‘నువ్వు మాట్లాడకూడదు’ అని బెదిరింపులు ఎదుర్కొన్న అమ్మాయి గురించి ఇప్పుడు ప్రపంచం గొప్పగా మాట్లాడుకుంటోంది. ‘నువ్వు ఇంటికే పరిమితం కావాలి’ అనే అప్రకటిత నిషేధానికి గురైన అమ్మాయి గురించి..‘నీలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో ఉండాలి’ అంటున్నారు. అఫ్గానిస్థాన్‌కు చెందిన పదిహేడేళ్ల నీలా ఇబ్రహీమి ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్ (కిడ్స్ రైట్స్ ప్రైజ్) గెలుచుకుంది. మహిళలు, బాలికల హక్కుల కోసం బలంగా తన గొంతు వినిపించినందుకు నీలా
‘కిడ్స్ రైట్స్ ప్రైజ్’కు ఎంపికైంది....
‘కిడ్స్ రైట్స్’ ఫౌండేషన్ అందించే అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి మానవహక్కులు, సామాజిక న్యాయానికి సంబంధించి గణనీయమైన కృషిచేసిన వారికి ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా 47 దేశాల నుంచి 165 మంది నామినీల నుంచి గట్టి పోటీని అధిగమించి ఈ బహుమతికి ఎంపికైంది నీలా ఇబ్రహీమి.
‘నీలా ధైర్యసాహసాలకు ముగ్ధులం అయ్యాం’ అన్నారు ‘కిడ్స్ రైట్స్ ఫౌండేషన్’ ఫౌండర్ మార్క్ డల్లార్ట్.లింగ సమానత్వం, అఫ్గాన్ మహిళల హక్కుల పట్ల నీలా పాట, మాట ఆమె అంకితభావం, ప్రతిఘటనకు ప్రతీకలుగా మారాయి. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఊహించినట్లుగానే మహిళల హక్కులను కాలరాయడం మొదలుపెట్టారు.
ఆడపిల్లలు ప్రాథమిక పాఠశాలకు మించి చదువుకోకూడదు. మహిళలు మార్కులు, జిమ్, బ్యూటీ సెలూన్‌లకు వెళ్లడాన్ని నిషేధించారు. మహిళలు ఇల్లు దాటి బయటికి రావాలంటే పక్కన ఒక పురుషుడు తప్పనిసరిగా ఉండాల్సిందే. దీనికితోడు కొత్త నైతిక చట్టం మహిళల బహిరంగ ప్రసంగాలపై నిషేధం విధించింది. ఈ పరిస్థితిని
ఐక్యరాజ్యసమితి ‘లింగ వివక్ష’గా అభివర్ణించింది. తాలిబన్ ప్రభుత్వం మాత్రం ఇది నిరాధారమని, దుష్ప్రచారం అని కొట్టి పారేసింది. మహిళల హక్కులపై తాలిబన్‌ల ఉక్కుపాదం గురించి నీలా పాడిన శక్తిమంతమైన నిరసన పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాట అఫ్గాన్ సమాజంపై చూపిన ప్రభావం ఇంతా అంతా కాదు. నీలా ‘ఐయామ్ మైసాంగ్’ మూవ్‌మెంట్ మహిళల హక్కులపై గొంతు విప్పడానికి ఎంతోమందికి స్ఫూర్తినీ, ధైర్యాన్ని ఇచ్చింది.
‘నేను చేసిన పని రిస్క్‌తో కూడుకున్నది. అది అత్యంత ప్రమాదకరమైనదని కూడా. అయితే ఆ సమయంలో నాకు అదేమీ తెలియదు. ఎందుకంటే అప్పుడు నా వయసు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది నీలా. ‘అంతర్జాతీయ బాలల శాంతి బహుమతిని గెలుచుకోవడం అంటే అఫ్గాన్ మహిళలు, బాలికల గొంతు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించడం. తాలిబన్‌ల ΄పాలనలో అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళల హక్కుల కోసం పోరాడాను. పోరాడుతూనే ఉంటాను’ అంటూ పురస్కార ప్రదానోత్సవంలో మాట్లాడింది నీలా.
నీలా పట్ల అభిమానం ఇప్పుడు అఫ్గాన్ సరిహద్దులు దాటింది. అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు అభిమానులు ఉన్నారు. అఫ్గాన్‌ను విడిచిన నీలా ఇబ్రహీమి ‘30 బర్డ్స్ ఫౌండేషన్’ సహాయంతో కుటుంబంతో కలిసి కెనడాలో నివసిస్తుంది. ‘నేను నా కొత్త ఇంట్లో సురక్షితంగా ఉన్నాను. అయితే అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమ్మాయిల గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. ప్రపంచంలో ఏ ్ర΄ాంతంలో మహిళల హక్కులు దెబ్బతిన్నా అది యావత్ ప్రపంచంపై ఏదో ఒకరకంగా ప్రభావం చూపుతుంది’ అంటుంది నీలా. ‘హర్ స్టోరీ’ కో–ఫౌండర్‌గా అఫ్గానిస్థాన్‌లోని అమ్మాయిలు తమ గొంతు ధైర్యంగా వినిపించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తోంది.
అఫ్గాన్‌లో మహిళా విద్య, హక్కులకు సంబంధించి జెనీవా సమ్మిట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ. యూకే హౌజ్ ఆఫ్ లార్డ్స్, కెనడియన్ ఉమెన్ ఫర్ ఉమెన్ ఆఫ్ అఫ్గానిస్థాన్ మాంట్రియల్ సమ్మిట్, టెడ్ వాంకూవర్‌లాంటి వివిధ కార్యక్రమాలలో తన గళాన్ని వినిపించిన నీలా ఇబ్రహీమీ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలాతో కలిసి పనిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment