
గల్లీలు కావవి... అందమైన మెహందీ రేఖలు!
అమ్మాయిలు పెట్టుకునే గోరింటాకుకూ... అందమైన హైదరాబాద్‌కూ ఓ అపురూపమైన సంబంధం ఉంది. అదెలాగంటే..!
అందరూ ఓల్డ్ సిటీని ఇరుకిరుకు గల్లీల నిలయంగా చెబుతుంటారు గానీ.. నాకెందుకో ఆ నాటికి అలా ఇళ్లు కట్టుకోవడం కరెక్టే అనిపిస్తుంటుంది. ఇరుకిరుకు గల్లీలను చూసి వాళ్లేదో నాగరికత తెలియక అలా చేశారనుకోవడానికి వీల్లేదు. గల్లీ ఇరుకైందంటే అర్థం... అప్పటి మనుషుల మనసులు చాలా విశాలంగా ఉన్నాయని.
ఇదేంట్రా బాబూ... ఈ వాదనేమిటీ అనే సందేహం వద్దు. ఇలా ఇరుకిరుకుగా ఇళ్లు కట్టుకున్నారంటే మనుషులు చాలా దగ్గర దగ్గరగా ఉండటాన్ని కోరుకున్నారని దానర్థం. ఎంత ఇరుకుగా ఉంటే అంత దగ్గరగా ఉండాలని కోరుకున్నారన్నమాట. అంటే పూలదండలో పువ్వు పువ్వుకూ మధ్య స్థలం ఎంత తక్కువగా ఉంటే హారం అంత ఒత్తుగా ఉంటుందన్నట్టు. హారం ఎంత ఒత్తుగా ఉంటే దాని విలువ అంత ఎక్కువన్న మాట. దూరం దూరంగా అల్లిన హారాన్ని మగువలు కోరుకుంటారా? ధర ఎక్కువ పెట్టి కొంటారా? దీన్ని బట్టి తెలిసేదేమిటి?
ఇళ్లెంతగా దగ్గర దగ్గరగా ఉంటే వాళ్లంతటి ఒత్తై సామాజిక జీవనాన్ని కోరుకున్నట్లన్నమాట. ఒక్క పూలమాలతోనే ఉదాహరణే ఎందుకు? అమ్మాయిలు పెట్టుకునే మెహందీ అనండి లేదా గోరింటాకు అనండి. దీన్ని కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అరచేతి మీద కోన్‌తో గీసే ఆ సన్నటి గీతల మధ్య చాలా చాలా దూరం ఉందనుకోండి. ఆ డిజైన్ బోసిగా ఉండదూ! అదే అందమైన తీగలు చుట్టలు చుట్టుకున్నట్లుగా, చేయి తిరిగిన కళాకారుడు అలవోకగా మెలికలు తిప్పుతూ గీసిన గీతలు ఒత్తుగా ఉంటేనే చేతిలోని ఆ చిత్రాకృతికి అందం, చందం.
మీరు గమనించి చూశారో లేదో... ఈ మెలికల డిజైన్లు కేవలం అరచేతి వరకే పరిమితం కావు. అచ్చం హైదరాబాద్ శివార్లను దాటి ఒకవైపు సదాశివపేట్ వరకూ, మరోవైపు చౌటుప్పల్ వరకూ, ఇంకోవైపు చేవెళ్ల వరకూ పాకేసినట్లుగా.. ఆ డిజైన్లు కూడా అరచేతిని దాటేసి దాదాపు మోచేయి వరకూ పాకేస్తాయి. ఏం చేస్తాం. మెహందీ వేసుకోవాలన్న కోరిక ఎంత బలమైనదో... హైదరాబాద్‌నే నివాసం చేసుకుని ఆవాసం ఉండిపోవాలన్న కోరికా అంతగా తీవ్రమైనది. అందుకే ఈ పాకులాట.ఇక ఒక్కోసారి చేతికి ఒత్తుగా గోరింటాకు పూసినా సరే... చేతి ముడతల్లోని గీతల్లో రంగు అంటక అక్కడ ఖాళీ కనిపించినట్లుగా ఉంటుంది కదా... మూసీ పారే చోట అచ్చం అలాగే రంగు విడిపోయి కనిపిస్తుంది.
వెరసి.. మెహందీ అంత అందమైనదీ... మెత్తనైనదిలా కనిపించే ఒత్తైదీ, చిక్కనైనది... బహు చక్కనైనది, అరచేతిన ఇమడకుండా హద్దులకు అందకుండా విస్తరించేది... స్వర్గం మన అరచేతికి అందేంత దూరంలో ఉందంటే అది హైదరాబాదే!
యాసీన్