టీనేజ్ అగ్రెషన్: కోపస్త కిశోరాలు!
టీనేజ్... ఒక అద్భుతమైన దశ. మనం ఏం చేసినా అది చాలా కరక్ట్ అనుకునే దశ. ఆఖరికి మన ఆవేశం, కోపం కూడా. టీనేజ్ పిల్లల్లో దురుసుతనం, కోపం, ఆగ్రహం ఎలా, ఎందుకు పెల్లుబుకుతాయో, వాటిని ఎలా నియంత్రించాలో, సరైన దారిలో ఎలాపెట్టాలో తెలుసుకోవడం కోసం ఈ కథనం. ‘టీన్’ అంటే పదమూడు నుంచి పందొమ్మిదవ ఏటి వరకు ఉన్న దశ అన్నది అందరికీ తెలిసిందే. చిన్నవారు, పెద్దవారుగా మారే ఆ సంధి సమయంలో అంతా అయోమయంగా ఉంటుంది. కొత్తగా స్రవించే హార్మోన్లు వారిని కుదురుగా ఉండనివ్వవు. ఆ దశలో వారిలో కొత్తదశకు మారిపోయే క్రమంలో వారు కోరుకునే జీవనశైలి, వారి ఉత్సాహాలు, ఉద్రేకాలు, ఉద్వేగాలు వారు అనుకున్నట్లుగా తీరకపోతే వెంటనే వారిలో కోపతాపాలు, ఆగ్రహాలు పెల్లుబుకుతాయి. టీనేజ్ కోపాలు, ఆగ్రహాలు వాటి పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం.
అలా స్కూలింగ్ పూర్తి చేసుకుని, కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన టీనేజ్ పిల్లల ఆగ్రహాలు రకరకాలుగా ఉంటాయి. హింసాత్మకంగా మారే అవకాశమూ ఉంది. ఉదాహరణకు ర్యాగింగ్, గ్రూపులుగా గుంపుగట్టి ఒకరితో ఒకరు తలపడుతూ చేసే ఫైటింగ్స్ వంటివి. చిన్నచిన్న అంశాలకే గొడవలకు దిగడం, దాడులకు వెనకాడకపోవడం, విధ్వంసానికి పాల్పడాల్సి వచ్చినా విచక్షణతో ఆలోచించకపోవడం అన్నది మామూలే. అందుకే ఈ ఇతివృత్తంతో వచ్చిన సినిమాలు యూత్ ఆదరణతో సూపర్‌హిట్ అవుతాయి. అయితే ఆ దశలో ఉండే ఉత్సాహంతో చేసే కొన్ని విపత్కరమైన విన్యాసాలు చాలామంది అమాయకుల కెరీర్‌నే దెబ్బతీస్తాయి. అందుకే ఆ దశలో టీన్స్ పిల్లల్లోని ఆగ్రహాలను సరిగా ఛానలైజ్ చేయడం, ఆ కోపాన్ని సరైన దిశకు మళ్లించడం, వారి భవిష్యత్తుకు దోహదపడేదిగా తీర్చిదిద్దడం వారికి మేలు చేస్తుంది. (అంటే ఏదైనా లక్ష్యాన్ని రూపొందించుకుని, దాన్ని సాధించడానికి కసిగా వ్యవహరించడం వంటిదన్నమాట).
కారణాలేమిటి...?
యువత కోపంతో, ఆవేశంగా వ్యవహరించడానికి అనేక అంశాలు దోహదపడుతుంటాయి. జన్యుపరమైన కారణాల కంటే నేర్చుకునే ప్రక్రియ ద్వారానే ఎక్కువగా ఆగ్రహమూర్తులుగా తయారవుతారని సామాజిక మానసికశాస్త్రం చెబుతోంది.
తల్లిదండ్రుల నుంచే: పిల్లలు ఏ అంశాలనైనా మొదట తల్లిదండ్రులను అనుకరిస్తూ నేర్చుకుంటారు. కోపాన్ని, ఆగ్రహాన్ని, చిరాకును సైతం తల్లిదండ్రుల నుంచే మొదట నేర్చుకుంటారు. ఉదాహరణకు చిన్నప్పుడు తన తల్లిని తండ్రి నిత్యం చితకబాదుతూ ఉండే వాతావరణంలో ఎదిగినవారు, తరచూ తల్లిదండ్రులు పక్కింటివారితోనో లేదా ఆవేశంతో ఎవరితోనైనా తలపడటం సాధారణంగా జరిగే వాతావరణంలో ఉన్నవారు బాగా ఆగ్రహంగా వ్యవహరిస్తుంటారు. పరిసరాల నుంచి: తర్వాతి దశలో ఆగ్రహాలను పరిసరాల నుంచి అలవరచుకుంటారు. అందుకే నిత్యం గొడవలకు దిగే వాతావరణంలో ఉన్నచోట పెరిగే పిల్లలు అలా చేయడానికి వెనుకాడరు సరికదా, అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఉత్సాహంగా అందులో పాలుపంచుకుంటారు.
ఇటీవల కంప్యూటర్ గేమ్స్ నుంచి: పిల్లలు ఆడే కంప్యూటర్ ఆధారిత గేమ్స్‌లో హింస చాలా ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు వైస్ సిటీ, ఇలాంటి గేమ్స్‌లో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం హీరోలు ఎలాంటి హింసకైనా వెనకాడరు. తమ నాయకత్వ పటిమను చాటుకోవడం కోసం తీవ్రమైన హింసకు పాల్పడుతుంటారు. మంచికోసం విచక్షణారహితంగా ఎంతటి హింసకైనా పాల్పడవచ్చనే సందేశాన్నిచ్చే కార్యక్రమాలు టీనేజ్ పిల్లల్లో హింసాప్రవృత్తి తప్పుకాదనే భావనను పాదుగొలుపుతాయి.
టీనేజ్ దశలో వినే సంగీతం, అందులోని సాహిత్యం, వారు చూసే సినిమాల నుంచి: సాధారణంగా టీనేజ్ దశలో చూసే సినిమాలు, అందులో కథానాయకుడి లక్షణాలను తెలియజేసేందుకు రూపొందించే రాక్ మ్యూజిక్ తరహా సంగీతం, అందులో ధీరోదాత్త గుణాలను వర్ణిస్తూ అంతర్లీనంగా విధ్వంసాన్ని ప్రోత్సహించే సాహిత్యం సైతం హింసాప్రవృత్తిని పెంపొందిస్తుంది. ఆస్తులను ధ్వంసంచేసే ప్రవృత్తి, విధ్వంసకర ధోరణులను ప్రోత్సహిస్తుంది.
హింసాత్మక ధోరణులు పెంపొందించేలా చేసే అంశాలు
యుక్తవయసులోకి వస్తున్న పిల్లల్లో హింసాప్రవృత్తిని తప్పక పెంచగలవంటూ శాస్త్రీయ అధ్యయనాల ద్వారా నిరూపితమైన అంశాలివి...
బాల్యదశలో అత్యాచారానికి గురికావడం: చిన్నప్పుడు లైంగికంగా వేధింపులకు లేదా అత్యాచారానికి (సెక్సువల్ అబ్యూజ్) గురైన పిల్లలు పెద్దయ్యాక ఉగ్రధోరణికి అలవాటుపడతారని నిరూపితమైంది. గృహహింసకు గురికావడం, గృహహింస జరిగే వాతావరణంలో ఉండటం: కుటుంబసభ్యుల మధ్య ఎప్పుడూ సఖ్యత లేకుండా నిత్యం కీచులాడుకోవడంతో పాటు, భార్యాభర్తలు పోట్లాడుకునే వాతావరణంలో పెరిగే పిల్లలు చాలా ఆగ్రహమూర్తులవుతారు. గృహహింస జరిగే వాతావరణంలో పెరిగే పిల్లలు తమ యుక్తవయస్సులో దెబ్బకొట్టడం అన్న చర్యను చాలా సాధారణంగా పరిగణిస్తారు. అది శారీరకంగా, మానసికంగా అవతలివారిని బాధిస్తుందనే గ్రహింపు వారిలో ఎక్కువగా ఉండదు.
మాస్ మీడియా ప్రభావం: మన సినిమాలు, టీవీలు, మ్యాగజైన్లలో కనిపించే హింస సమాజామోదమైన అంశం గా కనిపిస్తుంది. ఫలితంగా టీనేజ్ పిల్లలు దాన్ని ఒక తీవ్రమైన అంశంగా పరిగణించరు. ఇది చాలా దురదృష్టకరమైన, ప్రమాదకరమైన ధోరణి. డ్రగ్స్, పొగతాగడం, ఆల్కహాల్ అలవాట్లు: అన్నిటికంటే ముఖ్యమైన, తీవ్రమైన అంశాలు డ్రగ్స్, పొగతాగడం, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లు. డ్రగ్స్ తీసుకునే వారిలో విచక్షణతో ఆలోచించే శక్తి పూర్తిగా మందగిస్తుంది. హింస వల్ల ఆ తర్వాత జరిగే విపత్కర పరిణామాలను ఆలోచించే శక్తి ఏమాత్రం ఉండదు. అందుకే డ్రగ్స్ హింసాత్మక ప్రవృత్తిని పెంపొందిస్తాయి. ఆల్కహాల్ కూడా అంతే. తాగి ఉన్న దశలో విచక్షణను మరచిపోవడంతో సభ్యసమాజంలో అంతకు మునుపు వారు చేయని పనులనే, తాగినప్పుడు ఏమాత్రం సంకోచం లేకుండా చేయగలుగుతారు. ఇక పొగతాగే అలవాటులోని కిక్ సరిపోదని భావించినప్పుడు యువతను డ్రగ్స్‌కు దగ్గర చేసేది సిగరెట్ లాంటి అలవాటే.
మరెన్నో అంశాలు: నేరుగా కాకపోయినా పరోక్షంగానైనా టీనేజ్ పిల్లలు ఉగ్రమూర్తులుగా మారడానికి దోహదపడే అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి... సామా జిక, ఆర్థిక పరిస్థితులు, తీవ్రమైన అణచివేత, కుటుంబ సంబంధాలు సరిగా లేకపోవడం, తల్లిదండ్రులిద్దరిలో ఒకరే సాకడం (సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్), నిరుద్యోగం, ఎవ్వరి నుంచీ సరైన ప్రోత్సాహం గాని, ఆదరణ గాని లభించకపోవడం (ల్యాక్ ఆఫ్ సపోర్ట్) వంటి అంశాలెన్నో యువతను హింస, ఆగ్రహం వంటి ధోరణుల వైపు మళ్లిస్తుంది.
పసిగట్టడం ఎలా?
టీనేజ్ పిల్లల్లో ఆగ్రహం ఎక్కువగా ఉండటం, చిన్న చిన్న విషయాలకే కోపంగా వ్యవహరించడం, తాము అనుకున్నదాన్ని సాధించుకోవడం కోసం ఇంట్లో హింసాత్మక చర్యలకు, తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడటం వంటి ధోరణులు కనిపిస్తూ ఉంటే ముందుగానే పసిగట్టి తగిన సమయంలోనే సైకాలజిస్ట్ / సైకియాట్రిస్ట్ సహాయం తీసుకుంటే వారిని ఎన్నో పెడధోరణుల నుంచి రక్షించి, కెరియర్ బాగుండేలా, సమాజంలో సరైన వ్యక్తిలా ఎదిగేలా చేయవచ్చు. టీనేజ్‌లోనే పిల్లల్లోని ఆగ్రహ ధోరణులను, హింసాత్మక ప్రవృత్తిని గుర్తుపట్టడానికి కొన్ని సూచనలివి...
మాటలు / భాష: పరుషమైన పదజాలం, అసభ్యంగా మాట్లాడటం, ఎదుటివారిని నిరుత్తరులను చేయడానికి బెదిరింపు ధోరణి లేదా ఎదురుతిరిగే ధోరణిని చెడ్డ మాటలతో వ్యక్తపరచడం.
ఉగ్రధోరణులతో వ్యవహరించిన గత చరిత్ర (హిస్టరీ ఆఫ్ అగ్రెషన్): గతంలో ఆపలేని కోపంతో వ్యవహరించిన సంఘటనల చరిత్ర కలిగి ఉండటం.
ఆయుధంతో సంచరించడం: ఏదైనా ఆయుధాన్ని దగ్గర ఉంచుకోడానికి ఉత్సాహం చూపడం, స్కూలు/కాలేజీకి వెళ్తున్నప్పుడూ ఆయుధాన్ని తీసుకెళ్లడం, ఎప్పుడూ కత్తి లేదా తుపాకి వంటి ఆయుధాలను ధరించి సంచరించడం.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన చరిత్ర ఉండటం : గతంలో ఏదైనా కోరికను నెరవేర్చుకోడానికి హింసాత్మకంగా వ్యవహరించి, అది విఫలమైన సందర్భంలో ఆత్మహత్యాయత్నానికి పూనుకున్న చరిత్ర ఉండటం.
బాధ్యతారహితంగా ఉండటం : బాధ్యతారహితంగా వ్యహరించడంతో పాటు, తన తప్పులను ఇతరులపైకి నెట్టడం, ఇతరులను నిందించడం వంటివి చేస్తారు. అయితే ఈ పనిని అందరూ ఏదో ఒక దశలో చేసినా, అది ‘నొప్పించక, తానొవ్వక, తప్పించుకోవడం’ కోసం అడపాదడపా చేసేవారు దీనికి మినహాయింపు. అయితే ఎప్పుడూ ఇదే ధోరణిని కలిగి ఉన్నవారి విషయంలో మాత్రం సైకియాట్రిస్ట్ /సైకాలజిస్ట్‌ను కలిసే జాగ్రత్తను తీసుకోవాలి.
అధిగమించడం ఎలా ?
పిల్లల్లో కోపాన్ని, ఆగ్రహ ధోరణులను తల్లిదండ్రులు చాలా చిన్న చిన్న జాగ్రత్తలతో సులభంగా నివారించవచ్చు. పిల్లలకు సంయమనాన్ని నేర్పవచ్చు.
కుటుంబ సబంధాలు పటిష్టంగా ఉంచుకునేలా చూడటం: తల్లిదండ్రులు తమ పిల్లలతో నాణ్యమైన సమయం గడపడం, వారిపట్ల ప్రేమతో వ్యవహరించడం ద్వారా.
ఓపికతో వివరించడం: ఏదైనా విషయంలో పిల్లలు ఆగ్రహంగా ప్రవర్తించినప్పుడు జరిగిన నష్టాలను ఓపిగ్గా వివరించడంతో పాటు ‘తన కోపమే తన శత్రువు’ అనే మాట ఎంత సరైనదో తమకు తెలిసిన ఉదాహరణలతో చెప్పడం. ఇకపై అలా చేయవద్దంటూ చెప్పడం. ఈ పనికి ఉపక్రమించినప్పుడు పెద్దలు ప్రేమతో చేయాలి. అంతేగాని కోపానికి కోపమే మందు కాదన్న విషయం గ్రహించాలి.
జీవనశైలిలో మార్పులు: ప్రతివారి జీవనశైలి ఎంతో కొంత క్రమశిక్షణతో, క్రమబద్ధంగా ఉండటం పనులన్నీ సక్రమంగా జరిగిపోవడం అన్నది సాఫీగా జరుగుతుంది. పనుల్లో అడ్డంకులు తగ్గడంతో కోపానికి గురయ్యే సందర్భాలూ తగ్గుతాయి.
ఒత్తిడిని పెంచే కోపం గురించి వివరించడం: కోపంలో వ్యక్తిపై ఒత్తిడి పెరిగి, అది తప్పులకు దారితీసే వైనాలను టీనేజర్లకు ఉదాహరణలతో వివరించడం వల్ల యుక్తవయస్కుల్లో కోపంతో పాటు దానివల్ల కలిగే ఒత్తిడి సైతం తగ్గుతుంది.
చెడు అలవాట్లకు లోనుకాకుండా చూడటం : యుక్తవయసులోకి ప్రవేశిస్తున్న పిల్లల గడపలో చెడు అలవాట్లు, వ్యసనాలు తప్పక అందుబాటులో ఉంటాయి. పిల్లలు యుక్తవయసులో ప్రవేశించే క్రమంలో ఆ గడప దాటే సమయంలో వారు చెడు అలవాట్లు అన్నవి ‘గడపను కొట్టుకున్నందున కలిగే గాయం’లా పరిణమించే అవకాశం ఉంది. అందుకే ఆ దశలో పిల్లలు ఆ తాకుడు దెబ్బకు గురికాకుండా చూసుకోవడం అన్నది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. టీనేజ్ పిల్లల్లోని కోపాన్ని తల్లిదండ్రులు సరిగా ఛానలైజ్ చేయగలిగితే వారి లక్ష్యసాధనకు అది బాగా ఉపయోగపడుతుంది.
- నిర్వహణ: యాసీన్