేసు పెట్టిన ఓ భార్యకు రూ.3 వేల జరిమానా విధిస్తూ ఆత్మకూరు జూనియర్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. తన భర్త శ్రీనివాసులు రెండో విహహం చేసుకుని, ఆమె ద్వారా పిల్లలు కన్నారంటూ ఆత్మకూరు పట్టణానికి చెందిన మంగళి గౌరిదేవి 2014లో కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేసింది. ఐదేళ్ల అనంతరం తన వద్ద సరైన ఆధారాలు లేవని చెప్పడంతో ఇన్చార్జ్ మెజిస్ట్రేట్ ఫకృద్దీన్ గురువారం కేసును కొట్టివేశారు. సాక్ష్యాధారాలు లేకుండా నిరాధారమైన కేసును కోర్టు ముందుకు తెచ్చి, కోర్టు సమయాన్ని, ప్రతివాదుల సమయాన్ని వృథా చేసినందుకు మంగళి గౌరిదేవి రూ.3,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించలేకపోతే 15 రోజులు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. -
భూమాపై నాన్‌బెయిలబుల్ వారెంట్
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 2015 మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో భూమా నాగిరెడ్డి, డీఎస్పీ దేవదానంకు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భూమా డీఎస్పీని కులం పేరుతో దూషించారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరస్టయిన భూమా బెయిల్ మీద బయటకు వచ్చారు. కాగా, కోర్టు కేసు విచారణకు దాదాపు రెండుమార్లు గైర్హాజరయ్యారు. సోమవారం మరోసారి విచారణకు రాకపోవడంతో మేజిస్ట్రేట్ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. -
సుజనా తదితరులకు కోర్టు సమన్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఆయనకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ తమను రూ.106 కోట్ల మేరకు మోసం చేశారంటూ మారిషన్ కమర్షియల్ బ్యాంక్(ఎంసీబీ) దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదుపై ఇక్కడి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు స్పందించింది. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ జి.శ్రీనివాసరాజు, డెరైక్టర్ సందెపూడి హనుమంతరావు, నాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుజనా చౌదరి తదితరులకు సమన్లు జారీ చేసింది. మార్చి 5న వ్యక్తిగతంగా హాజరు కావాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డానీ రూత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
లా విద్యార్థుల రాస్తారోకో
తిరువళ్లూరు: చెన్నైలో ఉన్న లా కళాశాలను కాంచీపు రం తిరువళ్లూరుకు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన లా విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా తిరువళ్లూరులోని మెజిస్ట్రేట్ కోర్టు వద్ద శుక్రవారం లా విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమానికి లా విద్యార్థుల కోఆర్డినేటర్ జార్జిముల్లర్ అద్యక్షత వహించారు. రాస్తారోకో కార్యక్రమానికి తమిళనాడు, ఆంధ్ర లా విద్యార్థులు ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. జార్జిముల్లర్ మాట్లాడుతూ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం అంబేద్కర్ లా కళాశాలను తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాకు తరలించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న లా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు అంబేద్కర్ లా కళాశాల మార్పు నిర్ణయూన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాస్తారోకోతో దాదాపు 40 నిమిషాల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం కోర్టు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.