టీనేజ్‌ పిల్లలను ఇలా హ్యాండిల్‌ చేస్తే.. దెబ్బకు మాట వింటారు | Parents How To Deal With Their Teenage Children Communicating Tips | Sakshi
Sakshi News home page

టీనేజ్‌ పిల్లలను ఇలా హ్యాండిల్‌ చేస్తే.. దెబ్బకు మాట వింటారు

Published Sun, Nov 26 2023 1:42 PM | Last Updated on Sun, Nov 26 2023 1:44 PM

Parents How To Deal With Their Teenage Children Communicating Tips - Sakshi

‘మా అమ్మాయి నిన్నమొన్నటి వరకూ చెప్పినట్లు వినేది. ఇప్పుడు ఏం చెప్పినా పట్టించుకోవడం లేదు. నాకు తెలుసులే అన్నట్లు మాట్లాడుతోంది. ఈ పిల్లతో వేగేదెట్లా’ ఓ తల్లి కలవరం. ‘నేనేం చెప్పినా మావాడు ఎదురు మాట్లాడుతున్నాడు. కొంచెం గొంతు పెంచితే చేతిలో ఉన్నది పగలకొట్టేస్తున్నాడు. ఎలా కంట్రోల్‌ చేయాలో అర్థం కావడంలేదు’ ఓ తండ్రి బాధ. టీనేజ్‌ పిల్లలున్న తల్లిదండ్రులందరిదీ ఇదే స్థితి. మొన్నటివరకు పిల్లిపిల్లల్లా తమ వెనుకే తిరిగిన బిడ్డలు ఇప్పుడు ఎదురు మాట్లాడుతుంటే భరించలేరు. బాధపడుతుంటారు. టీనేజ్‌ గురించి, ఆ వయసులో వారి తీరు గురించి తెలియకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆ వయసు పిల్లలతో ఎలా మాట్లాడో తెలుసుకుంటే వారిని అదుపు చేయడం, సరైన మార్గంలో నడిపించడం చాలా సులువైన విషయం. 

ఇదో విప్లవాత్మక దశ..
టీనేజ్‌ లేదా కౌమార దశ అనేది చాలా విప్లవాత్మకమైన దశ. హర్మోన్ల పని తీరు ఉధృతమవుతుంది. శారీరకంగా మార్పులు చోటుచేసుకుంటాయి. కొత్త కొత్త ఆలోచనలు.. కోరికలు పుడుతుంటాయి. సమాజాన్ని మార్చేయాలని.. ప్రపంచాన్ని జయించాలనే ఆవేశం ఈ వయసులో అత్యంత సహజం. బాల్యం నుంచి వయోజనుడిగా మారే క్రమంలో తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్తుంటారు. అది తమ సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకునే క్రమంలో భాగమే తప్ప తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత కాదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. వారి విమర్శలను సీరియస్‌గా తీసుకుని బాధపడకుండా లేదా గొడవ పడకుండా వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. 

స్నేహితుడిలా మాట్లాడాలి..
వయసుకు వచ్చిన పిల్లల్ని మనతో సమానంగా చూడాలని పెద్దలు చెప్తుంటారు. ఈ మాట పాటిస్తే చాలు బంధాలు, అనుబంధాలు బలోపేతమవుతాయి. చిన్నపిల్లలను తిట్టినట్టు తిట్టకుండా, కొట్టకుండా.. స్నేహితులతో మాట్లాడినట్లు మంచిగా మాట్లాడాలి. ఆ మేరకు కమ్యూనికేషన్‌ను మార్చుకోవాలి. వాళ్లు పెరిగి పెద్దవాళ్లవుతున్నారని, సొంతగా నిర్ణయించుకునే, నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్లకు ఉందని గుర్తించాలి, గౌరవించాలి. తమ జనరేషన్‌కు, పిల్లల జనరేషన్‌కు అభిప్రాయాలు, అభిరుచుల్లో తేడాలుంటాయని గుర్తించాలి, గౌరవించాలి. అప్పుడే వారితో సరైన రీతిలో కమ్యూనికేట్‌ చేయగలం.

