కాయల్లోన నిమ్మకాయ వేరయా...!
‘‘నాకెందుకో క్షుద్రదేవతలక్కూడా నిమ్మకాయలు ఇష్టమేమో అనిపిస్తోందిరా’’ అన్నాడు మా రాంబాబు. వాడు బిర్యానీ పార్టీ ఇస్తానన్నప్పట్నుంచే నాకెందుకో గుండె పీచుపీచుమంటోంది. అయినా బగారా పట్ల నాకున్న మక్కువ కొద్దీ రిస్క్ తీసుకున్నా. రిజల్ట్ కనిపించడం మొదలైపోయింది. అయినా అడిగా, ‘‘క్షుద్రదేవతలకూ నిమ్మకాయలతో సంబంధం ఏమిట్రా?’’ అని.
‘‘గమనించావా? క్షుద్రదేవతోపాసన చేశాక నైవేద్యాన్ని కూడలిలో పెడుతుంటారు. వాటితో పాటు నిమ్మకాయలు కోసి ఉంచుతుంటారు. దీన్ని బట్టి తెలిసేదేమిటి? క్షుద్రదేవతలు తమ నైవేద్యాలను తింటూ రుచి కోసం నిమ్మకాయలు పిండుకుంటారన్న మాట’’
‘‘దెయ్యాల కథలు మళ్లీ మళ్లీ చెప్పకు. బోరుకొడుతుంది’’ అన్నాన్నేను.
‘‘ఛ...ఛ... మొన్న దెయ్యాలగురించి చెప్పినందుకే నన్ను చాటుగా నరరూపదెయ్యం అంటున్నారట. నేను చెప్పేదల్లా ఒకటే. క్షుద్రదేవతలకూ మనుషులకూ అనుసంధానమైనదీ... నిమ్మకాయ. ఇలా రెండు వర్గాలను ఏకకాలంలో మెప్పించిందంటే నిమ్మకాయ గొప్పదనే కదా అర్థం’’
‘‘నీ పిచ్చిగాకపోతే రోజూ వాడే నిమ్మకాయకు గొప్పదనమేమిట్రా?’’
‘‘మామూలు కాయలెన్నున్నా నిమ్మకాయ గొప్పదనం నిమ్మకాయదేరా! భూదేవికి లాగే దానికి ఓర్పు చాలా ఎక్కువ’’
‘‘నిమ్మకాయకు ఓర్పేమిట్రా నా ముఖం!’’
‘‘నువ్వు కొత్తకారు కొంటావా. వెంటనే పెట్రోలు పోయించడమైనా ఆలస్యం చేస్తావేమోగానీ... ముందుగా రెండుమూడు నిమ్మకాయలు కలిపి కారు ముందు కట్టేస్తావు. ఎందుకనీ... నీ కారుపైన పడే చెడు దృష్టినంతా అవి స్వీకరించాలని. అంతటితో ఆగుతావా? నాలుగు చక్రాల కిందా నాలుగు నిమ్మకాయలు పెట్టి తొక్కిస్తావు. నీ కారు నిక్షేపంగా ఉండాలనే నీ స్వార్థానికీ, నరదిష్టికి నీకారు బేకారు కాకూడదనే నీ నమ్మకానికీ నిశ్శబ్దంగా నలిగిపోతుంటాయిరా నిమ్మకాయలు. అంతే కాదు... వాటిని అడ్డంగా కోసేస్తున్నా, పీకపట్టుకు పిసికేస్తున్నా, ఒళ్లంతా పిండేస్తున్నా రసభరితమైన రుచితో మాంసాహారివైతే నీ బగారాబిర్యానీలనూ, శాకాహారివైతే నీ నిమ్మకాయపులిహోరలనూ మరింత టేస్టీగా చేసే త్యాగబుద్ధి నిమ్మదేరా. అపకారికి ఉపకారము నెపమెన్నక చేసే నిమ్మకాయకిదే నా నివాళి’’ అంటూ కాస్త నిమ్మకాయ పిండిన ఉల్లిపాయను బగారా రైస్ ముద్దతో పాటూ నోట్లో పెట్టుకుంటూ ఆవేశపడ్డాడు మా రాంబాబుగాడు.
‘‘నువ్వు చెబుతుంటే నిజమేననిపిస్తోందిరా. నిజంగా నిమ్మ చాలా ఘనమైనదే’’. వాడు మరింత రెచ్చిపోకుండా అక్కడితో ఆగిపోయేందుకు పోన్లే అంటూ సపోర్టుగా ఓ మాట అన్నా. అంతే... వాడు మళ్లీ రెచ్చిపోయాడు.
‘‘ఘన అన్న పదం తప్పురా... గజ అన్న పదం వాడాలి. ఎందుకంటే... ‘గజదొంగ’లాగే ‘గజనిమ్మ’ అనే మాటే తెలుగులో ఉంది. పోన్లే నువ్విప్పుడు ఘననిమ్మ అంటూ కొత్త పదం కాయిన్ చేసినా నేనేం బాధపడను. ఎందుకంటే ఎటు చూసినా ఒకటేలా చదవగలిగే ‘వికటకవి’ అన్నమాట అంటుంటే అందులో కాస్త చిలిపిదనమే ధ్వనిస్తుంటుంది. కానీ నిమ్మగింజను పట్టుకుని ‘జంబీరబీజం’ అని అంటే అందులో పదాల గంభీరనైజమే ధ్వనిస్తుంటుంది’’ అన్నాడు వాడు.
‘‘అరే... నువ్వు నిమ్మకాయను పట్టుకుని అలా పొగిడేయకు. నిమ్మకాయ కొందరికి నెమ్ముకాయరా. అది వాడగానే వాళ్లకు జలుబు చేస్తుంది కాబట్టే నేను దాన్ని నెమ్ముకాయ అంటా’’ కాస్త తెగించి కాస్త విమర్శ కోసం ఓ మాట అన్నా.
‘‘హుం... నీకేమి తెలుసురా నిమ్మకాయ సైన్సు విజ్ఞానం! అందులో ఉండే సి విటమిన్ నిజానికి జలుబునూ, నెమ్మునూ, దమ్మునూ తగ్గిస్తుందట. అంతటి దమ్మున్నకాయ అది. అందరి దిష్టి తీసీ, తీసీ దానికి దిష్టి తగలడం వల్లనేమో దానికీ అపకీర్తి వచ్చింది. కానీ నిజానికి ‘ఎ నిమ్మకాయ ఎవ్రీడే... కీప్స్ ద జలుబు అవే’ తెల్సా. అంతెందుకు నిమ్మకాయ మగతనానికి గుర్తురా బాబూ’’
‘‘నిమ్మకాయకూ, మగతనానికీ సంబంధమేంట్రా. ఇదేదో కొత్త విషయం చెబుతున్నావు’’ అంటూ ఆశ్చర్యపడ్డా.
‘‘అంతేరా... ఎవడైనా తమ మగతనానికి చిహ్నమైన మీసాల గురించి మాట్లాడాల్సి వస్తే... వాటిమీద నిమ్మకాయలనే పెట్టాలంటారుగానీ... లోకంలో మరెన్నో కాయలున్నా వాటి గురించి మాట్లాడరెందుకు? క్షుద్రదేవతలకూ మనుషులకూ అనుసంధానమైనదిలాగే.. మీసాలకూ, మగతనపు పవరుకూ అనుసంధానమైనదీ నిమ్మకాయ. అందుకోసమేనేమో... ఒకసారి వీణావాద్యంలో తన నైపుణ్యాన్ని చాటిచెప్పేందుకు వాసా అప్పయ్యగారనే విద్వాంసులు మీసాలమీదేం ఖర్మ ఏకంగా నెత్తి మీది జుత్తుమీదే నిమ్మకాయ నిలబెట్టి వీణవాయించారట. నువ్వు నా మాటెందుకు నమ్ముతావుగానీ... ఇది తనికెళ్ల భరణిగారు చెప్పిన విషయం తెల్సా’’ అంటూ తన మాటకు తిరుగులేని సాక్ష్యాన్ని తోడు తెచ్చుకున్నాడు.
ఇంకా మాట్లాడితే ఇంకేమేం అంటాడో అని... వాడు కాస్త ‘నిమ్మ’ళించడానికి నేనిక నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయా.
- యాసీన్