సవాళ్లు విసరొద్దు..
ఇంట్లో టీనేజ్‌ పిల్లలున్నప్పుడు వాదోపవాదాలు సహజం. అయితే ఆ సమయంలో ఏం చెప్పాలో.. ఏం చెప్పకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. టీనేజర్‌ మన పెంపకాన్ని విమర్శిస్తున్నప్పుడు బాధగానే ఉంటుంది. అయినా సరే మనల్ని మనం సమర్థించుకోవడం మానేయాలి. ‘నాకు చేతనైంది నేను చేశా, నువ్వేం చేస్తావో చేసి చూపించు’ లాంటి సవాళ్లు విసరకూడదు. దానికన్నా ఏమీ మాట్లాడకపోవడం మంచిది. పిల్లలపై మాటల్లో గెలవడం కంటే, వాళ్ల మనసుల్లో నిలవడం ముఖ్యమని గుర్తించాలి. ఇలాంటి మాటలన్నీ తాత్కాలికమని అర్థం చేసుకోవాలి. ‘మేం పేరెంట్స్‌మి, మా మాట వినాలి’ అనే అహాన్ని లేదా అధికారాన్ని వదులుకుంటేనే ఇవన్నీ సాధ్యం. టీనేజర్‌

మిమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు..
1. నువ్వు చెప్పేది వింటున్నాను. ఇంకా బెటర్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తా. 
2. ఐయామ్‌ సారీ, ఇంకొంచెం బెటర్‌గా చేసి ఉండాల్సింది. 
3. ఈ పరిస్థితిని ఎలా డీల్‌ చేయాలో నాకన్నా నీకు ఎక్కువ తెలుసు. 
4. నువ్వు బాధపడేలా చేసినందుకు సారీ. 
5. మన మధ్య విషయాలు కష్టంగా ఉన్నాయని తెలుసు. దీన్ని బెటర్‌ చేసేందుకు ఇద్దరం కలసి పనిచేద్దాం. 
6. ఏం జరిగినా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకో. మన మధ్య బంధం బలంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉన్నా.

మీ టీనేజర్‌ కష్టపడుతున్నప్పుడు.. 
1. నేను నీకు ఎలా హెల్ప్‌ చేయగలనో చెప్పు. 
2. నీకు నేనున్నాను. 
3. నేను నిన్ను, నీ సామర్థ్యాన్ని నమ్ముతాను. 
4. అవును, అది చాలా కష్టంగా ఉంది. 
5. అవును, అది కష్టమని నువ్వు అనుకోవడం కరెక్టే. 
6. తప్పులు చేయడం ఓకే. అందరం చేస్తాం.

టీనేజర్‌ పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి..
1.  ఐ లవ్‌ యూ ఫర్‌ హూ యూ ఆర్‌. 
2. నీతో సమయం గడపడం నాకు చాలా ఇష్టం.
3. ఐ యామ్‌ గ్రేట్‌ఫుల్‌ ఫర్‌ యూ.
4. నువ్వు సాధించిన దాని గురించి కాదు.. ఐ యామ్‌ సో ప్రౌడ్‌ ఆఫ్‌ యూ ఫర్‌ హూ యు ఆర్‌. 
5. మనిద్దరం కలసి మంచి జ్ఞాపకాలను సృష్టించడం నాకు చాలా ఇష్టం.
6. నువ్వు నా దగ్గరకు రావడం, నాతో ఉండటం నాకు చాలా ఇష్టం.  

--సైకాలజిస్ట్‌ విశేష్‌ 
psy.vishesh@gmail.com 

(చదవండి: ఎవరికీ కనిపించనివి కనిపిస్తున్నాయా?.. వినిపించనివి వినిపిస్తున్నాయా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement